లంక మరింత జోరుగా...

లంక మరింత జోరుగా...


 వరుసగా మూడో విజయం

 9 వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు

 సంగక్కర మరో సెంచరీ

 శతకం సాధించిన తిరిమన్నె


 

 అఫ్ఘానిస్తాన్‌తో ఆపసోపాలు పడి గెలిచిన తర్వాత శ్రీలంక జట్టు ఒక్కసారిగా ఊపందుకుంది. మ్యాచ్ మ్యాచ్‌కూ తమ ఆటతీరును పదునెక్కిస్తూ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక ఈసారి ఇంగ్లండ్‌పై 300కు పైగా లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేదించింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు శతకాలు సాధించగా, సంగక్కర అద్భుత ఫామ్ ఇక్కడా కొనసాగింది. ఫలితమే ఇంగ్లండ్‌కు మూడో పరాభవం.

 

 వెల్లింగ్టన్: ప్రపంచ కప్‌లో శ్రీలంక జట్టు వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం ఇక్కడి వెస్ట్‌ప్యాక్ స్టేడియంలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో లంక 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. జో రూట్ (108 బంతుల్లో 121; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించగా, బెల్ (54 బంతుల్లో 49; 7 ఫోర్లు), బట్లర్ (19 బంతుల్లో 39 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. అనంతరం ఈ లక్ష్యాన్ని లంక సునాయాసంగా, మరో 16 బంతులు ఉండగానే ఛేదించింది.

 

 తిరిమన్నె (143 బంతుల్లో 139 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు)... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కుమార సంగక్కర (86 బంతుల్లో 117 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు సాధించడంతో లంక 47.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 312 పరుగులు చేసింది. ఓపెనర్ దిల్షాన్ (55 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అవుటైన తర్వాత తిరిమన్నె, సంగక్కర రెండో వికెట్‌కు అభేద్యంగా 212 పరుగులు జోడించడం విశేషం. ఈ పరాజయం అనంతరం గ్రూప్ ‘ఎ’లో ఇంగ్లండ్ ఆరో స్థానంలో ఉంది. ఆ జట్టు క్వార్టర్స్ చేరాలంటే తమ చివరి రెండు మ్యాచ్‌లలో (బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్)లపై తప్పనిసరిగా గెలవాలి.




 రూట్ మినహా...

 ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్లో బెల్ మూడు ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించాడు. లక్మల్ వేసిన ఆ ఓవర్లో జట్టుకు 19 పరుగులు వచ్చాయి. అయితే మొయిన్ అలీ (15)ని అవుట్ చేసి మ్యాథ్యూస్ బ్రేక్ ఇవ్వగా, ఆ వెంటనే బ్యాలెన్స్ (6) కూడా నిష్ర్కమించాడు. ఈ దశలో బెల్, రూట్ కలిసి అతి జాగ్రత్తగా ఆడటంతో పరుగుల వేగం మందగించింది. 2 పరుగుల వద్ద రూట్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో జయవర్ధనే వదిలేయడం కూడా ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. వీరిద్దరు ఎనిమిది ఓవర్లలో 30 పరుగులే జోడించగా, బెల్ అవుటైన తర్వాత మోర్గాన్ (27)తో కలిసి రూట్ 60 పరుగులు జోడించాడు. అయితే పవర్‌ప్లేను మాత్రం ఇంగ్లండ్ బాగా ఉపయోగించుకుంది. టేలర్ (25)తో కలిసి రూట్ ధాటిగా ఆడటంతో అందులో 42 పరుగులు వచ్చాయి.

 

 అనంతరం తిసార పెరీరా వేసిన ఓవర్లో రూట్ 3 ఫోర్లు, 1 సిక్స్... టేలర్ మరో సిక్సర్ కొట్టడంతో ఏకంగా 25 పరుగులు లభించాయి. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 11 ఓవర్లలోనే 98 పరుగులు జత చేయడం విశేషం. ఈ క్రమంలో సరిగ్గా 100 బంతుల్లోనే రూట్ తన నాలుగో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టేలర్, రూట్ ఆరు పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. చివరి ఓవర్లో బట్లర్ మూడు ఫోర్లు, 1 సిక్స్ బాది జట్టు స్కోరు 300 పరుగులు దాటించాడు. ఆఖరి 10 ఓవర్లలో ఇంగ్లండ్ 106 పరుగులు చేసింది.

 

 ఆడుతూ పాడుతూ...

 పరుగుల వేటలో శ్రీలంక ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. 3 పరుగుల వద్ద తిరిమన్నె ఇచ్చిన క్యాచ్‌ను బట్లర్, రూట్ సమన్వయ లోపంతో వదిలేయడం ఇంగ్లండ్‌కు ప్రతికూలంగా మారింది. ఆరంభం నుంచి చకచకా పరుగులు రాబట్టిన దిల్షాన్, అలీ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 100 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అంతే... ఆ తర్వాత ఇంగ్లండ్ ఆనందం అంతటికే పరిమితమైంది.

 

 సూపర్ ఫామ్‌లో ఉన్న సంగక్కర, తిరిమన్నె కలిసి అవలీలగా పరుగులు రాబట్టారు. చక్కటి సమన్వయంతో, ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వీరిద్దరు ఆడారు. 58 బంతుల్లో తిరిమన్నె, 45 బంతుల్లో సంగ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ జోడీని విడదీసేందుకు మోర్గాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది.

 

 98 పరుగుల వద్ద ఈ సారి అలీ క్యాచ్ వదిలేయడంతో తిరిమన్నెకి మరో లైఫ్ లభించింది. 117 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. మరోవైపు సంగక్కర తన దూకుడు కొనసాగించాడు. వోక్స్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో 90ల్లోకి చేరుకున్న అతను...ఆ తర్వాత బ్రాడ్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా ఆడి కెరీర్‌లో 23వ శతకాన్ని అందుకున్నాడు. గత మ్యాచ్‌లో 76 బంతుల్లో సెంచరీ చేసిన సంగ, ఈ మ్యాచ్‌లో 70 బంతుల్లోనే పూర్తి చేసి తన అత్యుత్తమ రికార్డును సవరించుకోవడం విశేషం. 48వ ఓవర్ రెండో బంతికి తిరిమన్నె భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

 

 లక్మల్‌కు జరిమానా

 ఒకే ఓవర్లో రెండు బీమర్లు వేసి క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన లంక బౌలర్ సురంగ లక్మల్‌పై ఐసీసీ చర్య తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాగా విధించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతికి లక్మల్ వేసిన బీమర్‌ను నోబాల్‌గా ప్రకటించిన అంపైర్లు అతడిని హెచ్చరించారు. అయితే అదే ఓవర్లో మరోసారి బీమర్ వేయడంతో అంపైర్లు లక్మల్‌ను బౌలింగ్ నుంచి తప్పించారు. ఆ ఓవర్‌లోని మిగతా రెండు బంతులు దిల్షాన్ పూర్తి చేశాడు.

 

 స్కోరు వివరాలు

 ఇంగ్లండ్ ఇన్నింగ్స్: అలీ (సి) లక్మల్ (బి) మ్యాథ్యూస్ 15; బెల్ (బి) లక్మల్ 49; బ్యాలెన్స్ (సి అండ్ బి) దిల్షాన్ 6; రూట్ (ఎల్బీ) (బి) హెరాత్ 121; మోర్గాన్ (సి) దిల్షాన్ (బి) పెరీరా 27; టేలర్ (సి) దిల్షాన్ (బి) మలింగ 25; బట్లర్ (నాటౌట్) 39; వోక్స్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 309 వికెట్ల పతనం: 1-62; 2-71; 3-101; 4-161; 5-259; 6-265.

 

 బౌలింగ్: మలింగ 10-0-63-1; లక్మల్ 7.4-0-71-1; మ్యాథ్యూస్ 10-1-43-1; దిల్షాన్ 8.2-0-35-1; హెరాత్ 5.5-0-35-1; పెరీరా 8.1-0-55-1. శ్రీలంక ఇన్నింగ్స్: తిరిమన్నె (నాటౌట్) 139; దిల్షాన్ (సి) మోర్గాన్ (బి) అలీ 44; సంగక్కర (నాటౌట్) 117; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (47.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 312 వికెట్ల పతనం: 1-100. బౌలింగ్: అండర్సన్ 8-0-48-0; బ్రాడ్ 10-1-67-0; వోక్స్ 9.2-0-72-0; ఫిన్ 8-0-54-0; అలీ 10-0-50-1; రూట్ 2-0-12-0.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top