అఫ్‌‘గన్’ పేలింది...

అఫ్‌‘గన్’ పేలింది...


ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్తాన్‌కు తొలి విజయం

ఉత్కంఠభరిత పోరులో వికెట్ తేడాతో స్కాట్లాండ్ ఓటమి

 రాణించిన సమీయుల్లా, షాపూర్


 

 కాబూల్ హృదయం ఖుషీతో ఉప్పొంగింది... కాందహార్‌లో సందడికి విరామమే లేకపోగా... జలాలాబాద్ సంతోషంతో జేజేలు పలికింది. యుద్ధ మైదానపు జ్ఞాపకాలు చెరిపేస్తూ క్రీడా మైదానంలో ప్రపంచ సమరానికి తొలి సారి వెళ్లిన తమ హీరోలనుంచి యావత్ అఫ్ఘానిస్తాన్ ఎంతో ఆశించింది. గుండెల్లో పేలిన శతఘు్నలు... ట్యాంకర్ల పదఘట్టనల తర్వాత ఏదో ఒక రూపంలో తమకందరికీ ఆనందం పంచే క్షణం కోసం ఎదురు చూసింది.

 

 అది ఇప్పుడు క్రికెట్ రూపంలో వచ్చింది. విశ్వ వేదికపై దక్కిన తొలి విజయం తమ అస్తిత్వం గురించి గర్వంగా చెప్పుకునేలా ఆ దేశపు అభిమానులకు అవకాశం ఇచ్చింది. స్కాట్లాండ్‌పై అఫ్ఘానిస్తాన్ చారిత్రక విజయం సాధించింది.


 

 డునెడిన్: స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ విజయలక్ష్యం 211... 97 పరుగులకే ఏడు వికెట్లు పోయాయి.... బ్యాట్స్‌మన్ సమీయుల్లాతో పాటు మిగిలింది బౌలర్లే. ఎవరికీ గెలుపుపై ఆశలు లేవు... ఈ సమయంలో సమీయుల్లా ఒంటరిపోరాటం చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడి అఫ్ఘాన్‌ను విజయానికి చేరువ చేశాడు. కానీ... అవుటయ్యాడు. ఇక 20 బంతుల్లో 18 పరుగులు చేయాలి. ఒక్కటే వికెట్ ఉంది. మళ్లీ డ్రామా మొదలు. ఇరు జట్లతో విజయం దోబూచులాడింది. ఆఖరి ఓవర్లో సునాయాస రనౌట్ అవకాశాన్ని స్కాట్లాండ్ చేజార్చుకుంది. ఫలితం... అఫ్ఘానిస్తాన్‌కు తమ క్రికెట్‌లో చరిత్రలో తొలిసారి ‘పెద్ద’ విజయం దక్కింది.

 

 గురువారం ఇక్కడి యూనివర్సిటీ ఓవల్ మైదానంలో హోరాహోరీగా సాగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ వికెట్ తేడాతో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 50 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ మాకన్ (28 బంతుల్లో 31; 4 ఫోర్లు), మాజిద్ హఖ్ (51 బంతుల్లో 31; 3 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. అఫ్ఘాన్ బౌలర్లలో షాపూర్ జద్రాన్ 4 వికెట్లు పడగొట్టగా, దౌలత్ జద్రాన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం అఫ్ఘానిస్తాన్ 49.3 ఓవర్లలో 9 వికెట్లకు 211 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సమీయుల్లా షెన్వారి (147 బంతుల్లో 96; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ అవకాశం కోల్పోగా... జావేద్ అహ్మదీ (51 బంతుల్లో 51; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో బేరింగ్టన్‌కు 4 వికెట్లు దక్కాయి.

 

 కీలక భాగస్వామ్యం...

 అప్ఘాన్ పేసర్లు ఆరంభంలోనే చక్కటి ప్రదర్శనతో స్కాట్లాండ్‌ను కట్టడి చేశారు. రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్ ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అయితే  మాకన్, మామ్సెన్ (23) నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. చివర్లో హఖ్, ఇవాన్స్ (37 బంతుల్లో 28; 3 ఫోర్లు)లు 9వ వికెట్‌కు 62 పరుగులు జత చేయడంతో స్కాట్లాండ్ ప్రపంచకప్‌లో తొలిసారి 200 పరుగుల స్కోరు దాటింది.

 

 సమీ సూపర్ ఇన్నింగ్స్...

 అప్ఘాన్ ఆరంభంలోనే నౌరోజ్ (7)తో పాటు అస్గర్ (4) వికెట్లు కోల్పోయినా మరో ఓపెనర్ అహ్మదీ చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు.  అహ్మదీ, సమీ క్రీజ్‌లో ఉన్నంత వరకు జట్టు ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. అయితే అహ్మదీ అవుట్ కాగానే ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం 12 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు పడ్డాయి. అయితే 113 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న సమీ... జట్టును గెలుపు దిశగా నడిపించాడు. 4 ఓవర్లలో 38 పరుగులు చేయాల్సిన దశలో అతను చెలరేగిపోయాడు.

 

  హఖ్ వేసిన 47వ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో మూడు భారీ సిక్సర్లు బాదాడు. అయి తే అదే జోరులో ఐదో బంతికి అవుటయ్యాడు. దాంతో అఫ్ఘాన్ మళ్లీ ఆందోళనలో పడింది.  ఒత్తిడిలో జాగ్రత్తగా ఆడిన చివరి బ్యాట్స్‌మన్ షాపూర్ రెండు ఫోర్లు కొట్టి తమ జట్టుకు చారితాత్మక విజయాన్ని అందించాడు. ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు ఇది 11వ మ్యాచ్ కాగా, అన్ని మ్యాచ్‌లలో ఆ జట్టు ఓడింది.

 

 స్కోరు వివరాలు:

 స్కాట్లాండ్ ఇన్నింగ్స్: కోయెట్జర్ (బి) దౌలత్ 25; మెక్లియోడ్ (సి) నజీబుల్లా (బి) దౌలత్ 0; గార్డినర్ (ఎల్బీ) (బి) హసన్ 5; మాకన్ (బి) నబీ 31; మామ్సెన్ (సి) అఫ్సర్ (బి) గుల్‌బదిన్ 23; బేరింగ్టన్ (సి) అఫ్సర్ (బి) దౌలత్ 25; క్రాస్ (సి) అఫ్సర్ (బి) షాపూర్ 15; డేవీ (సి) హసన్ (బి) షాపూర్ 1; హఖ్ (సి) గుల్‌బదిన్ (బి) షాపూర్ 31; ఇవాన్స్ (సి) నబీ (బి) షాపూర్ 28; వార్డ్‌లా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 210. వికెట్ల పతనం: 1-7; 2-38; 3-40; 4-93; 5-95; 6-132; 7-134; 8-144; 9-206; 10-210.  

 

 బౌలింగ్: షాపూర్ 10-1-38-4; దౌలత్ 10-1-29-3; హసన్ 10-1-32-1; గుల్‌బదిన్ 9-0-53-1; నబీ 10-0-38-1; అహ్మదీ 1-0-8-0.  అఫ్ఘానిస్తాన్ ఇన్నింగ్స్: అహ్మదీ (సి) మాకన్ (బి) బేరింగ్టన్ 51; నౌరోజ్ (బి) ఇవాన్స్ 7; అస్గర్ (సి) క్రాస్ (బి) ఇవాన్స్ 4; సమీయుల్లా (సి) డేవీ (బి) హఖ్ 96; నబీ (ఎల్బీ) (బి) డేవీ 1; అఫ్సర్ (ఎల్బీ) (బి) బేరింగ్టన్ 0; నజీబుల్లా (సి) హఖ్ (బి) బేరింగ్టన్ 4; గుల్‌బదిన్ (సి) హఖ్ (బి) డేవీ 0; దౌలత్ (సి) మామ్సెన్ (బి) బేరింగ్టన్ 9; హసన్ (నాటౌట్) 15; షాపూర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (49.3 ఓవర్లలో 9 వికెట్లకు) 211.

 

 వికెట్ల పతనం: 1-42; 2-46; 3-85; 4-88; 5-89; 6-96; 7-97; 8-132; 9-192.

 బౌలింగ్: వార్డ్‌లా 9.3-0-61-0; డేవీ 10-1-34-2; ఇవాన్స్ 10-1-30-2; హఖ్ 10-0-45-1; బేరింగ్టన్ 10-0-40-4.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top