ధోని అండ్ గ్యాంగ్ సమం చేస్తుందా?

ధోని అండ్ గ్యాంగ్ సమం చేస్తుందా? - Sakshi


రాంచీ: శ్రీలంకతో మూడు ట్వంటీ 20ల సిరీస్లో తొలి మ్యాచ్లో ఓటమి పాలైన టీమిండియా క్రికెట్ జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. అటు పరువును, ఇటు ర్యాంకింగ్ ను పోగొట్టుకుని క్లిష్ట స్థితిని కొని తెచ్చుకుంది. ఈ సిరీస్లో  లంకేయుల నుంచి టీమిండియాకు ఎటువంటి పోటీ ఉండదని తొలుత అనుకున్నా.. అది కేవలం ఊహ మాత్రమేనని వారు తేల్చిచెప్పారు. తొలి టీ 20లో ధోని సేనను ఘోరంగా దెబ్బతీసిన శ్రీలంక రెట్టించిన ఆత్మవిశ్వాసంతో రెండో మ్యాచ్ కు సన్నద్ధమవుతుండగా, మరోవైపు టీమిండియా మాత్రం అందుకు భిన్నంగా ఎలాగైనా గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. శుక్రవారం రాత్రి 7.30 రాంచీలోని.లకు ప్రారంభం కానున్న డే అండ్ నైట్ మ్యాచ్ లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి.





ఢిల్లీ నుంచి రాంచీకి మారిన ఈ వేదికలో ధోని అండ్ గ్యాంగ్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. త్వరలో భారత్ లో వరల్డ్ కప్ జరుగనున్న నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగబోతున్న లంకకు తొలి మ్యాచ్ లో విజయం నిజంగా కొండత బలాన్నిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే టీమిండియాను వరల్డ్ కప్ ఫేవరెట్ గా పరిగణిస్తున్న తరుణంలో ఓటమి మాత్రం  తీవ్రంగా కలచివేస్తోంది. ఇది కేవలం బ్యాట్స్ మెన్ తప్పిదంతోనే పరాజయం చెందామన్న సంగతి మనవాళ్లు చేసిన స్కోరును బట్టి అర్థమవుతోంది. సగం ఓవర్లు అవ్వకుండానే సగం వికెట్లును కోల్పోవడం. అది కూడా టీ20లో అంటే కొంత అతిశయోక్తిగా మానదు.  తొలి ఓవర్ లో ప్రారంభమైన వికెట్ల పతనం అలానే కొనసాగింది. ఆ మ్యాచ్ లో  టీ 20ల్లో అత్యల్ప స్కోరును నమోదు చేసి మరోసారి చెత్త రికార్డును మూటగట్టకునే పరిస్థితిని స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్ తప్పించాడనే చెప్పొచ్చు. అశ్విన్ చేసిన 31 పరుగులతో గతంలో టీ 20ల్లో ఆసీస్ పై భారత్ చేసిన 74 పరుగుల చెత్త రికార్డు కాస్త తప్పిపోయింది.  మరోవైపు ఆనాటి 1996 వన్డే వరల్డ్ కప్ నుంచి మొదలుకొని చూస్తే లంకకు సంచలనాలు చేయడం కొత్తేమీ కాదు. తమ జట్టులో అనుభవం లేకపోయినా, కావాల్సినంత విశ్వాసం ఉందనే విషయాన్ని లంకేయులు అవకాశం చిక్కినప్పుడల్లా చెప్పకనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండో టీ20లో మరోసారి టీమిండియా ఏమరుపాటుగా ఉంటే మాత్రం శ్రీలంక సిరీస్ ను ఎగురవేసుకుని పోవడం ఖాయం.



నిలవాలంటే గెలవాలి..



ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్ అనంతరం ట్వంటీ 20 ఫార్మాట్లో నంబర్ వన్ ర్యాంకును సాధించిన టీమిండియా..శ్రీలంకతో తొలి మ్యాచ్ లో ఓటమి అనంతరం మూడో ర్యాంకు పడిపోయింది. రెండో టీ 20 లో కూడా ఓటమి పాలైతే మాత్రం టీమిండియా మరోసారి ఏడో ర్యాంకుకు పడిపోతుంది. మళ్లీ అగ్రస్థానానికి రావాలంటే మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ధోని సేన గెలిచి సిరీస్ ను చేజిక్కించుకోవాల్సిందే. ఇదే సమయంలో శ్రీలంక సిరీస్ ను 2-0 తేడాతో గెలిచినా, లేక క్లీన్ స్వీప్ చేసినా టాప్ స్థానానికి చేరుకుంటుంది. దీంతో సిరీస్ లో నిలవాలంటే  గెలవాల్సిన పరిస్థితి ధోని సేనది. మరి గెలిచి నిలుస్తుందా?లేక ఓడి సిరీస్ ను, నంబర్ వన్ ర్యాంకును సమర్పించుకుంటుందా?అనేది చూడాల్సిందే.



పిచ్, వాతావరణం



రాంచీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. అదే సమయంలో తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు తొలి ఓవర్లలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉంది. వర్షం పడే అవకాశాలు లేవు.గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top