మిగిలేదెవరో..!


మొత్తం 14 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి తలపడుతున్న ప్రపంచకప్ లీగ్ దశలో ఇప్పటి వరకు 28 మ్యాచ్‌లు ముగిశాయి. ఇక 14 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ క్వార్టర్స్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా... మిగిలిన ఆరు జట్ల విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్ కొనసాగుతోంది. గ్రూప్ ‘ఎ’లో అఫ్ఘానిస్తాన్, స్కాట్లాండ్‌కు నాకౌట్ అవకాశాల్లేవు. కానీ ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ల మధ్య క్వార్టర్స్ బెర్త్ ఎవరికో తేలాల్సి ఉంది. ఇక గ్రూప్ ‘బి’లో రెండు స్థానాల కోసం మూడు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఏ ఏ జట్ల అవకాశాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం!       

 - సాక్షి క్రీడావిభాగం

 

 గ్రూప్ ‘ఎ’: ఒక బెర్త్.. రెండు జట్లు

 న్యూజిలాండ్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి 8 పాయింట్లతో ఇప్పటికే క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌లపై ఒక్కదానిపై గెలిచినా కివీస్ గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది.

 

 శ్రీలంక ఆరు పాయింట్లతో ఉంది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, స్కాట్లాండ్‌లతో ఆడాలి. ఆసీస్ చేతిలో ఓడినా.. స్కాట్లాండ్‌పై గెలిస్తే 8 పాయింట్లతో క్వార్టర్స్‌లో చోటు దక్కుతుంది.

 

 ప్రస్తుతం ఆస్ట్రేలియా 5 పాయింట్లతో ఉంది. లంక, స్కాట్లాండ్‌లతో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండింటిలో గెలిస్తే 9 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలోకి వెళ్లొచ్చు. లేక ఒక మ్యాచ్ గెలిస్తే 7 పాయింట్లతో... బంగ్లాదేశ్ మ్యాచ్‌ల ఫలితం కోసం చూడాలి.




 బంగ్లాదేశ్ కూడా 5 పాయింట్లతో ఉండగా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిలో బంగ్లాదేశ్ గెలవడం కష్టమే. ఒకవేళ ఇందులో ఒకటి గెలిచినా.. ఆసీస్‌తో సమానంగా పాయింట్లు (ఆసీస్ ఒక్కటే గెలిస్తే) ఉంటాయి. కాబట్టి నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది.

 

  మరోవైపు 2 పాయింట్లతో ఉన్న ఇంగ్లండ్‌కు కూడా క్వార్టర్స్ అవకాశాలు ఉన్నాయి. తమ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో అఫ్ఘాన్, బంగ్లాదేశ్‌లపై గెలిస్తే.. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఆరు పాయింట్లతో ఇంగ్లండ్ క్వార్టర్స్‌కు చేరుకుంటుంది. బంగ్లాదేశ్  కచ్చితంగా రెండు మ్యాచ్‌లూ ఓడితే  5 పాయింట్లతో వెనక్కి వచ్చేస్తుంది. కాబట్టి ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మ్యాచ్ ఈ గ్రూప్‌కి  కీలకం కానుంది.

 

 గ్రూప్ ‘బి’: మూడులో రెండు

 భారత్ 8 పాయింట్లతో క్వార్టర్స్‌కి చేరింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్, జింబాబ్వేలపై గెలిస్తే 12 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానం ధోనిసేనదే.

 

 6 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా.. తర్వాతి మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, యూఏఈలతో తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో సఫారీ జట్టు ఒక్క మ్యాచ్ గెలిచినా క్వార్టర్స్‌కు చేరుతుంది.

 

 ప్రస్తుతం 4 పాయింట్లతో ఉన్న పాకిస్తాన్‌కు దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌లతో మ్యాచ్‌లు ఉన్నా యి. దక్షిణాఫ్రికా చేతిలో ఓడి, ఐర్లాండ్‌పై గెలిస్తే 6 పాయింట్లు ఉంటాయి. ఇప్పటికే 5 మ్యాచ్‌లు ఆడిన వెస్టిండీస్ ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. తర్వాతి మ్యాచ్‌లో యూఏఈపై గెలిస్తే కరీబియన్ జట్టుకు కూడా 6 పాయింట్లు ఉంటాయి.

 

 

 ప్రస్తుతం 4 పాయింట్లతో ఉన్న ఐర్లాండ్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు ఉన్నాయి. జింబాబ్వే, భారత్, పాకిస్తాన్‌లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్కటి గెలిచినా.. వీళ్ల ఖాతాలో కూడా 6 పాయింట్లు ఉంటాయి. అప్పుడు గ్రూప్‌లో  మూడు నాలుగు స్థానాల కోసం విండీస్, పాకిస్తాన్, ఐర్లాండ్‌ల మధ్య నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top