మోత మోగింది!

మోత మోగింది!


దిల్షాన్, సంగక్కర అజేయ సెంచరీలు

 బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘన విజయం


 

 మెల్‌బోర్న్: ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు క్రీజులో కుదురుకుంటే ఎలా ఉంటుందో తిలకరత్నే దిల్షాన్ (146 బంతుల్లో 161 నాటౌట్; 22 ఫోర్లు), సంగక్కర (76 బంతుల్లో 105 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్)లు చూపించారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌ను చితక్కొడుతూ శతకాల మోత మోగించారు. దీంతో ప్రపంచకప్‌లో గురువారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక 92 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది.




 ఎంసీజీలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో వికెట్ నష్టానికి 332 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ నాలుగో బంతికే క్యాచ్ అవుట్ ప్రమాదం నుంచి బయటపడ్డ తిరిమన్నే (78 బంతుల్లో 52; 3 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. దిల్షాన్‌తో కలిసి తొలి వికెట్‌కు 122 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చాడు. అయితే 25వ ఓవర్‌లో హుస్సేన్ బంతిని థర్డ్‌మ్యాన్‌లో తస్కిన్‌కు క్యాచ్ ఇచ్చి తిరిమన్నే అవుటయ్యాడు. తర్వాత దిల్షాన్, సంగక్కర బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. కెప్టెన్ మొర్తజా బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా ఈ జోడి దూకుడును మాత్రం ఆపలేకపోయాడు. ఈ క్రమంలో దిల్షాన్ 115 బంతుల్లో కెరీర్‌లో 21వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 23, 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి గట్టెక్కిన సంగక్కర... 73 బంతుల్లో వన్డేల్లో 22వ సెంచరీ సాధించాడు. ఈ జోడీ చివరి 10 ఓవర్లలో 115 పరుగులు చేసింది. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు అజేయంగా 210 పరుగులు జోడించారు.

 

 బంగ్లాదేశ్ 47 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. శబ్బీర్ రెహమాన్ (62 బంతుల్లో 53; 7 ఫోర్లు) టాప్ స్కోరర్. షకీబ్ (59 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), ముష్ఫీకర్ రహీమ్ (39 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) మోస్తరుగా ఆడారు. లంక పేసర్ల ధాటికి ఓపెనర్లతో పాటు టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. దీంతో బంగ్లా 100 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. అయితే ముష్ఫీ కర్... షకీబ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 64; శబ్బీర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 44 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేసి నా ప్రయోజనం లేకపోయింది. మలింగ 3, లక్మల్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దిల్షాన్ చెరో రెండు వికెట్లు తీశారు.

 

 4  400 వన్డేలు ఆడిన నాలుగో క్రికెటర్ సంగక్కర.

 1  ఒక సిక్స్ కూడా లేకుండా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మన్ దిల్షాన్ (161).


 

 స్కోరు వివరాలు: శ్రీలంక ఇన్నింగ్స్: తిరిమన్నే (సి) తస్కిన్ (బి) రూబెల్ హుస్సేన్ 52; దిల్షాన్ నాటౌట్ 161; సంగక్కర నాటౌట్ 105; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (50 ఓవర్లలో వికెట్ నష్టానికి) 332. వికెట్ల పతనం: 1-122. బౌలింగ్: మొర్తజా 10-0-53-0; రూబెల్ హుస్సేన్ 9-0-62-1; తస్కిన్ 10-1-82-0; షకీబ్ 10-0-55-0; మహ్మదుల్లా 7-0-49-0; శబ్బీర్ రెహమాన్ 4-0-26-0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (బి) మలింగ 0; అనాముల్ హక్ రనౌట్ 29; సౌమ్య సర్కార్ (సి) సంగక్కర (బి) మ్యాథ్యూస్ 25; మొమినల్ హక్ (సి) జయవర్ధనే (బి) లక్మల్ 1; మహ్మదుల్లా (సి) హెరాత్ (బి) పెరీరా 28; షకీబ్ (సి) మలింగ (బి) దిల్షాన్ 46; ముష్ఫీకర్ రహీమ్ (బి) లక్మల్ 36; శబ్బీర్ రెహమాన్ (సి) సంగక్కర (బి) మలింగ 53; మొర్తజా (స్టంప్డ్) సంగక్కర (బి) దిల్షాన్ 7; రూబెల్ హుస్సేన్ నాటౌట్ 0; తస్కిన్ అహ్మద్ ఎల్బీడబ్ల్యు (బి) మలింగ 0; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: (47 ఓవర్లలో ఆలౌట్) 240.వికెట్ల పతనం: 1-0; 2-40; 3-41; 4-84; 5-100; 6-164; 7-208; 8-228; 9-240; 10-240. బౌలింగ్: మలింగ 9-0-35-3; లక్మల్ 8-0-49-2; మ్యాథ్యూస్ 5.4-0-36-1; హెరాత్ 10-0-43-0; తిసారా పెరీరా 6.2-0-33-1; దిల్షాన్ 8-0-35-2.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top