‘డోపీ’ల వ్యవహారం వెనుక కుట్ర

‘డోపీ’ల వ్యవహారం వెనుక కుట్ర


ప్రపంచ అథ్లెటిక్స్ చీఫ్ డియాక్ ఆరోపణ

కౌలాలంపూర్:
ప్రపంచ అథ్లెటిక్స్‌లో 2001 నుంచి 2012 మధ్యలో సేకరించిన ఆటగాళ్ల రక్త, మూత్ర నమూనాల్లో వందల మంది ఉత్ప్రేరక పదార్థాలు అధికంగా వాడినట్టు తేలడం క్రీడారంగాన్ని నివ్వెరపరిచింది. ఆ సమయంలో జరిగిన ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లాంటి మెగా టోర్నీల్లో పతకాలు సాధించిన ప్రతి ముగ్గురిలో ఒకరు డోపీనే అని జర్మనీ, బ్రిటన్ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. మరోవైపు ఈ వ్యవహారంపై అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యల సంఘం (ఐఏఏఎఫ్) స్పందించింది.



ప్రపంచ చాంపియన్‌షిప్‌కు కొన్ని రోజుల ముందే ఈ కథనాలు రావడం వెనుక కుట్ర దాగి ఉందని ఐఏఏఎఫ్ చీఫ్ లామినే డియాక్ ఆరోపించారు. దీని వెనుక అప్పటి పతకాలను తిరిగి పంపిణీ చేయించాలనే ఉద్దేశం కనిపిస్తోందని అన్నారు. త్వరలోనే వీటిపై సమాధానం చెబుతామని అన్నారు. 5 వేల మంది అథ్లెట్ల నుంచి సేకరించిన 12 వేల నమూనాలు అనుమానాస్పదంగా ఉన్నట్టు ఐఏఏఎఫ్ డాటాబేస్‌లో ఉందని మీడియా పేర్కొంది.



2012 లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన 10 మంది శాంపిల్స్ అనుమానం కలిగించేవిగా ఉన్నాయని సండే టైమ్స్ రాసింది. ఇదిలావుండగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై తాము చేయగలిగిందేమీ లేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నారు. ఇదంతా అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) చూసుకుంటుందని చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top