పాక్‌ పనిపట్టి... ఫైనల్‌కు

పాక్‌ పనిపట్టి... ఫైనల్‌కు


టైటిల్‌ పోరుకు భారత మహిళల జట్టు 

పాకిస్తాన్‌పై ఏడు వికెట్లతో గెలుపు

స్పిన్నర్‌ ఏక్తా (10–7–8–5) అద్భుత ప్రదర్శన 

మంగళవారం దక్షిణాఫ్రికాతో తుది సమరం




కొలంబో: ఫేవరెట్‌ హోదాతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు అదే స్థాయిలో ప్రదర్శన చేస్తూ... ఐసీసీ ప్రపంచకప్‌ వన్డే క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన చివరి ‘సూపర్‌ సిక్స్‌’ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. లీగ్‌ దశలో నాలుగు విజయాలు, సూపర్‌ సిక్స్‌లో మూడు విజయాలు సాధించిన భారత్‌ అజేయ రికార్డుతో ఫైనల్‌కు చేరింది. మంగళవారం జరిగే టైటిల్‌ పోరులో దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడుతుంది. సూపర్‌ సిక్స్‌ దశ తర్వాత తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన భారత్‌ (10 పాయింట్లు), దక్షిణాఫ్రికా (8 పాయింట్లు), శ్రీలంక (6 పాయింట్లు), పాకిస్తాన్‌ (4 పాయింట్లు) జట్లు జూన్‌లో ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌కు అర్హత పొందాయి.



ఏక్తా మాయాజాలం...

టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ పాకిస్తాన్‌కు బ్యాటింగ్‌ అప్పగించగా... ఆ జట్టు 43.4 ఓవర్లలో కేవలం 67 పరుగులకే కుప్పకూలింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎడంచేతి వాటం స్పిన్నర్‌ ఏక్తా బిష్త్‌ కళ్లు చెదిరే బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసింది. 31 ఏళ్ల ఏక్తా 10 ఓవర్లలో 7 మెయిడిన్లు వేసి కేవలం 8 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. శిఖా పాండే రెండు వికెట్లు తీయగా... దీప్తి శర్మ, దేవిక వైద్య, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లకు ఒక్కో వికెట్‌ లభించింది. పాక్‌ జట్టులో ఎక్స్‌ట్రాలే (24) అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇద్దరు బ్యాట్స్‌విమెన్‌ అయేషా జఫర్‌ (19; 3 ఫోర్లు), బిస్మా మారూఫ్‌ (13; 1 ఫోర్‌) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... మిగతా ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం భారత్‌ 22.3 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 70 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. దీప్తి శర్మ (29 నాటౌట్‌; 3 ఫోర్లు), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (24; 2 ఫోర్లు, ఒక సిక్స్‌) రాణించారు. ఓవరాల్‌గా ఇప్పటివరకు పాకిస్తాన్‌తో ఆడిన తొమ్మిది అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల్లోనూ భారత్‌నే విజయం వరించడం విశేషం. ఇతర సూపర్‌ సిక్స్‌ చివరి రౌండ్‌ మ్యాచ్‌ల్లో శ్రీలంక 42 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై, దక్షిణాఫ్రికా 36 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచాయి. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top