విల్సన్... గెలిపించెన్!

విల్సన్... గెలిపించెన్!


యూఏఈపై ఐర్లాండ్ విజయం

 ఒబ్రియాన్ మెరుపు ఇన్నింగ్స్

అన్వర్ సెంచరీ వృథా


 

 బ్రిస్బేన్: కీలక సమయంలో క్యాచ్‌లు మిస్ అయ్యాయి... రనౌట్ కోసం చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి... దీనికి తోడు స్లాగ్ ఓవర్లలో నిరాశాజనక ప్రదర్శన... అంతకుమించి మైదానంలో ఫీల్డింగ్ వైఫల్యం... వెరసి ప్రపంచకప్‌లో గెలిచే ఓ మంచి అవకాశాన్ని యూఏఈ జట్టు చేజేతులా జారవిడుచుకుంది. విల్సన్ (69 బంతుల్లో 80; 9 ఫోర్లు) దూకుడుకు, కెవిన్ ఒబ్రియాన్ (25 బంతుల్లో 50; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌కు అడ్డుకట్ట వేయలేక చతికిలపడింది. సమష్టిగా రాణించిన ఐర్లాండ్ జట్టు బుధవారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో యూఏఈపై విజయం సాధించింది.

 

 టాస్ గెలిచి ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... యూఏఈ 50 ఓవర్లలో 9 వికెట్లకు 278 పరుగులు చేసింది. షైమాన్ అన్వర్ (83 బంతుల్లో 106; 10 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌తో తొలి సెంచరీ సాధించాడు. అంజద్ అలీ (71 బంతుల్లో 45; 5 ఫోర్లు), అంజద్ జావేద్ (35 బంతుల్లో 42; 5 ఫోర్లు), ఖుర్రమ్ ఖాన్ (53 బంతుల్లో 36; 2 ఫోర్లు)లు రాణించారు. ఆరంభం నుంచే ఐర్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 125 పరుగులకు సగం యూఏఈ  జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. అయితే అన్వర్, అంజద్ జావేద్‌లు మంచి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను గట్టెక్కించారు. అద్భుతమైన టెక్నిక్‌తో బ్యాటింగ్ చేసిన అన్వర్‌తోపాటు రెండో ఎండ్‌లో జావేద్ కూడా వేగంగా ఆడటంతో యూఏఈ స్కోరు బోర్డు పరుగెత్తింది. అన్వర్, జావేద్ ఏడో వికెట్‌కు 11.5 ఓవర్లలో 107 పరుగులు జోడించి ప్రపంచకప్‌లో రికార్డు నెలకొల్పారు.  ఈ క్రమంలో అన్వర్ 79 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. యూఏఈ తరఫున ప్రపంచకప్‌లో సెంచరీ కొట్టిన తొలి బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డులకెక్కాడు. చివర్లో నవీద్ (13) కాసేపు పోరాడాడు. టాప్ ఆర్డర్‌లో అంజద్ అలీ, ఖుర్రమ్ ఖాన్‌లు మినహా మిగతా వారు విఫలమయ్యారు. సొరెన్‌సోన్, కుసాక్, స్టిర్లింగ్, కెవిన్ ఒబ్రియాన్ తలా రెండు వికెట్లు తీశారు.

 

 తర్వాత ఐర్లాండ్ 49.2 ఓవర్లలో 8 వికెట్లకు 279 పరుగులు చేసి నెగ్గింది. పోర్టర్‌ఫీల్డ్ (64 బంతుల్లో 37; 2 ఫోర్లు), జాయ్‌స్ (49 బంతుల్లో 37; 3 ఫోర్లు), బాల్బెరిని (41 బంతుల్లో 30; 1 ఫోర్)లు తలా కొన్ని పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయిన ఐర్లాండ్‌ను పోర్టర్‌ఫీల్డ్, జాయ్‌స్ రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించి ఆదుకున్నారు. అయితే స్వల్ప విరామాల్లో ఈ ఇద్దరితో పాటు ఎన్. ఒబ్రియాన్(17) కూడా వెనుదిరగడంతో ఐర్లాండ్ 97 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విల్సన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బాల్బెరినితో ఐదో వికెట్‌కు 74 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన కెవిన్ ఒబ్రియాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

 

  వరుస బౌండరీలతో హోరెత్తించాడు. విల్సన్‌తో కలిసి ఆరో వికెట్‌కు 72 పరుగులు జోడించి అవుటయ్యాడు. చివరకు 30 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన దశలో విల్సన్ నాలుగు ఫోర్లు కొట్టి అవుటయ్యాడు. తర్వాత డాక్రిల్ (7 నాటౌట్), కుసాక్ (5 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు. జావేద్‌కు మూడు వికెట్లు దక్కాయి. విల్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

 

 స్కోరు వివరాలు

 యూఏఈ ఇన్నింగ్స్: అంజద్ అలీ (బి) సొరెన్‌సోన్ (బి) కె.ఒబ్రియాన్ 45; బెరెంజర్ (సి) ఫోర్టర్‌ఫీల్డ్ (బి) స్టిర్లింగ్ 13; కృష్ణ చంద్రన్ (సి) కె.ఒబ్రియాన్ (బి) స్టిర్లింగ్ 0; ఖుర్రమ్ ఖాన్ ఎల్బీడబ్ల్యు (బి) డాక్రిల్ 36; స్వప్నిల్ పాటిల్ (సి) స్టిర్లింగ్ (బి) కె.ఒబ్రియాన్ 2; అన్వర్ (సి) విల్సన్ (బి) సొరెన్‌సోన్ 106; రోహన్ ముస్తాఫా (సి) విల్సన్ (బి) కుసాక్ 2; అంజద్ జావేద్ (సి) జాయ్‌సీ (బి) సొరెన్‌సోన్ 42; నవీద్ (సి) అండ్ (బి) కుసాక్ 13; తౌకిర్ నాటౌట్ 2; గురుగే నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 278.

 

 వికెట్ల పతనం: 1-49; 2-53; 3-73; 4-78; 5-125; 6-131; 7-238; 8-269; 9-276.

 బౌలింగ్: మూనీ 6-0-32-0; సొరెన్‌సోన్ 10-0-60-2; కుసాక్ 10-0-54-2; స్టిర్లింగ్ 10-0-27-2; కెవిన్ ఒబ్రియాన్ 7-0-61-2; డాక్రిల్ 7-0-39-1.

 

 ఐర్లాండ్ ఇన్నింగ్స్: పోర్టర్‌ఫీల్డ్ (బి) తౌకిర్ 37; స్టిర్లింగ్ (సి) పాటిల్ (బి) గురుగే 3; జాయ్‌సీ (సి) పాటిల్ (బి) జావేద్ 37; ఎన్.ఒబ్రియాన్ ఎల్బీడబ్ల్యు (బి) తౌకిర్ 17; బాల్బెరినీ (సి) (సబ్) హైదర్ (బి) నవీద్ 30; విల్సన్ (సి) జావేద్ (బి) నవీద్ 80; కె.ఒబ్రియాన్ (సి) నవీద్ (బి) జావేద్ 50; మూనీ (సి) అంజద్ అలీ (బి) జావేద్ 2; కుసాక్ నాటౌట్ 5; డాక్రిల్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: (49.2 ఓవర్లలో 8 వికెట్లకు) 279.

 

 వికెట్ల పతనం: 1-4; 2-72; 3-94; 4-97; 5-171; 6-243; 7-259; 8-267.

 బౌలింగ్: నవీద్ 9.2-1-65-2; గురుగే 7-0-21-1; జావేద్ 10-0-60-3; తౌకిర్ 9-0-38-2; ముస్తాఫా 9-0-45-0; కృష్ణ చంద్రన్ 5-0-43-0.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top