‘రంగు’ పడాలి!

‘రంగు’ పడాలి!


 నేడు వెస్టిండీస్  x భారత్

 నాలుగో విజయంపై ధోనిసేన గురి

 గేల్‌పైనే కరీబియన్ల ఆశలు


 

 చిలుకపచ్చ పాక్‌ను చిత్తు చేశాం... ఆకుపచ్చ దక్షిణాఫ్రికాను పడగొట్టాం... బూడిదరంగు యూఏఈని ముంచేశాం... ఇక మెరూన్ కలర్ కరీబియన్ల వంతు వచ్చేసింది... ఏ మాత్రం అలసత్వం చూపకుండా వీళ్లపై కూడా ‘నీలిరంగు’ జల్లేస్తే...ఓ పనైపోతుంది.

 భారత్‌కు అధికారికంగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది.


 

 తర్వాత ఎలాగూ రెండు చిన్న జట్లతోనే మ్యాచ్‌లు కాబట్టి... గ్రూప్‌లో ‘టాప్’ లేపొచ్చు. ఉదయంనుంచి రంగులతో తడిసి ముద్దయ్యే భారత అభిమానులు... మధ్యాహ్నం నుంచి ధోనిసేన ఆడబోయే ‘రన్’గేళి కోసం ఎదురుచూస్తున్నారు. గేల్ సుడిగాలి ఇన్నింగ్స్‌లాంటివి లేకపోతే భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు రోజంతా వర్ణరంజితమే.

 

 పెర్త్: ప్రస్తుత క్రికెట్‌లో అనిశ్చితికి మారుపేరు వెస్టిండీస్. ఏ రోజు 300 బాదుతారో... ఏ రోజు 100కి చాప చుట్టేస్తారో ఎవరూ చెప్పలేరు. ప్రత్యర్థి పసికూనా లేక బలమైనా జట్టా అనే అంశంతో సంబంధం లేదు. కాబట్టి ఇలాంటి జట్టుతో మ్యాచ్ అంటే కచ్చితంగా జాగ్రత్తగా ఆడాలి. వెస్టిండీస్ క్రికెటర్లు ఎంత ప్రమాదకరమో భారత ఆటగాళ్లకు తెలిసినంత గా మరెవరికీ తెలియదు.

 

 అందుకే ఎలాంటి ఉదాసీనతకు తావు లేకుండా కరీబియన్స్‌నూ చిత్తు చేస్తే... ధోనిసేన అధికారికంగా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. శుక్రవారం వాకా మైదానంలో జరిగే ఈ గ్రూప్ బి మ్యాచ్‌లో విండీస్ అవకాశాలు క్రిస్ గేల్ రాణింపుపైనే ఆధారపడి ఉంటాయనడంలో సందేహం లేదు.

 

 అన్నీ అనుకూలం...

 ఇటీవల ఇరు జట్ల మధ్య  అర్ధాంతరంగా రద్దయిన వన్డే సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యం కనబర్చింది. గత ప్రదర్శన, ఫామ్ చూస్తే టీమిండియా వైపు మొగ్గు కనిపిస్తోంది. టాప్-3 ఆటగాళ్లలో ఇప్పటికే ధావన్, కోహ్లిలు సెంచరీ సాధించగా, గత మ్యాచ్‌లో రోహిత్ ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత రైనా, రహానే, ధోనిలతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. పెద్దగా అనుభవం లేని విండీస్ బౌలింగ్ వీరికి ఎలాంటి సమస్యలు సృష్టించకపోవచ్చు. అయితే ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉన్న జడేజా బ్యాటింగ్‌లో ఇంకా తనదైన ముద్ర వేయలేదు. ఈ మైదానంలో ఇటీవల ముక్కోణపు టోర్నీ మ్యాచ్‌తో పాటు యూఏఈతో ఆడిన భారత్‌కు వికెట్‌పై మంచి అవగాహన ఉంది. భారత పేస్ విభాగం కూడా మంచి జోరుమీదుంది.

 

  గత మ్యాచ్‌లో లేని షమీ పూర్తి ఫిట్‌నెస్‌తో సిద్ధమయ్యాడు. మరో వైపు విండీస్‌పై భువనేశ్వర్‌కు చక్కటి రికార్డు ఉంది. కాబట్టి ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మలతో పాటు మూడో పేసర్‌గా ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. స్పిన్నర్ అశ్విన్ ఈ మ్యాచ్‌లో మరింత కీలకం కానున్నాడు. ముఖ్యంగా గేల్‌ను కట్టడి చేసేందుకు కెప్టెన్, అశ్విన్ మంత్రాన్ని ఉపయోగించవచ్చు. మధ్య ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో జడేజా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇక్కడి బౌన్స్ కూడా ఈ ఇద్దరికి ఉపకరిస్తుంది.

 

 గేల్ చెలరేగుతాడా...

 ఆరుగురు బ్యాట్స్‌మెన్, ఇద్దరు ఆల్‌రౌండర్లు జట్టులో కనిపిస్తున్నా వెస్టిండీస్ జట్టు నిస్సందేహంగా క్రిస్‌గేల్‌పైనే చాలా ఆధార పడుతోంది. డబుల్ సెంచరీ తర్వాత దక్షిణాఫ్రికాపై విఫలం అయిన అతను, ఈ సారి ఏం చేస్తాడో ఆసక్తికరం. అయితే భారత్‌పై అతని రికార్డు అంతంత మాత్రమే. ప్రారంభ ఓవర్లోనే గేల్ వెనుదిరిగితే విండీస్ కోలుకోవడం కష్టం. ఆ జట్టులో లెండిల్ సిమన్స్ ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు. డ్వేన్ స్మిత్ ఒక్కసారి కూడా ప్రభావం చూపలేకపోగా, శామ్యూల్స్‌లో నిలకడ లేదు.

 

  రసెల్ ఒక మ్యాచ్‌లో తన ఆల్‌రౌండ్ ప్రతాపం చూపించగా, స్యామీనుంచి కూడా విండీస్ అలాంటి ప్రదర్శన ఆశిస్తోంది.  ఇక విండీస్ పేసర్లు హోల్డర్, టేలర్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోగలరా చూడాలి. పొడగరి అయిన హోల్డర్ ‘వాకా’లోని బౌన్స్‌ను  ఉపయోగించుకుంటే ఆరంభంలో భారత్‌కు ఇబ్బంది ఎదురు కావచ్చు. అయితే ఐదో బౌలర్ లేని కొరత ఆ జట్టుకు సమస్యగా మారింది.  దక్షిణాఫ్రికాకు 400కు పైగా పరుగులు సమర్పించుకుంది.

 

 జట్లు (అంచనా): ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రహానే, రైనా, జడేజా, అశ్విన్, ఉమేశ్, మోహిత్, షమీ/భువనేశ్వర్



వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), స్మిత్, గేల్, కార్టర్, శామ్యూల్స్, రామ్‌దిన్, సిమన్స్, స్యామీ, రసెల్, టేలర్, బెన్.

 

ఈ గ్రూప్‌లో పరిస్థితి ఎలా ఉందో బాగా తెలుసు. ఐర్లాండ్ కూడా బాగా ఆడుతోంది. ప్రతీ మ్యాచ్‌ను మేం నాకౌట్ మ్యాచ్‌లాగే భావించి ఆడతాం. ప్రత్యర్థి ఎవరైనా సన్నాహకాల్లో తేడా ఉండదు. గేల్ గురించి ప్రత్యేక ప్రణాళిక లేదు. అయితే అలాంటి బ్యాట్స్‌మన్‌పై ఆధిక్యం ప్రదర్శించాలని ప్రతీ బౌలర్ కోరుకుంటాడు. ఆ వికెట్ తీస్తే మ్యాచ్ స్థితి ఒక్కసారిగా మారిపోతుందని తెలుసు. ఆరంభంలోనే మన పేసర్లు వికెట్లు తీస్తుండటంతో నాపై ఒత్తిడి తగ్గి బాగా బౌలింగ్ చేయగలుగుతున్నా..

 - అశ్విన్, భారత బౌలర్

 

 భారత్ చాలా పటిష్టంగా ఉందని మాకు తెలుసు. అయితే మేం అనుకున్న వ్యూహాలను మైదానంలో అమలు చేయడం ముఖ్యం. గత మ్యాచ్‌లో నేను డివిలియర్స్‌లాంటి ఆటగాడి బారిన పడ్డాను. ఈ సారి క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తే నేను బ్యాట్స్‌మెన్‌పై ఆధిక్యం కనబరుస్తానేమో. టోర్నీలో తర్వాతి దశ గురించి ఆలోచించకుండా ప్రస్తుతం భారత్‌ను ఓడించడంపైనే మా దృష్టి. నేను ధోనినుంచి ఎంతో నేర్చుకున్నాను. అతనో గొప్ప నాయకుడు..    

 - హోల్డర్, విండీస్ కెప్టెన్

 

 450 భారత్‌పై ఆఖరిసారిగా గేల్ 2006లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత 19 ఇన్నింగ్స్‌లలో కలిపి 23.68 సగటుతో 450 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో నాలుగు డకౌట్లు కూడా ఉన్నాయి.

 

 2 విండీస్‌పై ఆడిన గత పది వన్డేల్లో కోహ్లి 2 సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు.

 

 1  పెర్త్‌లో ఇరు జట్ల మధ్య 1991లో జరిగిన ఒకే వన్డే ‘టై’గా ముగిసింది.

 

 7 ప్రపంచకప్‌లో భారత్, విండీస్ మధ్య 7 వన్డేలు జరగ్గా... భారత్ 4 గెలిచి 3 ఓడింది. ఇరు జట్ల మధ్య గత 10 వన్డేల్లో భారత్ 7 సార్లు నెగ్గింది.

 

 

 పిచ్, వాతావరణం

 ఆసీస్‌లోని ఇతర మైదానాలతో పోలిస్తే ‘వాకా’లో బౌన్స్ ఎక్కువ. కాబట్టి పేసర్లకు కొంత అనుకూలమని చెప్పవచ్చు. అయితే మంచి బ్యాటింగ్ వికెట్ కూడా. అప్ఘానిస్తాన్‌పై వార్నర్ చెలరేగడం దీనికి సూచన. సాధారణంగా బాగా వేడిగా ఉండే పెర్త్‌లో వారం రోజులుగా వాతావరణం బాగుంది. మ్యాచ్ రోజు కూడా ఇది కొనసాగుతుందని అంచనా.

 

 25 కోట్ల 70 లక్షల మంది

 భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు టీవీ ప్రేక్షకులు

 ముంబై: ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను టీవీల్లో 25 కోట్ల 70 లక్షల మంది చూశారని స్టార్‌స్పోర్ట్స్ ప్రకటించింది. ఇదే టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను 28 కోట్ల 80 లక్షల మంది టీవీల్లో చూశారు. ప్రొటీస్‌తో మ్యాచ్‌కు డీడీతో కలిసి స్టార్ నెట్‌వర్క్ 12.9 టీవీఆర్ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌ను చూసిన వీక్షకుల్లో 76 శాతం మంది హిందీ, బెంగాళీ, తమిళం, మళయాళం, కన్నడ భాషల కామెంటరీపై ఆసక్తి ప్రదర్శించారు.

 

 ప్రపంచ కప్‌లో నేడు  (శుక్రవారం)

 ఇండియా   x వెస్టిండీస్

 గ్రూప్ బి; వేదిక: పెర్త్

 మ. గం. 12.00 నుంచి

 స్టార్‌స్పోర్ట్స్-1, డీడీలో

 ప్రత్యక్ష ప్రసారం

 

 రేపటి మ్యాచ్‌లు (శనివారం)

 దక్షిణాఫ్రికా  x పాకిస్తాన్

 గ్రూప్ బి; వేదిక: ఆక్లాండ్

 ఉ. గం. 6.30 నుంచి

 స్టార్‌స్పోర్ట్స్-1లో

 ప్రత్యక్ష ప్రసారం

 

 ఐర్లాండ్   x జింబాబ్వే

 గ్రూప్ బి; వేదిక: హోబర్ట్

 ఉ. గం. 9.00 నుంచి

 స్టార్‌స్పోర్ట్స్-2లో

 ప్రత్యక్ష ప్రసారం


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top