బోల్ట్ x గాట్లిన్

బోల్ట్ x గాట్లిన్


♦ 200 మీటర్ల ఫైనల్స్‌లోనూ అమీతుమీ  

♦ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్

 

 బీజింగ్ : వరుసగా నాలుగో స్వర్ణం సాధించాలనే లక్ష్యంతో ఉసేన్ బోల్ట్ (జమైకా)... ఈసారైనా బోల్ట్‌ను ఓడించాలనే పట్టుదలతో జస్టిన్ గాట్లిన్ (అమెరికా)... గురువారం జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 200 మీటర్ల ఫైనల్ రేసులో అమీతుమీ తేల్చుకోనున్నారు. బుధవారం జరిగిన సెమీఫైనల్స్ ద్వారా బోల్ట్ (19.95 సెకన్లు), జస్టిన్ గాట్లిన్ (19.87 సెకన్లు) ఫైనల్‌కు అర్హత సాధించారు. వీరిద్దరితోపాటు ఫెమీ ఒగునోడ్ (ఖతార్), రామిల్ గులియెవ్ (టర్కీ), జర్నెల్ హ్యూస్ (బ్రిటన్), జొబోడ్‌వానా (దక్షిణాఫ్రికా), నికెల్ అష్మెడ్ (జమైకా), అలోన్సో ఎడ్వర్డ్ (పనామా) కూడా ఫైనల్‌కు అర్హత పొందారు.



2009, 2011, 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో బోల్ట్ 200 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించగా... 2005 మెగా ఈవెంట్‌లో గాట్లిన్ విజేతగా నిలిచాడు. గత ఆదివారం జరిగిన 100 మీటర్ల ఫైనల్లో గాట్లిన్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న బోల్ట్ తుదకు సెకనులో వందోవంతు తేడాతో గట్టెక్కి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు.  



 మరోవైపు బుధవారం జరిగిన ఐదు ఈవెంట్స్ ఫైనల్స్‌లో మూడింట ఆఫ్రికా అథ్లెట్స్ స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. పురుషుల జావెలిన్ త్రోలో జూలియస్ యెగో (92.72 మీటర్లు) విజేతగా నిలిచి ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఫీల్డ్ ఈవెంట్‌లో తొలిసారి కెన్యాకు పతకాన్ని అందించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో హువిన్ కియెంగ్ జెప్కెమోయ్ (కెన్యా-9ని:19.11 సెకన్లు) పసిడి పతకాన్ని సాధించింది. మహిళల పోల్‌వాల్ట్‌లో యారిస్లె సిల్వా (క్యూబా-4.90 మీటర్లు); పురుషుల 400 మీటర్ల విభాగంలో వేడ్ వాన్ నికెర్క్ (దక్షిణాఫ్రికా-43.48 సెకన్లు); మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో జుజానా హెజ్‌నోవా (చెక్ రిపబ్లిక్-53.50 సెకన్లు) స్వర్ణ పతకాలు గెలిచారు.



 టింటూ లూకాకు ‘రియో’ బెర్త్: పోటీల ఐదో రోజూ భారత్‌కు నిరాశే మిగిలింది. మహిళల 800 మీటర్ల విభాగంలో ప్రస్తుత ఆసియా చాంపియన్, కేరళ అమ్మాయి టింటూ లూకా 2ని:00.95 సెకన్లలో గమ్యానికి చేరుకొని తొలి హీట్‌లో ఆరో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. అయితే ఈ ప్రదర్శనతో టింటూ లూకా వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.



 లలితకు ఎనిమిదో స్థానం: మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఫైనల్ రేసులో మహారాష్ట్ర అమ్మాయి లలితా శివాజీ బాబర్ 9ని:27.86 సెకన్లతో 8వ స్థానాన్ని దక్కించుకుంది. 2000 మీటర్ల వరకు అగ్రస్థానంలో ఉన్న లలిత ఆ తర్వాత వెనుకబడిపోయింది. ఈ ప్రదర్శనతో లలిత ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ట్రాక్ ఈవెంట్‌లో టాప్-8లో నిలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది.

 

 పురుషుల 200 మీటర్ల ఫైనల్ నేటి సాయంత్రం గం. 6.25కు  స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top