వృద్ధిమాన్..సూపర్ మ్యాన్!

వృద్ధిమాన్..సూపర్ మ్యాన్!


పుణ్: వృద్ధిమాన్ సాహా.. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ జట్టుకు రెగ్యులర్ వికెట్ కీపర్. భారత టెస్టు క్రికెట్ నుంచి మహేంద్ర సింగ్ ధోని వైదొలిగిన తరువాత ఆ స్థానాన్ని సాహా భర్తీ చేస్తున్నాడు. అటు మరో వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ నుంచి పోటీ ఉన్నప్పటికీ సాహాపైనే భారత సెలక్టర్లు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇందుకు కారణం సాహా టెక్నిక్ మెరుగ్గా ఉండటమే. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో సాహా మరోసారి నిరూపించాడు. 


 


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో భాగంగా  గురువారం మొదటిరోజు ఆటలో భారత పేసర్ ఉమేశ్ యాదవ్ 82ఓవర్ లో సాహా గాల్లో డైవ్ కొట్టి క్యాచ్ ను అందుకున్న తీరు అదుర్స్ అనిపించింది. ఉమేశ్ 141కి.మీ వేగంతో సంధించిన ఆ బంతిని ఆసీస్ ఆటగాడు ఓ కీఫ్ కట్ చేయబోయాడు. అదే వేగంతో ఆ బంతి ఫస్ట్ స్లిప్ కు దారి తీసింది. అయితే సాహా మాత్రం రెప్పపాటులో గాల్లో చక్కటి డైవ్ కొట్టి క్యాచ్ ను అందుకున్నాడు. అంతే అసాధారణ రీతిలో సాహా క్యాచ్ పట్టడం టీమిండియా సభ్యుల్ని ఒక్కసారిగా నిశ్చేష్టుల్ని చేసింది. వృద్ధిమాన్ క్యాచ్ పట్టిన తీరుపై సోషల్ మీడియాలో కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. 'అలా సాహా గాల్లో ఎగిరడానికి ఏమని పిలవాలి' అంటూ టీమిండియా సభ్యుడు రోహిత్ శర్మ ఆశ్చర్యం వ్యక్తం చేయగా, ' అలా బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్లు మాత్రమే చేస్తారంటూ మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా ప్రశంసించాడు. అంతటి అద్భుతమైన వికెట్ కీపింగ్ క్యాచ్ ను ఇటీవల కాలంలో తాను చూడలేదని మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో మంచి క్యాచ్ల్ని సాహా అందుకున్నప్పటికీ, ఈ క్యాచ్ మ్యాత్రం అతని కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజా క్యాచ్తో వృద్ధిమాన్ కాస్తా సూపర్ మ్యాన్ అయిపోయాడు కదా!

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top