కాంస్య ‘సింధూ’రం

కాంస్య ‘సింధూ’రం


సెమీస్‌లో ఓడిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో కాంస్యం

ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు

కోపెన్‌హాగెన్: గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తాను సాధించిన కాంస్యం గాలివాటం కాదని భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు నిరూపించింది. వరుసగా రెండో ఏడాది ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఈ హైదరాబాద్ అమ్మాయి కాంస్యం సాధించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని లిఖించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 17-21, 15-21తో ప్రపంచ 10వ ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయినా... కాంస్య పతకం దక్కించుకుంది.

 

ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్‌లో అద్వితీయ విజయాలు సాధించిన సింధు సెమీఫైనల్లో మాత్రం అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సింధు కనీసం 15 పాయింట్లను నెట్ వద్ద సమర్పించుకుంది. ఆమె కొట్టిన చాలా షాట్‌లు నెట్‌కు తగిలాయి. కొన్నిసార్లు కరోలినా చక్కటి ప్లేస్‌మెంట్స్‌తో పాయింట్లు రాబట్టింది. తొలి గేమ్‌లో ఒకదశలో 2-6తో వెనుకబడిన సింధు వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 8-6తో ముందంజ వేసింది. కానీ కీలకదశలో తప్పిదాలు చేసి తేరుకోలేకపోయింది. 10-15తో వెనుకబడిన సింధు స్కోరును సమం చేసేందుకు యత్నించినా సఫలం కాలేకపోయింది. తుదకు 21 నిమిషాల్లో తొలి గేమ్‌ను కోల్పోయింది.

 

గత రెండు మ్యాచ్‌ల్లో తొలి గేమ్‌ను కోల్పోయి పుంజుకున్న సింధు ఈసారి మాత్రం దానిని పునరావృతం చేయలేకపోయింది. ఒకదశలో సింధు 11-9తో రెండు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ ఆ తర్వాత తడబాటుకు లోనైంది. సింధు ఒత్తిడిలో ఉందనే విషయాన్ని గ్రహించిన కరోలినా సమయస్ఫూర్తితో ఆడుతూ వరుసగా నాలుగు పాయింట్లు సంపాదించి 16-12తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది.

 

శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు సంచలనం నమోదు చేసింది. ప్రపంచ రెండో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 19-21, 21-19, 21-15తో అద్భుత విజయం సాధించింది. కెరీర్‌లో షిజియాన్‌పై సింధుకిది నాలుగో విజయం కావడం విశేషం. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ సింధు క్వార్టర్ ఫైనల్లో షిజియాన్‌ను ఓడించింది.

 

సైనాకు ఐదోసారి నిరాశ

మరో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో సైనా 15-21, 15-21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ జురుయ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. సైనా తాను ఆడిన ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ క్వార్టర్ ఫైనల్ దశలోనే నిష్ర్కమించడం గమనార్హం.

 

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు లభించిన నాలుగు పతకాలూ కాంస్యాలే కావడం గమనార్హం. 1983లో కోపెన్‌హాగెన్‌లోనే జరిగిన పోటీల్లో ప్రకాశ్ పదుకొనే పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు తొలి కాంస్యాన్ని అందించాడు. 2011లో లండన్‌లో జరిగిన పోటీల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప మహిళల డబుల్స్ విభాగంలో భారత్ ఖాతాలో రెండో కాంస్యాన్ని జతచేశారు. 2013లో చైనాలోని గ్వాంగ్‌జూలో జరిగిన పోటీల్లో... ఈ ఏడాది కోపెన్‌హాగెన్‌లో జరిగిన పోటీల్లో  పి.వి.సింధు మహిళల సింగిల్స్‌లో భారత్‌కు రెండు కాంస్యాలు అందించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top