A...ఎక్కడేసినా B...బాదుడే

A...ఎక్కడేసినా B...బాదుడే


66 బంతుల్లో 162 నాటౌట్

 డివిలియర్స్ సంచలనం

 257 పరుగులతో విండీస్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం


 

  50:    30 బంతుల్లో

 100:  52 బంతుల్లో

 150:   64 బంతుల్లో


 

 22 గజాల పిచ్... ఆరడుగుల బౌలర్లు.. బంతి విసిరితే నిప్పు తునకలాగా రివ్వున దూసుకెళ్లాలి. కానీ విండీస్ బౌలింగ్ ఆజానుబాహులందరూ డివిలియర్స్ బ్యాటింగ్ ముందు తోక ముడిచారు. బంతిని ఎక్కడ, ఎలా వేయాలో కూడా తెలియక తలలు పట్టుకున్నారు. ఫుల్ లెంగ్త్, గుడ్ లెంగ్త్, అవుట్ స్వింగర్, ఇన్ స్వింగర్, బౌన్సర్... యార్కర్... ఇలా బౌలింగ్‌లో ఉన్న వైవిధ్యమైన బంతులన్నీ ప్రయోగించినా... ప్రొటీస్ సూపర్ మ్యాన్ ఏబీని మాత్రం ఏం చేయలేకపోయారు.

 

 బంతి ఎక్కడేసినా.. బాదుడు మాత్రం కామన్ అనే తరహాలో కళ్లు బైర్లుకమ్మే రీతిలో డివిలియర్స్ విలయతాండవం చేశాడు. ఆఫ్ స్టంప్ బయటి బంతులను ఆన్ సైడ్‌లో సిక్సర్లుగా మలిచాడు. ఆన్ సైడ్ వచ్చిన బంతులను రివర్స్ స్వీప్‌లో బౌండరీలకు తరలించాడు. క్రీజులో నుంచి కదలకుండా బౌలర్ తలపై నుంచి బంతిని నేరుగా స్టాండ్స్‌లోకి పంపాడు. ఓవరాల్‌గా ఒక్క పడుకొని కొట్టడం తప్పిస్తే.. మిగతా వయ్యారాలన్నీ ఒలకబోస్తూ  క్రికెట్‌లో ఎన్ని రకాల షాట్లు కొట్టొచ్చో కళ్లకు కట్టినట్లు చూపుతూ బాదుడుకు కొత్త భాష్యం చెప్పాడు.

 


 సిడ్నీ: భారత జట్టు చేతిలో ఎదురైన పరాజయం తాలూకు కసినంతా దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్‌పై చూపించింది. గత మ్యాచ్ ఓటమితో గదిలో కూర్చొని దాదాపుగా ఏడ్చేసిన ఏబీ డివిలియర్స్ అయితే ఇప్పుడు తన ఆవేదన, ఆవేశాన్నంతా బంతిపై ప్రదర్శించాడు.  శుక్రవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 257 పరుగుల భారీ తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 408 పరుగులు సాధించింది.

 

  డివిలియర్స్ (66 బంతుల్లో 162 నాటౌట్; 17 ఫోర్లు, 8 సిక్సర్లు) నలభై రోజుల వ్యవధిలో మరోసారి వన్డే రికార్డులు సవరిస్తూ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఆమ్లా (88 బంతుల్లో 65; 1 ఫోర్, 1 సిక్స్), డుప్లెసిస్ (70 బంతుల్లో 62; 3 ఫోర్లు), రోసో (39 బంతుల్లో 61; 6 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం వెస్టిండీస్ 33.1 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. జాసన్ హోల్డర్ (48 బంతుల్లో 56; 3 ఫోర్లు, 4 సిక్సర్లు)దే అత్యధిక స్కోరు. ఇమ్రాన్ తాహిర్ (5/45) తన అత్యుత్తమ ప్రదర్శనతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు.

 

 సమష్టి ప్రదర్శన:  కెప్టెన్ హోల్డర్ ఆరంభంలోనే డి కాక్ (12)ను అవుట్ చేసి విండీస్‌కు శుభారంభం అందించాడు. అయితే ఆ తర్వాత ఆమ్లా, డు ప్లెసిస్ దూకుడు ప్రదర్శించకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. 75 బంతుల్లో ఆమ్లా, 59 బంతుల్లో ప్లెసిస్ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అనంతరం కొద్ది సేపటికే గేల్ దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో ప్లెసిస్, ఆమ్లాలను అవుట్ చేశాడు.

 

  తర్వాత డివిలియర్స్, రోసో కూడా నెమ్మదిగానే ఇన్నింగ్స్ ఆరంభించినా, ఆ తర్వాత జోరు పెంచారు. ఈ ధాటి బ్యాటింగ్ పవర్ ప్లేలో కనిపించింది. డివిలియర్స్, రోసో ఈ ఐదు ఓవర్లలో వరుసగా 8, 18, 12, 16, 18 (మొత్తం 72) పరుగులు బాదారు. 31 బంతుల్లో రోసో, 30 బంతుల్లో డివిలియర్స్ హాఫ్ సెంచరీలు అందుకున్నారు. 47 ఓవర్లలో 330గా ఉన్న స్కోరు ఆ తర్వాత డివిలియర్స్ వీర విధ్వంసంతో 400 పరుగులు దాటింది. డివిలియర్స్, బెహర్దీన్ (10 నాటౌట్) మధ్య ఆరో వికెట్‌కు ఏకంగా 24.00 రన్‌రేట్‌తో 20 బంతుల్లోనే 80 పరుగులు జత చేరాయి. ఇందులో ఏబీ కొట్టినవే 68 ఉండటం విశేషం!

 

ఆ రెండు ఓవర్లు: డివిలియర్స్ రికార్డు ఇన్నింగ్స్‌లో 48, 50 ఓవర్లలో సాగిన ఊచకోతదే ప్రధాన భాగం. ఈ ఓవర్లు వేసిన బాధితుడు విండీస్ కెప్టెన్ హోల్డర్. ఆరంభంలో హోల్డర్ చక్కగా బౌలింగ్ వేశాడు. తొలి ఐదు ఓవర్లలో రెండు మెయిడిన్లు సహా కేవలం 9 పరుగులే ఇచ్చిన అతని గణాంకాలు ఆ తర్వాత 8- 2-40-1తో మెరుగ్గానే కనిపించాయి. కానీ చివరి రెండు ఓవర్లు అతనికి పీడకలను మిగిల్చాయి. రెండు నోబాల్స్‌కు ఫ్రీహిట్‌లు కూడా దొరికిన 48వ ఓవర్‌ను డివిలియర్స్ చితక్కొట్టడంతో ఏకంగా 34 పరుగులు వచ్చాయి.  ఆ తర్వాత చివరి ఓవర్లోనూ  ఏకంగా నాలుగు సిక్సర్లు బాదిన అతను... 30 పరుగులు రాబట్టాడు. ఈ రెండు ఓవర్లలో హోల్డర్ 64 పరుగులిచ్చాడు.

 

 63 పరుగులకే 7 వికెట్లు: 400కు పైగా పరుగుల లక్ష్యం అంటే క్రిస్ గేల్ స్థాయి ఆటగాడినుంచి కూడా ఒక విధ్వంసకర ఇన్నింగ్స్ రావాల్సిందే. కానీ ఈ స్టార్ ఆటగాడు రెండో ఓవర్లోనే వెనుదిరగడంతో దెబ్బతిన్న వెస్టిండీస్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. మిగతా ఆటగాళ్లంతగా ఇలా వచ్చి అలా వెళ్లినవారే. డ్వేన్ స్మిత్ (34 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజ్‌లో నిలబడకపోయారు. 63/7 వద్ద విండీస్ అతి పెద్ద పరాజయానికి దాదాపు సిద్ధమైపోయింది. హోల్డర్ ఒంటరి పోరాటం చేసినా... భారీ ఓటమి తప్పలేదు.

 

 64  వన్డేల్లో వేగంగా 150 పరుగులు (64 బంతుల్లో) చేసిన డివిలియర్స్. గతంలో ఈ రికార్డు వాట్సన్ (83 బంతులు) పేరిట ఉంది.

 

   ప్రస్తుతం వన్డేల్లో ఫాస్టెస్ట్ 50 (16 బంతులు ), ఫాస్టెస్ట్ 100 (31 బంతులు), ఫాస్టెస్ట్ 150 (64 బంతులు) మూడు రికార్డులూ డివిలియర్స్ పేరిటే ఉన్నాయి. ఈ మూడు ఈ ఏడాదే రావడం విశేషం.

 

 52   సెంచరీ కోసం డివిలియర్స్ ఆడిన బంతులు. ప్రపంచకప్‌లో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ రికార్డు ఐర్లాండ్ క్రికెటర్ కెవిన్ ఓబ్రియాన్ (50 బంతులు) పేరిట ఉంది.

 

 76  ఈ మ్యాచ్‌లో హోల్డర్ వేసిన 21 బంతులు ఆడిన డివిలియర్స్ 76 పరుగులు చేశాడు. 2001 తర్వాత ఒక బౌలర్‌ను ఒకే బ్యాట్స్‌మన్ ఇలా బాదడం ఇప్పుడే.  

 

 257 ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 257 పరుగులతో గెలిచింది. గతంలో 2007లో భారత్ 257 పరుగులతోనే బెర్ముడాపై గెలిచింది. ప్రపంచకప్‌లో ఇవే అతి పెద్ద విజయాలు.

 

 408  దక్షిణాఫ్రికా చేసిన పరుగులు. ప్రపంచకప్‌లో ఇది రెండో అత్యుత్తమం. అత్యధిక పరుగుల (413) రికార్డు 2007లో బెర్ముడాపై భారత్ సాధించింది.

 

 222  చివరి 15 ఓవర్లలో దక్షిణాఫ్రికా చేసిన పరుగులు. జనవరిలో వెస్టిండీస్‌తోనే జరిగిన వన్డేలో చివరి 15 ఓవర్లలో దక్షిణాఫ్రికా 230 పరుగులు చేయడం విశేషం.

 

 1  ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో ఓ జట్టు 400 పరుగులు చేయడం ఇదే తొలిసారి.

 

 స్కోరు వివరాలు

 దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డి కాక్ (సి) రసెల్ (బి) హోల్డర్ 12; ఆమ్లా (ఎల్బీ) (బి) గేల్ 65; డు ప్లెసిస్ (సి) రామ్‌దిన్ (బి) గేల్ 62; రోసో (సి) రామ్‌దిన్ (బి) రసెల్ 61; డివిలియర్స్ (నాటౌట్) 162; మిల్లర్ (సి) టేలర్ (బి) రసెల్ 20; బెహర్దీన్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 408.

 

 వికెట్ల పతనం: 1-18; 2-145; 3-146; 4-280; 5-328. బౌలింగ్: టేలర్ 8-1-64-0; హోల్డర్ 10-2-104-1; రసెల్ 9-0-74-2; శామ్యూల్స్ 2-0-14-0; బెన్ 10-0-79-0; స్యామీ 7-0-50-0; గేల్ 4-0-21-2.

 

 వెస్టిండీస్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) మిల్లర్ (బి) తాహిర్ 31; గేల్ (బి) అబాట్ 3; శామ్యూల్స్ (సి) డి కాక్ (బి) అబాట్ 0; కార్టర్ (సి) డివిలియర్స్ (బి) మోర్కెల్ 10; రామ్‌దిన్ (బి) తాహిర్ 22; సిమన్స్ (ఎల్బీ) (బి) తాహిర్ 0; స్యామీ (స్టంప్డ్) (బి) డి కాక్ (బి) తాహిర్ 5; రసెల్ (సి) అబాట్ (బి) తాహిర్ 0; హోల్డర్ (బి) ఆమ్లా (బి) స్టెయిన్ 56; టేలర్ (నాటౌట్) 15; బెన్ (సి) ఆమ్లా (బి) మోర్కెల్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (33.1 ఓవర్లలో ఆలౌట్) 151.వికెట్ల పతనం: 1-12; 2-16; 3-52; 4-52; 5-53; 6-63; 7-63; 8-108; 9-150; 10-151.

 

బౌలింగ్: స్టెయిన్ 7-0-24-1; అబాట్ 8-0-37-2; మోర్కెల్ 5.1-0-23-2; తాహిర్ 10-2-45-5; డు ప్లెసిస్ 3-0-17-0.

 

 ఆరోగ్యం బాగా లేకపోయినా...

 విధ్వంసక ఇన్నింగ్స్‌కు ముందు రోజు రాత్రి డివిలియర్స్ కడుపునొప్పితో బాధ పడ్డాడు. దాంతో ఏమీ తినలేకపోయాడు. సరిగ్గా నిద్ర కూడా పోని అతను... మైదానంలో దిగాక కూడా కాస్త నిస్సత్తువగానే ఉన్నాడు. అయితే ఎదురుగా రోసో దూకుడు చూసిన తర్వాత తనలో కొత్త ఉత్సాహం వచ్చిందని అతను చెప్పాడు. ‘రాత్రి డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్‌తో కాస్త తేరుకున్నాను.  ఆరంభంలో క్రీజ్‌లో నెమ్మదిగా కదిలాను. రోసో విజృంభణ నాపై ప్రభావం చూపింది. అంతే... ఆ తర్వాత ఒక్కసారిగా బలం తెచ్చుకున్నాను! నేను కొట్టే షాట్లు రిస్కీ అనుకోను. నా ఆటేంటో నాకు బాగా తెలుసు కాబట్టి పరిస్థితి బట్టే ఆడతాను. ఒక్కసారిగా ఇంత చెలరేగిపోవడానికి భారత్ చేతిలో ఓటమి కూడా ఒక కారణం కావచ్చు’ అని డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.

 

 ప్రపంచ కప్‌లో నేడు (శనివారం)

 ఆస్ట్రేలియా   x న్యూజిలాండ్

 గ్రూప్ ఎ; వేదిక: ఆక్లాండ్

 ఉ. గం. 6.30 నుంచి

 స్టార్‌స్పోర్ట్స్-4లో

 ప్రత్యక్ష ప్రసారం

 

 భారత్   x యూఏఈ

 గ్రూప్ బి; వేదిక: పెర్త్

 మ. గం. 12.00 నుంచి

 స్టార్‌స్పోర్ట్స్-1, డీడీలో

 ప్రత్యక్ష ప్రసారం

 

 రేపటి మ్యాచ్‌లు (ఆదివారం)

 ఇంగ్లండ్   x శ్రీలంక

 గ్రూప్: ఎ; వేదిక: వెల్లింగ్టన్

 తె.జా. గం. 3.30 నుంచి

 స్టార్‌స్పోర్ట్స్-1లో

 ప్రత్యక్ష ప్రసారం

 

 పాకిస్తాన్  x జింబాబ్వే

 గ్రూప్ బి; వేదిక: బ్రిస్బేన్

 ఉ. గం. 9.00 నుంచి

 స్టార్‌స్పోర్ట్స్-4లో

 ప్రత్యక్ష ప్రసారం


 

 

 

 

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top