టీమిండియా 'ఆన్' అయ్యేనా !

టీమిండియా 'ఆన్' అయ్యేనా !


కాన్పూర్: టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య రేపట్నుంచి ఆరంభం కానున్న వన్డే సిరీస్ కు ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. కాన్పూర్ వేదికగా ఆదివారం జరిగే తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను నిలువరించేందుకు టీమిండియా పూర్తిస్థాయి కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ట్వంటీ 20 సిరీస్ ను కోల్పోయిన మహేంద్ర సింగ్ ధోని అండ్ కంపెనీ ఎలాగైనా వన్డేల్లో మెరుగ్గా రాణించి దక్షిణాఫ్రికా లెక్క సరిచేయాలని భావిస్తోంది. ట్వంటీ 20లో ఆడపా దడపా మెరుపులు తప్ప టీమిండియా స్థాయికితగ్గ ఆటతీరును కనబరిచింది లేదు.  తొలి ట్వంటీ 20 లో ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. వీరద్దిరి చలవతో ఆ మ్యాచ్ లో 200 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించినా బౌలింగ్ లో టీమిండియా తేలిపోయింది. పేస్ బౌలింగ్ లో భువనేశ్వర్, మోహిత్ శర్మ ఇద్దరూ విఫలమై భారీ స్కోరును కాపాడుకోలేకపోయారు.





ఇక రెండో ట్వంటీ 20 టీమిండియా వైఫల్యం అంతా ఇంతా కాదు.  ఒకనాటి భారత క్రికెట్ జట్టును జ్ఞాపకం చేస్తూ ఒకరి వెంట ఒకరు క్యూకట్టిన తీరు నిజంగా బాధాకరం. సగటున తొమ్మిది పరుగులకో వికెట్ చొప్పున  టీమిండియా వరుస వికెట్లను నష్టపోయింది. వంద పరుగులలోపే చాపచుట్టేసి పటిష్టమైన దక్షిణాఫ్రికా బౌలింగ్ ముందు తలవంచింది. కనీసం మూడో ట్వంటీ 20 గెలిచి పరువు దక్కించుకోవాలని భావించినా.. ఆ మ్యాచ్ ను వరుణుడు అడ్డుకున్నాడు. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో ధోని సేన ఆశలు ఆదిలోనే ఆవిరయ్యాయి. ఈ క్రమంలోనే వన్డే సిరీస్ కు రంగం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య జరుగుతున్న సుదీర్ఘ సిరీస్ లో ఐదు వన్డేలు జరుగనున్నాయి. దక్షిణాఫ్రికాను ఆదిలోనే ఒత్తిడిలోకి నెట్టాలంటే తొలి వన్డేలో గెలవడం అనివార్యం. ట్వంటీ 20 సిరీస్ అనంతరం 'ఆఫ్ లో ఉన్న ధోని గ్యాంగ్ వన్డేల్లో  'ఆన్' అవుతుందా?లేదా? అనేది వేచిచూడాల్సిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top