20 ఎత్తుల్లో... గంటలోనే...

20 ఎత్తుల్లో... గంటలోనే...


* ఆనంద్, కార్ల్‌సన్ తొమ్మిదో గేమ్ డ్రా  

* ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్


సోచి: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో మరో డ్రా. అయితే ఈసారి కేవలం 20 ఎత్తుల్లోనే, అది కూడా గంటలోనే ఆనంద్, కార్ల్‌సన్‌ల మధ్య తొమ్మిదో గేమ్ డ్రాగా ముగిసింది. తెల్లపావులతో ఆడిన కార్ల్‌సన్ బెర్లిన్ డిఫెన్స్‌తోనే గేమ్ ప్రారంభించాడు. 12 మూవ్‌ల వరకూ ఇద్దరూ గతంలో ఆడిన ఎత్తులనే ఆడారు. ఆ తర్వాత నాలుగు మూవ్స్ మాత్రమే కొత్తగా వేశారు. దీంతో 16వ ఎత్తు వద్దే ఈ గేమ్ డ్రా కావడం ఖాయంగా కనిపించింది.



ఆ తర్వాత మూడు ఎత్తులు కూడా పునరావృతం కావడంతో ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. ఈ గేమ్‌లో ఆనంద్ పెద్దగా ఆలోచించలేదు కూడా. కేవలం 12 నిమిషాల్లోనే తన 19 ఎత్తులు వేశాడు. తను ఈ గేమ్ కోసం బాగా సన్నద్ధమయ్యాడనడానికి ఇది ఉదాహరణ. చాంపియన్‌షిప్‌లో ఇది వరుసగా మూడో డ్రా కావడం విశేషం. తొమ్మిదో గేమ్ తర్వాత కార్ల్‌సన్ 5-4 పాయింట్లతో ఆనంద్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. శుక్రవారం జరిగే పదో గేమ్‌లో ఆనంద్ తెల్లపావులతో ఆడతాడు.

 

నిరాశ కలిగించిన రోజు

పెంటేల హరికృష్ణ

ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ లాంటి పెద్ద మ్యాచ్‌లో ఓ గేమ్ కేవలం 20 ఎత్తుల్లోనే డ్రా కావడం అభిమానులకు కచ్చితంగా నిరాశ కలిగిస్తుంది. కార్ల్‌సన్ ఆరంభంలో కొత్త వేరియేషన్‌తో ఆడాడు. కానీ ఆనంద్ ఈ గేమ్ కోసం బాగా సన్నద్ధమై వచ్చాడు. దీంతో ఎవరికీ పెద్దగా అవకాశాలు రాలేదు. 16 ఎత్తుల తర్వాత ఇక ఎంతసేపు ఆడినా ఎత్తులు పునరావృతం కావడం మినహా మరో దారి లేదు. ఎవరైనా విజయం కోసం ప్రయత్నిస్తే వాళ్లు కచ్చితంగా ఇబ్బందుల్లోకి వెళతారు. అందుకే రిస్క్ తీసుకోకుండా ఇద్దరూ డ్రాకే మొగ్గు చూపారు. ఇది ఆనంద్‌కు మంచి ఫలితం అనుకోవాలి.



నాలుగో గేమ్‌లో మినహా ఆనంద్ ప్రతిసారీ బ్లాక్స్‌తో ఆడేటప్పుడు ఇబ్బంది పడ్డాడు. ఈసారి మాత్రం సులభంగా డ్రా చేసుకున్నాడు. దీనికి కారణం బాగా సన్నద్ధమవడమే. పదో గేమ్‌లో ఆనంద్ తెల్లపావులతో ఆడే అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ గేమ్ కచ్చితంగా గెలవాలని కాదుగానీ... పదో గేమ్‌లో గెలిచి స్కోరు సమం చేస్తే... చివరి రెండు గేమ్‌లు మరింత ఆసక్తిక రంగా సాగుతాయి. బ్లాక్స్‌తో గంటలోనే డ్రా చేసుకుంటే ఏ ఆటగాడికైనా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ఆనంద్ తర్వాతి గేమ్ బాగా ఆడతాడని అనుకుంటున్నా.

చెస్ గ్రాండ్‌మాస్టర్ హరికృష్ణను harichess@twitter లో ఫాలో కావచ్చు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top