పేస్ ‘పరీక్ష’లో పాస్!

పేస్ ‘పరీక్ష’లో పాస్!


 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌కు భారత్

 వెస్టిండీస్‌పై నాలుగు వికెట్లతో విజయం

 రాణించిన షమీ, ధోని

 టోర్నీలో వరుసగా నాలుగో గెలుపు

 తర్వాతి మ్యాచ్ మంగళవారం ఐర్లాండ్‌తో


 

 ప్రపంచకప్ మొదలైన 20 రోజుల తర్వాత తొలిసారి భారత్‌కు అసలు సిసలు పరీక్ష ఎదురైంది. పరుగుల జాతర జరుగుతున్న టోర్నీలో తొలిసారి అసలైన పేస్, బౌన్స్ వికెట్ ఎదురైంది... ప్రత్యర్థి జట్టులో చూస్తే ఐదుగురు పేసర్లు... అయినా పరిస్థితికి తగ్గట్లుగా ఆటతీరును మార్చుకుంటూ భారత్ ఈ పరీక్షలో పాస్ అయింది. మన సీమర్లు నిప్పులు చెరిగే బంతులతో వెస్టిండీస్‌ను కట్టడి చేస్తే... లోయర్ మిడిలార్డర్ ఒత్తిడిని తట్టుకుని నిలబడింది.

 

 ఇన్నాళ్లూ ఇలాంటి లక్ష్యఛేదనలో ధోని, అశ్విన్ లాంటి క్రికెటర్లు ఎలా ఆడతారనే అనుమానాలకు ఈ మ్యాచ్ ద్వారా సమాధానం దొరికింది. ప్రధాన బ్యాట్స్‌మెన్ అవుటై కాస్త తడబడ్డ స్థితిలో... వీరు అనవసరంగా వికెట్లు పారేసుకోకుండా జట్టును నిలబెట్టగలిగారు. వెస్టిండీస్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన భారత్...మొత్తానికి మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.


 

 పెర్త్: భారత్ విజయలక్ష్యం 183 పరుగులే...యూఏఈ మ్యాచ్‌లాగే ఇది కూడా మనోళ్లకు మంచినీళ్ల ప్రాయమే అనిపించింది. అయితే అనూహ్యంగా ఇన్నింగ్స్ కుదుపునకు లోనైంది. ఒక దశలో స్కోరు 78/4...ఆ తర్వాత 134/6 వద్ద నిలిచింది. ఇంకా 49 పరుగులే చేయాల్సి ఉన్నా... అప్పటి వరకు సాగిన ఆట, వికెట్ స్వభావం చూస్తే ప్రతీ పరుగు కష్టంగా వస్తోంది.

 

 ఈ సమయంలో కెప్టెన్ ధోని (56 బంతుల్లో 45 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) నిలబడ్డాడు. తన సహజశైలిని పక్కన పెట్టి, ఏకాగ్రత చెదరకుండా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఏడో వికెట్‌కు అశ్విన్ (16 నాటౌట్)తో అభేద్యంగా 51 పరుగులు జోడించి జట్టును క్వార్టర్స్ చేర్చాడు. టాపార్డర్‌లో కోహ్లి (36 బంతుల్లో 33; 5 ఫోర్లు) కూడా రాణించడంతో శుక్రవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది.

 

 టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 44.2 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ హోల్డర్ (64 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షమీ (3/35) విండీస్ వెన్నువిరవగా... జడేజా, ఉమేశ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 39.1 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు నెగ్గిన ధోని సేన క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం హామిల్టన్‌లో జరిగే తమ తర్వాతి లీగ్ మ్యాచ్‌లో భారత్, ఐర్లాండ్‌తో తలపడుతుంది.

 

 హోల్డర్ మినహా: వెస్టిండీస్‌కు మరోసారి పేలవమైన ఆరంభం లభించింది. ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమించిన డ్వేన్ స్మిత్ (6)ను షమీ అవుట్ చేయడంతో ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఐదు బంతుల వ్యవధిలో రెండు కష్టసాధ్యమైన క్యాచ్‌లు (ఉమేశ్, షమీ) వదిలేయడంతో గేల్ (21) బతికిపోయాడు. దీని వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం జరగలేదు.

 

 మన పేసర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు గేల్ ఆటలు సాగలేదు. సింగిల్స్ తీయలేని గేల్, కొడితే సిక్స్...లేదంటే లేదు అనే తరహాలో ప్రతీ బంతికి బ్యాట్ ఝళిపించాడు. లేని పరుగు కోసం ప్రయత్నించిన శామ్యూల్స్ (2) మోహిత్ చక్కటి ఫీల్డింగ్‌కు రనౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే షమీ షార్ట్ బంతితో గేల్ పని పట్టాడు. ఆఫ్‌సైడ్‌నుంచి పుల్ చేయబోయిన గేల్, డీప్ స్క్వేర్ లెగ్‌లో సునాయాస క్యాచ్ ఇచ్చాడు.

 

 మరుసటి బంతికే రామ్‌దిన్ (0)ను ఉమేశ్ బౌల్డ్ చేయడంతో పవర్ ప్లే ముగిసే సరికి విండీస్ స్కోరు 38/4కు చేరింది. ఆ తర్వాత విండీస్ 18 పరుగుల వ్యవధిలో మరో 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్యామీ (26)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసిన హోల్డర్... ఆ తర్వాత దూకుడుగా ఆడి తొమ్మిదో వికెట్‌కు టేలర్ (11)తో 44 బంతుల్లోనే 51 పరుగులు జత చేశాడు. ఈ క్రమంలో అతను 56 బంతుల్లో వరుసగా రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి హోల్డర్ చివరి వికెట్‌గా వెనుదిరగడంతో విండీస్ 200 పరుగుల మార్క్‌ను కూడా చేరుకోలేకపోయింది. భారత బౌలర్లంతా సమష్టిగా రాణించడం విశేషం.

 

 తడబడుతూనే...: భారత బ్యాటింగ్ బలగాన్ని చూస్తే 183 పరుగులు సునాయాస లక్ష్యంగానే కనిపించింది. అయితే జట్టుకు విజయం అంత సులువుగా దక్కలేదు. టేలర్ వరుసగా తన రెండు ఓవర్లలో ధావన్ (9), రోహిత్ (7)లను అవుట్ చేసి విండీస్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఈ దశలో రహానే (14)తో జాగ్రత్తగా ఆడిన కోహ్లి... మూడో వికెట్‌కు 43 పరుగులు జత చేశాక పుల్ షాట్ ఆడబోయి లాంగ్‌లెగ్‌లో చిక్కాడు.

 

 అంపైర్ అనుమానాస్పద నిర్ణయంతో రహానే పెవిలియన్ చేరుకోవాల్సి వచ్చింది. ఈ దశలో విండీస్ బౌలింగ్ కట్టుదిట్టంగా సాగింది. ధాటిగా ఆడబోయి రైనా (22; 2 ఫోర్లు), జడేజా (13) తక్కువ వ్యవధిలోనే వెనుదిరగడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే ధోని, అశ్విన్ కలిసి ఆందోళనకు లోను కాకుండా ప్రశాంతంగా ఆడి భారత విజయాన్ని ఖాయం చేశారు.

 

 విదేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ (59)గా ధోని. విండీస్‌పై గెలుపుతో అతను గంగూలీ (58)ని అధిగమించాడు.

 

భారత్ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం  2006 తర్వాత ఇదే మొదటి సారి.


 

 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది వరుసగా ఎనిమిదో విజయం. 2011లో చివరి నాలుగు మ్యాచ్‌లు నెగ్గిన భారత్, ఇప్పుడు నాలుగు విజయాలు సొంతం చేసుకుంది. 2003లోనూ భారత్ వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచింది.

 

 ప్రపంచకప్‌లో విండీస్‌పై వరుసగా మూడో మ్యాచ్‌లోనూ (1996, 2011, 2015) భారత్ గెలిచింది.  ఓవరాల్‌గా ప్రపంచకప్ చరిత్రలో వెస్టిండీస్‌పై భారత్‌కిది ఐదో విజయం.

 

 

 స్కోరు వివరాలు

 వెస్టిండీస్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) ధోని (బి) షమీ 6; గేల్ (సి) మోహిత్ (బి) షమీ 21; శామ్యూల్స్ (రనౌట్) 2; కార్టర్ (సి) షమీ (బి) అశ్విన్ 21; రామ్‌దిన్ (బి) ఉమేశ్ 0; సిమన్స్ (సి) ఉమేశ్ (బి) మోహిత్ 9; స్యామీ (సి) ధోని (బి) షమీ 26; రసెల్ (సి) కోహ్లి (బి) జడేజా 8; హోల్డర్ (సి) కోహ్లి (బి) జడేజా 57; టేలర్ (సి) అండ్ (బి) ఉమేశ్ 11; రోచ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (44.2 ఓవర్లలో ఆలౌట్) 182. వికెట్ల పతనం: 1-8; 2-15; 3-35; 4-35; 5-67; 6-71; 7-85; 8-124; 9-175; 10-182. బౌలింగ్: షమీ 8-2-35-3; ఉమేశ్ 10-1-42-2; అశ్విన్ 9-0-38-1; మోహిత్ 9-2-35-1; జడేజా 8.2-0-27-2.

 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రామ్‌దిన్ (బి) టేలర్ 7; ధావన్ (సి) స్యామీ (బి) టేలర్ 9; కోహ్లి (సి) శామ్యూల్స్ (బి) రసెల్ 33; రహానే (సి) రామ్‌దిన్ (బి) రోచ్ 14; రైనా (సి) రామ్‌దిన్ (బి) స్మిత్ 22; ధోని (నాటౌట్) 45; జడేజా (సి) శామ్యూల్స్ (బి) రసెల్ 13; అశ్విన్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (39.1 ఓవర్లలో 6 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1-11; 2-20; 3-63; 4-78; 5-107; 6-134. బౌలింగ్: టేలర్ 8-0-33-2; హోల్డర్ 7-0-29-0; రోచ్ 8-1-44-1; రసెల్ 8-0-43-2; స్మిత్ 5-0-22-1; శామ్యూల్స్ 3.1-0-10-0.  

 

 ప్రపంచ కప్‌లో నేడు (శనివారం)

 దక్షిణాఫ్రికా   x పాకిస్తాన్

 గ్రూప్ బి; వేదిక: ఆక్లాండ్

 ఉ. గం. 6.30 నుంచి

 స్టార్‌స్పోర్ట్స్-1లో

 ప్రత్యక్ష ప్రసారం

 

 ఐర్లాండ్ x జింబాబ్వే

 గ్రూప్ బి; వేదిక: హోబర్ట్

 ఉ. గం. 9.00 నుంచి

 స్టార్‌స్పోర్ట్స్-2లో

 ప్రత్యక్ష ప్రసారం

 

 రేపటి మ్యాచ్‌లు (ఆదివారం)

 న్యూజిలాండ్ x అప్ఘానిస్తాన్

 గ్రూప్ ఎ; వేదిక: నేపియర్

 తె. జా. గం. 3.30 నుంచి

 స్టార్‌స్పోర్ట్స్-4లో

 ప్రత్యక్ష ప్రసారం

 

 ఆస్ట్రేలియా x శ్రీలంక

 గ్రూప్ ఎ; వేదిక: సిడ్నీ

 ఉ. గం. 9.00 నుంచి

 స్టార్‌స్పోర్ట్స్-1లో

 ప్రత్యక్ష ప్రసారం


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top