ఆడుతూ... పాడుతూ...

ఆడుతూ... పాడుతూ...


యూఏఈపై 9 వికెట్లతో గెలిచిన భారత్

 చెలరేగిన అశ్విన్

 రోహిత్ అజేయ అర్ధసెంచరీ

 తర్వాతి మ్యాచ్ 6న వెస్టిండీస్‌తో


 

 

 ఫలితం ఊహించిందే కాబట్టి... హడావుడి లేదు.. అద్భుతమూ లేదు...సంచలనాలను పక్కనబెడితే... యూఏఈ కనీసం పోరాడలేకపోయింది...భారత బౌలర్ల బంతులకు ‘వాకా’ వాకిట్లో దాసోహమైపోయింది... అశ్విన్ స్పిన్ మ్యాజిక్... జడేజా, ఉమేశ్‌ల సమన్వయం ముందు తౌఖీర్‌సేన చిగురుటాకులా వణికిపోయింది. ఫలితంగా హ్యాట్రిక్ విజయంతో రెచ్చిపోయిన భారత్... దాదాపుగా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. సంచలనాలను మించిన అద్భుతాలు జరిగితే తప్ప... ఈ ప్రపంచకప్‌లో భారత్ నాకౌట్ బెర్త్ ఖరారయినట్లే.

 

 పెర్త్: సంప్రదాయబద్దంగా పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉండే వాకా పిచ్‌పై పేసర్లు చెలరేగుతారని భావిస్తే.... స్పిన్నర్ అశ్విన్ (4/25) గింగరాలు తిప్పాడు. నాణ్యమైన బౌన్స్‌తో పాటు టర్న్‌ను కూడా రాబట్టి చిన్న ప్రత్యర్థి యూఏఈని బెంబేలెత్తించాడు. ఆల్‌రౌండర్ జడేజా (2/23) కూడా ఇతనికి తోడవడంతో ఓ మోస్తరు స్కోరు చేయడానికి కూడా యూఏఈ బ్యాట్స్‌మెన్ నానా తంటాలు పడ్డారు. దీంతో శనివారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో యూఏఈపై ఘన విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ధోని సేన దాదాపుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

 

  టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 31.3 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. షైమాన్ అన్వర్ (49 బంతుల్లో 35; 6 ఫోర్లు) మినహా మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. ఇరువైపుల నుంచి రెండు కొత్త బంతులతో చెలరేగిన పేసర్లు 13 పరుగులకే ఓపెనర్లను అవుట్ చేశారు.

 

 11వ ఓవర్‌లోనే బౌలింగ్‌కు దిగిన అశ్విన్... తన మ్యాజిక్‌ను చూపెట్టాడు. స్వల్ప వ్యవధిలో కృష్ణ చంద్రన్ (4), ఖుర్రమ్ ఖాన్ (14), స్వప్నిల్ పాటిల్ (7)లను వెనక్కి పంపాడు. దీంతో 44 పరుగులకే యూఏఈ సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. మిడిల్ ఓవర్లలో మోహిత్, జడేజాలు పరుగులు రాకుండా  కట్టడి చేశారు. ఓ ఎండ్‌లో అన్వర్ నిలకడగా ఆడినా... రెండో ఎండ్‌లో సహచరులు ఒత్తిడికి లోను కావడంతో యూఏఈ కోలుకోలేకపోయింది. రోహన్ ముస్తఫా (2), జావేద్ (2), నవీద్ (6), తౌఖీర్ (1) వరుస విరామాల్లో అవుటయ్యారు. దీంతో 71 పరుగుల వద్ద యూఏఈ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఈ దశలో అన్వర్, గురుగే (10 నాటౌట్) కాసేపు పోరాడారు. వీరిద్దరు పదో వికెట్‌కు 31 పరుగులు జోడించారు. అయితే నిలకడగా ఆడుతున్న అన్వర్‌ను ఉమేశ్ బోల్తా కొట్టించడంతో యూఏఈ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 25 పరుగులకు 4 వికెట్లు తీసిన అశ్విన్ కెరీర్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేయగా, ఉమేశ్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు.

 

 తర్వాత భారత్ ఆడుతూ పాడుతూ 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసి గెలిచింది. యూఏఈ బౌలర్ల నుంచి పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో రోహిత్ శర్మ (55 బంతుల్లో 57 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) ఆరంభం నుంచే బ్యాట్ ఝుళిపించాడు.

 

 అయితే తొలి వికెట్‌కు 29 పరుగులు జోడించాక శిఖర్ ధావన్ (14) అవుటయ్యాడు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లి (41 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు) కుదురుగా ఆడాడు. రోహిత్‌తో కలిసి రెండో వికెట్‌కు అజేయంగా 75 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. నవీద్‌కు ఒక్క వికెట్ దక్కింది. అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈనెల 6న (శుక్రవారం) జరిగే మ్యాచ్‌లో భారత్... వెస్టిండీస్‌తో తలపడుతుంది.

 

 అన్ని విభాగాల్లోనూ బాగా ఆడాం. ఒక క్యాచ్ వదిలినా ఓవరాల్‌గా ఫీల్డింగ్ బాగానే ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ మా ప్రదర్శన మెరుగ్గా ఉంది. మైదానంలో మా సత్తా చూపడంలో ఉపఖండం బయట గతంలో ఆడిన మ్యాచ్‌ల్లో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేక ఓటమిపాలయ్యాం. ఇప్పుడు మా స్పిన్నర్లు వికెట్లు తీస్తున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల్లో అనుకున్నట్లుగా రాణించడం సంతోషంగా ఉంది    

 - భారత కెప్టెన్ ధోని

 

 స్కోరు వివరాలు

 యూఏఈ ఇన్నింగ్స్: అంజద్ అలీ (సి) ధోని (బి) భువనేశ్వర్ 4; బెరెంజర్ (సి) ధోని (బి) ఉమేశ్ 4; కృష్ణ చంద్రన్ (సి) రైనా (బి) అశ్విన్ 4; ఖుర్రమ్ ఖాన్ (సి) రైనా (బి) అశ్విన్ 14; స్వప్నిల్ పాటిల్ (సి) ధావన్ (బి) అశ్విన్ 7; అన్వర్ (బి) ఉమేశ్ 35; రోహన్ ముస్తఫా ఎల్బీడబ్ల్యు (బి) మోహిత్ శర్మ 2; అంజద్ జావేద్ (సి) రైనా (బి) జడేజా 2; నవీద్ (బి) అశ్విన్ 6; తౌఖీర్ (బి) జడేజా 1; గురుగే నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: (31.3 ఓవర్లలో ఆలౌట్) 102. వికెట్ల పతనం: 1-7; 2-13; 3-28; 4-41; 5-44; 6-52; 7-61; 8-68; 9-71; 10-102.బౌలింగ్: భువనేశ్వర్ 5-0-19-1; ఉమేశ్ 6.3-2-15-2; అశ్విన్ 10-1-25-4; మోహిత్ శర్మ 5-1-16-1; జడేజా 5-0-23-2.భారత్ ఇన్నింగ్స్: రోహిత్ నాటౌట్ 57; ధావన్ (సి) ముస్తఫా (బి) నవీద్ 14; కోహ్లి నాటౌట్ 33; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం: (18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 104. వికెట్ల పతనం: 1-29.బౌలింగ్: నవీద్ 5-0-35-1; గురుగే 6-1-19-0; జావేద్ 2-0-12-0; కృష్ణ చంద్రన్ 3-0-17-0; తౌఖీర్ 2.5-0-21-0.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top