కివీ ‘ఎగిరింది’!

కివీ ‘ఎగిరింది’!


 ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ హోరాహోరీ పోరు

 వికెట్ తేడాతో గట్టెక్కిన కివీస్

 మెకల్లమ్, విలియమ్సన్ దూకుడు

 ట్రెంట్ బౌల్ట్ సంచలన బౌలింగ్

 స్టార్క్ మెరుపు బంతులు వృథా


 

 సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో మలుపులు ఎలా ఉంటాయో తెలుసా...  నరాలు తెగే ఉత్కంఠను ఎప్పుడైనా అనుభవించారా... ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఉగ్గబట్టుకుని చూశారా... ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మ్యాచ్‌ను చూసుంటే ఇవన్నీ అనుభూతిలోకి వచ్చేవి.

 

  కిక్కిరిసిన స్టేడియం... ఆహ్లాదకర వాతావరణం... మ్యాచ్ చూడటానికి వచ్చిన రెండు దేశాల ప్రధానులు... బౌండరీల మెరుపులు... అంతలోనే కుప్పకూలటాలు... సంచలనాత్మక స్వింగ్ బౌలింగ్... తెలివైన స్పిన్ బౌలింగ్... సిక్సర్‌తో నాటకీయమైన ముగింపు. సగటు క్రికెట్ అభిమాని కోరుకునే అసలు సిసలు వినోదం లభించింది.

 

 భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ప్రపంచకప్‌లో ఎంత ప్రాముఖ్యత ఉందో... దాయాది దేశాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మ్యాచ్‌కూ అంతే విశిష్టత ఉంది. భారత్, పాక్ మ్యాచ్ ఏకపక్షంగా సాగితే... వీళ్ల మ్యాచ్ మాత్రం ఆఖరి వరకూ ఉత్కంఠతో జరిగింది. చివరకు సొంతగడ్డపై కివీస్‌నే విజయలక్ష్మి వరించింది. మెకల్లమ్ సగర్వంగా చాపెల్-హ్యాడ్లీ ట్రోఫీని అందుకున్నాడు. సాధారణంగా కివీ పక్షి ఎగరదు... కానీ ఈ మ్యాచ్ ఉత్కంఠ విజయానందంలో ఆ పక్షి కూడా ఎగురుతుందేమో!

 

 ఆక్లాండ్: ప్రపంచకప్ ప్రారంభమైన రెండు వారాల తర్వాత అసలు సిసలు క్రికెట్ మజా వచ్చింది. ఇన్నాళ్లూ బ్యాట్స్‌మెన్ పండగ చేసుకుంటుంటే... తొలిసారి అసలు సిసలు పేస్ బౌలింగ్ సమరం ఎలా ఉంటుందో బయటికొచ్చింది. భారీ అంచనాల నడుమ జరిగిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. అనేక నాటకీయ మలుపులు తిరిగిన మ్యాచ్‌లో... న్యూజిలాండ్ వికెట్ తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈడెన్‌పార్క్ మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 32.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటయింది.

 

 

 ఓపెనర్లు ఫించ్ (7 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్సర్), వార్నర్ (42 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్సర్) తొలి 13 బంతుల్లోనే 30 పరుగులు బాది మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఈ దశలో సౌతీ... ఫించ్‌ను అవుట్ చేసి ఆసీస్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. వాట్సన్ (30 బంతుల్లో 23; 2 ఫోర్లు), వార్నర్ కలిసి రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు.

 

 అయితే జట్టు స్కోరు 80 దగ్గరే ఈ ఇద్దరూ అవుటయ్యారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 71 పరుగుల వ్యవధిలో క్లార్క్ సేన 9 వికెట్లు కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ (5/27) సంచలన స్వింగ్ బౌలింగ్‌కు ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివర్లో హాడిన్ (41 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో ఆసీస్‌కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. ఐదు వికెట్లతో చెలరేగిన బౌల్ట్‌కు తోడు... సౌతీ, వెటోరీ రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు.

 

 న్యూజిలాండ్ జట్టు 23.1 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ (24 బంతుల్లో 50; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ దూసుకుపోయింది. 7.4 ఓవర్లలో జట్టు స్కోరు 78 దగ్గర మెకల్లమ్ అవుటయ్యాడు. అక్కడి నుంచి డ్రామా మొదలైంది. స్టార్క్ (6/28) ధాటికి కివీస్ బ్యాట్స్‌మెన్ అల్లాడారు.

 

 

 ఒక ఎండ్‌లో విలియమ్సన్ (42 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్సర్) పాతుకుపోయి జాగ్రత్తగా ఆడుతున్నా... రెండో ఎండ్‌లో వరుసగా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. అయితే విలియమ్సన్... కమ్మిన్స్ బౌలింగ్‌లో నేరుగా సిక్సర్ బాదడంతో కివీస్ గట్టెక్కింది. ఆసీస్ పేసర్ స్టార్క్ ఆరు వికెట్లతో చెలరేగిపోగా... కమ్మిన్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. న్యూజిలాండ్ బౌలర్ బౌల్ట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు నాలుగేళ్లుగా ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడకపోవడంతో ఈ మ్యాచ్‌నే ‘చాపెల్-హ్యాడ్లీ’ ట్రోఫీగా పరిగణించి విజేత కివీస్‌కు ఈ ట్రోఫీని అందించారు.

 

 స్కోరు వివరాలు

 ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (బి) సౌతీ 14; వార్నర్ ఎల్బీడబ్ల్యు (బి) సౌతీ 34; వాట్సన్ (సి) సౌతీ (బి) వెటోరీ 23; క్లార్క్ (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 12; స్టీవ్ స్మిత్ (సి) రోంచీ (బి) వెటోరీ 4; మ్యాక్స్‌వెల్ (బి) బౌల్ట్ 1; మార్ష్ (బి) బౌల్ట్ 0; హాడిన్ (సి) లాథమ్ (సబ్) (బి) అండర్సన్ 43; జాన్సన్ (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 1; స్టార్క్ (బి) బౌల్ట్ 0; కమ్మిన్స్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (32.2 ఓవర్లలో ఆలౌట్) 151 వికెట్ల పతనం: 1-30; 2-80; 3-80; 4-95; 5-96; 6-97; 7-104; 8-106; 9-106; 10-151. బౌలింగ్: సౌతీ 9-0-65-2; బౌల్ట్ 10-3-27-5; వెటోరీ 10-0-41-2; మిల్నే 3-0-6-0; అండర్సన్ 0.2-0-6-1.

 

 న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) కమ్మిన్స్ (బి) స్టార్క్ 11; మెకల్లమ్ (సి) స్టార్క్ (బి) కమ్మిన్స్ 50; విలియమ్సన్ నాటౌట్ 45; రాస్ టేలర్ (బి) స్టార్క్ 1; ఇలియట్ (బి) స్టార్క్ 0; అండర్సన్ (సి) కమ్మిన్స్ (బి) మ్యాక్స్‌వెల్ 26; రోంచీ (సి) హాడిన్ (బి) స్టార్క్ 6; వెటోరీ (సి) వార్నర్ (బి) కమ్మిన్స్ 2; మిల్నే (బి) స్టార్క్ 0; సౌతీ (బి) స్టార్క్ 0; బౌల్ట్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (23.1 ఓవర్లలో 9 వికెట్లకు) 152 వికెట్ల పతనం: 1-40; 2-78; 3-79; 4-79; 5-131; 6-139; 7-145; 8-146; 9-146. బౌలింగ్: జాన్సన్ 6-1-68-0; స్టార్క్ 9-0-28-6; కమ్మిన్స్ 6.1-0-38-2; మార్ష్ 1-0-11-0; మ్యాక్స్‌వెల్ 1-0-7-1.

 

 

 1 బౌల్ట్ కెరీర్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించడం ఇదే తొలిసారి.

 161  ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 161 బంతులు మిగిలుండగానే ఓడింది. బంతుల పరంగా ఆసీస్‌కు వన్డేల్లో  ఇది రెండో అతి పెద్ద ఓటమి. 2013లో శ్రీలంక చేతిలో 180 బంతులు మిగిలుండగానే ఆసీస్ ఓడింది.

 

 స్టార్క్ నిప్పులు

 ఇంగ్లండ్‌తో మ్యాచ్ తరహాలోనే ఈసారి కూడా లక్ష్యం చిన్నదే అయినా మెకల్లమ్ చెలరేగిపోయాడు. స్టార్క్, జాన్సన్ ఇద్దరి బౌలింగ్‌లో చెరో సిక్సర్ బాది తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. ముఖ్యంగా జాన్సన్ బౌలింగ్‌లో మెకల్లమ్ బౌండరీల మోత మోగించడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మెరుపు వేగంతో సాగింది. గుప్టిల్ అవుటైనా... విలియమ్సన్ అండతో మెకల్లమ్ చెలరేగాడు. కేవలం 21 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కమ్మిన్స్ బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి మెకల్లమ్ వెనుదిరిగాడు. ఇక్కడి నుంచి డ్రామా మొదలైంది. న్యూజిలాండ్ 8 ఓవర్లలో 2 వికె ట్లకు 79 పరుగులతో పటిష్టంగా ఉన్న దశలో... స్టార్క్ మ్యాజిక్ మొదలైంది. వరుస బంతుల్లో అతను టేలర్, ఇలియట్‌లను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్ 79/4తో విరామానికి వెళ్లింది. విలియమ్సన్, అండర్సన్ ఆచితూచి ఆడుతూనే అడపాదడపా షాట్లతో ఆకట్టుకున్నారు.

 

  ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 52 పరుగులు జోడించాక మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అండర్సన్ అవుటయ్యాడు. కీపర్ రోంచీ రాగానే సిక్సర్ కొట్టినా స్టార్క్ మ్యాజిక్‌కు అవుటయ్యాడు. స్టార్క్ తన 9వ ఓవర్లో వరుస బంతుల్లో మిల్నే, సౌతీలను అవుట్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ 146 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. విజయానికి ఆరు పరుగులు అవసరం. రెండో ఎండ్‌లో అప్పటివరకూ జాగ్రత్తగా ఆడుతున్న విలియమ్సన్ ఇక సమయం మించిపోయిందని గ్రహించాడు. కమ్మిన్స్ బౌలింగ్‌లో లాంగాన్‌లోకి సిక్సర్ కొట్టి న్యూజిలాండ్‌కు విజయాన్ని అందించాడు.

 

 బౌల్ట్ సూపర్ స్పెల్ (5-3-3-5)

 ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు టాప్ ఆర్డర్ మంచి ఆరంభాన్నే ఇచ్చింది. ముఖ్యంగా వార్నర్, వాట్సన్ మంచి భాగస్వామ్యంతో కుదురుకున్న సమయంలో ఈ ఇద్దరూ వరుస బంతుల్లో అవుటయ్యాడు. వెటోరీ బౌలింగ్‌లో వాట్సన్, సౌతీ బౌలింగ్‌లో వార్నర్ పెవిలియన్‌కు చేరారు. స్మిత్‌ను కూడా వెటోరీ పెవిలియన్‌కు పంపాడు. ఆస్ట్రేలియా 95 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బౌల్ట్ రెండో స్పెల్ బౌలింగ్‌కు వచ్చాడు. ఇక్కడి నుంచి మ్యాచ్ అనూహ్యంగా మారిపోయింది.

 

 బౌల్ట్ మూడు బంతుల వ్యవధిలో మ్యాక్స్‌వెల్, మార్ష్‌లను క్లీన్‌బౌల్డ్ చేశాడు. గాయం నుంచి కోలుకున్నాక తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న క్లార్క్... కొద్దిసేపు క్రీజులో సౌకర్యంగానే కదిలాడు. అయితే బౌల్ట్ బౌలింగ్‌లో అనవసరపు షాట్‌కు వెళ్లి షార్ట్ కవర్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఇదే జోరులో బౌల్ట్ తన ఎనిమిదో ఓవర్లో జాన్సన్, స్టార్క్‌లను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఆస్ట్రేలియా 106 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బ్రాడ్ హాడిన్ పోరాటంతో ఆసీస్ 150 మార్కును చేరగలిగింది. బౌల్ట్ తన రెండో స్పెల్‌లో ఐదు ఓవర్లలో మూడు మెయిడిన్లు వేశాడు. కేవలం మూడు పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.

 

 ప్రపంచకప్‌లో నేడు  (ఆదివారం)

 ఇంగ్లండ్   x శ్రీలంక

 గ్రూప్: ఎ; వేదిక: వెల్లింగ్టన్

 తె.జా. గం. 3.30 నుంచి

 స్టార్‌స్పోర్ట్స్-1లో

 ప్రత్యక్ష ప్రసారం

 

 పాకిస్తాన్   x జింబాబ్వే

 గ్రూప్ బి; వేదిక: బ్రిస్బేన్

 ఉ. గం. 9.00 నుంచి

 స్టార్‌స్పోర్ట్స్-4లో

 ప్రత్యక్ష ప్రసారం

 

 ప్రపంచకప్‌లో రేపు

 (సోమవారం) మ్యాచ్‌లు లేవు. విశ్రాంతి దినం


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top