పంజా విసిరింది!

పంజా విసిరింది!


 ఆ రోజు అనుభవం ఉన్న విండీస్‌ను ఒక్కడు బాదాడు... ఈసారి పసికూన ఐర్లాండ్‌ను నలుగురు బాదారు... మ్యాచ్ ఎక్కడైనా... ప్రత్యర్థి ఎవరైనా... దక్షిణాఫ్రికా మాత్రం బాదుడును కామన్‌గా పెట్టుకుంది.  రెండు వారాల వ్యవధిలో రెండు భారీ స్కోర్లు చేసి... తమ సత్తా ఏంటో చూపించింది.

 

  మొదట ఆమ్లా, డు ప్లెసిస్ ‘శతకాల’ దాడి చేస్తే... చివర్లో మిల్లర్, రోసోవ్‌లు దానిపై ‘పరుగుల’ కారం చల్లారు. ఫలితంగా అనుభవం లేని ఐర్లాండ్  మైదానంలో విలవిలలాడిపోయింది. వికెట్లు తీయలేక... పరుగులు ఆపలేక...చేష్టలుడిగిపోయింది. ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి 400 పైచిలుకు స్కోరు చేసిన దక్షిణాఫ్రికా... వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 200 పై చిలుకు పరుగులతో నెగ్గింది.


 

 కాన్‌బెర్రా:
ఈ ప్రపంచకప్‌లో పరుగుల యంత్రంగా మారిన దక్షిణాఫ్రికా... మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా (128 బంతుల్లో 159; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫాఫ్ డు ప్లెసిస్ (109 బంతుల్లో 109; 10 ఫోర్లు, 1 సిక్స్)ల దుమ్మురేపే బ్యాటింగ్‌తో మంగళవారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో సఫారీ జట్టు 201 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. దీంతో ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి దాదాపుగా క్వార్టర్స్ బెర్త్‌ను ఖరారు చేసింది.

 

 అదరగొట్టిన ఆమ్లా

 మనుకా ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లకు 411 పరుగులు చేసింది. రోసోవ్ (30 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), మిల్లర్ (23 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)లు వీరవిహారం చేశారు. ఓపెనర్లలో డికాక్ (1) ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే వెనుదిరిగినా.. ఆమ్లా వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు.

 

 దీనికి తోడు పసలేని బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యంతో ఐర్లాండ్ మూల్యం చెల్లించుకుంది. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షార్ట్ మిడ్ వికెట్‌లో జాయ్‌సీ క్యాచ్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న ఆమ్లా... డు ప్లెసిస్‌తో కలిసి ఐర్లాండ్ బౌలర్ల పని పట్టాడు. వరుసగా బౌండరీలు బాదుతూ వంద బంతుల్లో కెరీర్‌లో 20వ శతకాన్ని సాధించాడు. రెండో ఎండ్‌లో డు ప్లెసిస్ కూడా చెలరేగి 103 బంతుల్లో 4వ సెంచరీని పూర్తి చేశాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 247 పరుగులు జోడించారు. డివిలియర్స్ (9 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) విఫలమైనా... మిల్లర్, రోసోవ్‌లు చెలరేగిపోయారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 8.3 ఓవర్లలో 110 పరుగులు జోడించారు. ఓవరాల్‌గా చివరి 20 ఓవర్లలో ప్రొటీస్ బ్యాట్స్‌మన్ 230 పరుగులు రాబట్టారు. మెక్‌బ్రైన్‌కు 2 వికెట్లు దక్కాయి.

 

 టాప్ ఆర్డర్ విఫలం

 భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ 45 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటై ఓడింది. బాల్బెరిని (71 బంతుల్లో 58; 7 ఫోర్లు) టాప్ స్కోరర్. కెవిన్ ఒబ్రియాన్ (65 బంతుల్లో 48; 3 ఫోర్లు, 1 సిక్స్), డాక్రిల్ (57 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్), సొరెన్‌సోన్ (22)లు మోస్తరుగా ఆడారు.

 

  సఫారీ పేస్ త్రయం ధాటికి ఐర్లాండ్‌కు సరైన శుభారంభం లభించలేదు. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో పోర్టర్‌ఫీల్డ్‌సేన 48 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే బాల్బెరిని, కెవిన్ ఒబ్రియాన్ ఆరో వికెట్‌కు 81 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. చివర్లో డాక్రిల్, సొరెన్‌సోన్‌లు కాసేపు పోరాడినా... రన్‌రేట్ పెరిగిపోవడంతో ఐర్లాండ్‌కు ఓటమి తప్పలేదు. సెంచరీ హీరో హషీమ్ ఆమ్లాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

 

 స్కోరు వివరాలు

 దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (సి) జాయ్‌సీ (బి) మెక్‌బ్రైన్ 159; డికాక్ (సి) విల్సన్ (బి) మూనీ 1; డు ప్లెసిస్ (బి) కె.ఒబ్రియాన్ 109; డివిలియర్స్ (సి) ఎన్.ఒబ్రియాన్ (బి) మెక్‌బ్రైన్ 24; మిల్లర్ నాటౌట్ 46; రోసోవ్ నాటౌట్ 61; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (50 ఓవర్లలో 4 వికెట్లకు) 411. వికెట్ల పతనం: 1-12; 2-259; 3-299; 4-301.  బౌలింగ్: మూనీ 7-2-52-1; సొరెన్‌సోన్ 6-0-76-0; కె.ఒబ్రియాన్ 7-0-95-1; డాక్రిల్ 10-0-56-0; స్టిర్లింగ్ 10-0-68-0; మెక్‌బ్రైన్ 10-0-63-2. ఐర్లాండ్ ఇన్నింగ్స్: పోర్టర్‌ఫీల్డ్ (సి) డు ప్లెసిస్ (బి) అబాట్ 12; స్టిర్లింగ్ (సి) డికాక్ (బి) స్టెయిన్ 9; జాయ్‌సీ (సి) ఆమ్లా (బి) స్టెయిన్ 0; ఎన్.ఒబ్రియాన్ (సి) ఆమ్లా (బి) అబాట్ 14; బాల్బెరిని (సి) రోసోవ్ (బి) మోర్కెల్ 58; విల్సన్ ఎల్బీడబ్ల్యు (బి) అబాట్ 0; కె.ఒబ్రియాన్ (సి) రోసోవ్ (బి) అబాట్ 48; మూనీ (బి) డివిలియర్స్ 8; డాక్రిల్ (బి) మోర్కెల్ 25; సొరెన్‌సోన్ (సి) డికాక్ (బి) మోర్కెల్ 22; మెక్‌బ్రైన్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (45 ఓవర్లలో ఆలౌట్) 210. వికెట్ల పతనం: 1-17; 2-21; 3-21; 4-42; 5-48; 6-129; 7-150; 8-167; 9-200; 10-210.  బౌలింగ్: స్టెయిన్ 8-0-39-2; అబాట్ 8-0-24-4; మోర్కెల్ 9-0-34-3; తాహిర్ 10-1-50-0; బెహర్డీన్ 2-0 -13-0; రోసోవ్ 2-0-13-0; ప్లెసిస్ 4-0-30-0; డివిలియర్స్ 2-0-7-1.

 

 111 వన్డేల్లో అత్యంత వేగవంతంగా 20 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్ ఆమ్లా (111 మ్యాచ్‌లు). గతంలో ఈ రికార్డు కోహ్లి (141 మ్యాచ్‌లు) పేరిట ఉండేది.

 20 వన్డేల్లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మన్ ఆమ్లా, డివిలియర్స్‌తో సమానంగా ఉండగా, గిబ్స్ (21) ముందున్నాడు.

 247ఆమ్లా, డుప్లెసిస్ నెలకొల్పిన ఈ భాగస్వామ్యం దక్షిణాఫ్రికా తరఫున రెండో వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం. ప్రపంచకప్‌ల్లో ఐదో అత్యుత్తమం.

 5 వన్డేల్లో 400కు పైగా స్కోరు చేయడం దక్షిణాఫ్రికాకు ఇది ఐదోసారి. భారత్ కూడా 5సార్లు ఈ ఫీట్‌ను సాధించింది.

 5 200కు పైగా పరుగుల తేడాతో ప్రపంచకప్ మ్యాచ్ గెలవడం దక్షిణాఫ్రికాకు ఇది ఐదోసారి. ఏ జట్టుకైనా ఇదే అత్యుత్తమం. ఆసీస్ రెండో స్థానంలో (4) ఉంది.

 411 ప్రపంచకప్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు. గతంలో భారత్, బెర్ముడాపై 413 పరుగులు చేసింది.

 

 ప్రపంచ కప్‌లో నేడు (బుధవారం)

 పాకిస్తాన్  x యూఏఈ

 గ్రూప్ బి; వేదిక: నేపియర్

 ఉ. గం. 6.30 నుంచి

 స్టార్‌స్పోర్ట్స్-2లో

 ప్రత్యక్ష ప్రసారం

 

 ఆస్ట్రేలియా  x అఫ్ఘానిస్తాన్

 

 గ్రూప్ ఎ; వేదిక: పెర్త్

 మ. గం. 12.00 నుంచి

 స్టార్‌స్పోర్ట్స్-1లో

 ప్రత్యక్ష ప్రసారం

 

 రేపటి మ్యాచ్ (గురువారం)

 బంగ్లాదేశ్  x స్కాట్లాండ్

 గ్రూప్ ఎ; వేదిక: నెల్సన్

 తె. జా. గం. 3.30 నుంచి

 స్టార్‌స్పోర్ట్స్-1లో

 ప్రత్యక్ష ప్రసారం


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top