తొలి పోరుకు ధోని సేన సిద్ధం!

తొలి పోరుకు ధోని సేన సిద్ధం! - Sakshi


పుణె: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ ను క్లీన్స్వీన్ చేసిన టీమిండియా.. శ్రీలంకతో మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ కు సన్నద్ధమైంది. ఆస్ట్రేలియాను వారి గడ్డపై  మట్టికరింపించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఆడిన టీమిండియా ..ఇప్పుడు స్వదేశంలో సరికొత్త సవాల్ తో బరిలోకి దిగుతుంది. అది ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును మరికొంత కాలం పదిలంగా ఉంచుకోవడమే. ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం టీమిండియా ఎనిమిది స్థానాలను మెరుగుపరుచుకుని 120 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.





టీ 20  వరల్డ్ కప్ టోర్నీకి అగ్ర జట్టుగా సిద్ధం కావాలని ధోని సేన భావిస్తోంది. దాంతో పాటు ఈ మ్యాచ్ లు కూడా వరల్డ్ కప్కు సన్నాహకంగా కొనసాగుతుండటంతో టీమిండియా ప్రధానంగా ర్యాంకును కాపాడుకోవడంపై దృష్టి పెట్టింది. ఈ తరుణంలో శ్రీలంకతో సిరీస్ ను కైవసం చేసుకోవడం ఒక్కటే టీమిండియా లక్ష్యం. ఈ సిరీస్ లో ధోని సేన గెలిస్తేనే తన ర్యాంకును కాపాడుకుంటుంది. కానిపక్షంలో ఏడో ర్యాంకు పడిపోతుంది. అదే సమయంలో శ్రీలంక నంబర్ వన్ ర్యాంకుకు చేరుకుంటుంది. ప్రస్తుతం టీమిండియా సమతుల్యంగా ఉండటంతో పాటు, స్వదేశంలో మ్యాచ్ లు జరగడం జట్టుకు కలిసొచ్చే అంశం. మరోవైపు శ్రీలంక కొత్త కుర్రాళ్లతో పోరుకు సిద్దమవుతోంది. అటు మలింగా, మాథ్యూస్ లాంటి అనుభవం ఉన్న ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొనడం లేదు. అయినప్పటికీ శ్రీలంకను తక్కువగా అంచనా వేయలేం. సంచలనాలకు మారుపేరు అయిన లంకేయులతో జాగ్రత్తగా ఉంటేనే ధోని సేన ర్యాంకును కాపాడుకునే అవకాశం ఉంది. ఏమాత్రం అలసత్వం వ్యవహరించినా అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.



ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య ఆరు టీ 20 మ్యాచ్ లు మాత్రమే జరగ్గా, తలో మూడు మ్యాచ్ లను గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. అందులో 2014లో జరిగిన టీ 20 మ్యాచ్ ఒకటి.  ఈ మ్యాచ్ లో శ్రీలంక చేతిలో టీమిండియా ఓటమి పాలై విమర్శల పాలైంది. ఆ తర్వాత శ్రీలంకతో  తలపడుతున్న టీ 20 సిరీస్ ఇది.  శ్రీలంక-టీమిండియాల మధ్య మంగళవారం  రాత్రి గం.7.30 ని.లకు  పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగనుంది.  ఈ మ్యాచ్ లో  ధోని సేన అదరగొట్టి శుభారంభం చేస్తుందా?లేదా అనేది చూడాల్సిందే.



వాతావరణం



వర్షం పడే అవకాశాలు లేవు. వాతావరణంతో పొడిగా ఉండటంతో మ్యాచ్ సజావుగా సాగే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత  34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా ఉండనుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top