భారత్‌ తొలి ప్రత్యర్థి ఇంగ్లండ్‌

భారత్‌ తొలి ప్రత్యర్థి ఇంగ్లండ్‌


ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

జూన్‌ 24 నుంచి జూలై 23 వరకు ఇంగ్లండ్‌లో టోర్నీ




లండన్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో  భారత జట్టు జూన్‌ 24న జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టుతో ఆడనుంది. ఇంగ్లండ్‌లో జూన్‌ 24 నుంచి జూలై 23 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌తోపాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటాయి. లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీఫైనల్‌ జూలై 18న, రెండో సెమీఫైనల్‌ జూలై 20న జరుగుతాయి. ఫైనల్‌ మ్యాచ్‌ను జూలై 23న లార్డ్స్‌ మైదానంలో నిర్వహిస్తారు. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను ఈ టోర్నీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది.



‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ప్రపంచకప్‌ షెడ్యూ ల్‌ను విడుదల చేశాం. ఇప్పటికే లార్డ్స్‌లో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు సంబంధించి తొమ్మిది వేల టికెట్లు అమ్ముడుపోయాయి. కొలంబోలో క్వాలిఫయింగ్‌ టోర్నీ విజయవంతంగా ముగిసింది. ప్రధాన టోర్నీ కూడా సక్సెస్‌ అవుతుందని నమ్మకంతో ఉన్నాం’ అని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవ్‌ రిచర్డ్‌సన్‌ తెలిపారు.



భారత మ్యాచ్‌ల షెడ్యూల్‌: జూన్‌ 24: ఇంగ్లండ్‌తో; జూన్‌ 29: వెస్టిండీస్‌తో; జూలై 2: పాకిస్తాన్‌తో; జూలై 5: శ్రీలంకతో; జూలై 8: దక్షిణాఫ్రికాతో; జూలై 12: ఆస్ట్రేలియాతో; జూలై 15: న్యూజిలాండ్‌తో.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top