అతడు... ఆమె... వింబుల్డన్

అతడు... ఆమె...  వింబుల్డన్


మరో టైటిల్‌పై జొకోవిచ్ కన్ను

రికార్డు విజయం సెరెనా లక్ష్యం

నేటి నుంచి వింబుల్డన్ టోర్నీ


 

 

‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకున్న ఉత్సాహంలో ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత దిశగా అడుగులు వేస్తున్న జొకోవిచ్... కొత్త తరం రాకతో కనుమరుగు కాకముందే రికార్డు టైటిల్ వేటలో సెరెనా... పూర్వ వైభవం కోసం ఫెడరర్, సొంతగడ్డపై మరో విజయం కోసం ఆండీ ముర్రే... సంచలనాలపై ఆశతో జూనియర్లు... అందరికీ పచ్చటి పచ్చిక కోర్టు స్వాగతం పలుకుతోంది. మేజర్ టోర్నీలలో అందరూ మనసు పడే వింబుల్డన్ సమయం వచ్చేసింది.

 

లండన్: ఏడాదిలో మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌కు రంగం సిద్ధమైంది. గ్రాస్‌కోర్టు వేదికగా తమ సత్తా చాటేందుకు అగ్రశ్రేణి ఆటగాళ్లంతా సై అంటున్నారు. నేడు (సోమవారం) ప్రారంభం కానున్న ఈ చరిత్రాత్మక టోర్నీ జూలై 10 వరకు సాగుతుంది. డిఫెండింగ్ చాంపియన్లు జొకోవిచ్, సెరెనా విలియమ్స్ మరోసారి టాప్ సీడ్‌లుగా బరిలోకి దిగుతున్నారు.





నం. 13 కోసం...

వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ మరోసారి టోర్నీలో ఫేవరెట్‌గా నిలిచాడు. 2014, 2015లలో ఇక్కడ టైటిల్ సాధించిన అతను హ్యాట్రిక్‌పై దృష్టి పెట్టాడు. తాజా ఫామ్, గత రెండు గ్రాండ్‌స్లామ్‌లలో అద్భుత విజయాల అనంతరం జొకోవిచ్‌ను అడ్డుకోవడం ఏ ఆటగాడి వల్లా అయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే 12 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన సెర్బియా స్టార్ వేగంగా ఆల్‌టైమ్ గ్రేట్ ఫెడరర్ (17) టైటిల్స్‌కు చేరువవుతున్నాడు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో తొలి మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడం 1969లో రాడ్ లేవర్ తర్వాత ఎవరి వల్లా కాలేదు. తన తొలి రౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్, ప్రపంచ 177వ ర్యాంకర్ జేమ్స్ వార్డ్‌తో తలపడుతున్నాడు. ఏ మాత్రం ఒత్తిడిలో లేని జొకోవిచ్ ఆదివారం లండన్‌లో పబ్లిక్ ట్రైన్‌లలో విహరిస్తూ సరదాగా గడపడం విశేషం.





ముర్రే ఆశలు...

మూడేళ్ల క్రితం వింబుల్డన్ నెగ్గి సొంత అభిమానుల చిరకాల కల నెరవేర్చిన ఆండీ ముర్రే (బ్రిటన్) ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. గత రెండుసార్లు ఇక్కడ అతను క్వార్టర్స్, సెమీస్‌లో నిష్ర్కమించాడు. జొకోవిచ్‌కు పోటీ ఇవ్వగల సత్తా ఉన్నా ఇటీవల అతని చేతిలో వరుసగా ఓడటం ఆత్మవిశ్వాసం దెబ్బ తీసింది. జొకోవిచ్‌తో జరిగిన గత 15 మ్యాచ్‌లలో అతను 13 సార్లు ఓడాడు. అయితే స్వదేశంలో మరో విజయం కోసం అతను తీవ్రంగా శ్రమిస్తున్నాడు. పాత కోచ్ లెండిల్‌తో మరో సారి ముర్రే జతకట్టాడు. గత వారం సన్నాహక టోర్నీ క్వీన్స్ క్లబ్ గెలవడంతో అతనిలో కాస్త జోష్ పెరిగింది. మొదటి రౌండ్‌లో బ్రిటన్‌కే చెందిన లియామ్ బ్రాడీ ని అతను ఎదుర్కొంటాడు. మరో స్టార్ ఆటగాడు నాదల్ మణికట్టు గాయంతో టోర్నీ ప్రారంభానికి ముందే తప్పుకోగా... వావ్రింకా, నిషికోరి, గాస్కే, రావ్‌నిచ్ టాప్-10 సీడిం గ్‌లో ఉండి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆటగాళ్లు.





సెరెనా సాధించేనా...

రొబెర్టా విన్సీ, కెర్బర్, ముగురుజా... గత మూడు గ్రాండ్‌స్లామ్‌లలో సెరెనా విలియమ్స్‌ను చిత్తు చేసిన క్రీడాకారిణులు. సరిగ్గా ఏడాది క్రితం వింబుల్డన్ గెలిచాక సెరెనా విలియన్స్ గ్రాండ్‌స్లామ్ విజయాల సంఖ్య 21కి చేరింది. మరో టైటిల్ గెలిస్తే సెరెనా ఆల్‌టైమ్ రికార్డు స్టెఫీగ్రాఫ్‌ను సమం చేసేది. కానీ అనూహ్యంగా తర్వాతి మూడు గ్రాండ్‌స్లామ్‌లలో ఆమె ఓటమి పాలైంది. ఇప్పుడు 34 ఏళ్ల వయసులో సెరెనా మరోసారి రికార్డు కోసం పోరాడుతోంది. ఫామ్ గొప్పగా లేకపోవడంతో పాటు యువ తరంగాల రాకతో ఆమె వెనుకబడింది.



పైగా ఫ్యాషన్ ప్రపంచంలో ఎక్కువగా కనిపించడం, పాప్ ఆల్బంలో భాగం కావడంతో ఆమెకు ఆటపై ఆసక్తి తగ్గిందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పూర్తి స్థాయి సత్తా చాటాల్సి ఉంది. ఈసారి ఓడితే ఇక పవర్ గేమ్‌కు దాదాపు ముగింపు వచ్చినట్లే. సెరెనా విలియ మ్స్‌కు ప్రధానంగా రద్వాన్‌స్కా, ముగురుజా, కెర్బర్, హలెప్, క్విటోవాల నుంచి పోటీ ఎదురవుతోంది.

 

ఫెడరర్ సంగతేంటి...

రోజర్ ఫెడరర్ అంటే ఒకప్పుడు వింబుల్డన్‌కు పర్యాయపదం. గ్రాస్‌కోర్టుపై అతని వైట్‌డ్రస్‌లాగే ఆట కూడా వెలిగిపోయేది. ఏకంగా ఏడు సార్లు అతను ఇక్కడ విజేతగా నిలిచాడు. అయితే 2012లో ఇక్కడ టైటిల్ నెగ్గిన తర్వాత మూడేళ్లు అతనికి చుక్కెదురైంది. గత రెండు సార్లు అతను ఫైనల్లోనే జొకోవిచ్ చేతిలో ఓడాడు. 34 ఏళ్ల వయసులో ఫెడరర్ మరో టైటిల్ వేటను కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఫామ్ కోల్పోయిన అతను ఫిట్‌నెస్ సమస్యలతో కూడా బాధపడుతున్నాడు.



ఇదే కారణంగా గత ఫ్రెంచ్ ఓపెన్‌కు కూడా దూరమయ్యాడు. అసలు 2012 వింబుల్డన్ తర్వాత అతను మరో గ్రాండ్‌స్లామ్ గెలవలేకపోయాడు. ఈ టోర్నీకి ముందు అతని సన్నాహాలు కూడా బాగా లేవు. వరుసగా రెండు గ్రాస్‌కోర్టు టోర్నీలు స్టట్‌గార్ట్, హాలేలలో సెమీఫైనల్స్‌లో ఇద్దరు అనామకుల చేతిలో ఓడాడు. ఈ పరిస్థితుల్లో అతను ఏ మాత్రం పోటీ ఇవ్వగలడనేది చూడాలి. తొలి మ్యాచ్‌లో అతను గైడో పెలా (అర్జెంటీనా)తో తలపడతాడు.

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top