ఐపీఎల్ ' కొత్త' చాంపియన్ ఎవరో?

ఐపీఎల్ ' కొత్త' చాంపియన్ ఎవరో?


బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్లో సంచలన ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకున్న జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్. టోర్నీ ఆరంభంలో ఎటువంటి అంచనాలు లేకుండా అండర్ డాగ్గా బరిలోకి దిగిన జట్టు ఒకటైతే, ఆదిలో వరుస వైఫల్యాలతో లీగ్ దశ నుంచే నిష్క్రమించే పరిస్థితిని తెచ్చుకుని ఫైనల్ చేరిన జట్టు మరొకటి. ఈ సీజన్ లో విధ్వంసకర ఆటతీరుతో తుది పోరుకు సిద్ధమైన కోహ్లి అండ్ గ్యాంగ్ ఒకవైపు,  ఆద్యంతం ఆకట్టుకుని అంచాలను తల్లక్రిందులు చేసిన వార్నర్ సేన మరొకవైపు. ఈ రెండు జట్లు తుది సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాత్రి.8.00 లకు ఇరు జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది.

 



ఒక జట్టు బ్యాటింగ్ బలంతో చెలరేగిపోతుంటే, మరొక జట్టు బౌలింగ్తో ప్రత్యర్థులకు చుక్కలు చూపెడుతోంది. ఇందులో ఎవరు గెలిచానా ఐపీఎల్ కొత్త చాంపియన్గా చరిత్ర సృష్టిస్తారు. గడిచిన ఎనిమిది ఐపీఎల్ సీజన్ లలో రెండు సార్లు(2009, 11) ఫైనల్ కు చేరిన ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ను దక్కించుకోలేదు. దీంతో తొలిసారి టైటిల్ను గెలవాలని కోహ్లి సేన కసితో ఉంది. మరో వైపు 2013 లో ఐపీఎల్లో అడుగుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ అదే సంవత్సరం ప్లే ఆఫ్ కు చేరడం మినహా ఆ తరువాత పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో ఇరు జట్లు తమ వ్యూహాలకు పదును పెడుతూ ట్రోఫీని కైవసం చేసుకునే పనిలో పడ్డాయి.





ఇదిలా ఉండగా ఈ సీజన్లో ఇరు జట్లు ఆడిన లీగ్ మ్యాచ్ల్లో చెరొకటి గెలిచి సమంగా ఉన్నాయి. అయితే  లీగ్ దశలో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో బెంగళూరు ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ లు దూకుడుగా ఆడటంతో  బెంగళూరు 200 పరుగుల పైగా నమోదు చేసి ఘన విజయం సాధించింది.  రేపు ఇదే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుండటంతో బెంగళూరును హైదరాబాద్ ఎంతమేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరమే. సొంత గడ్డపై మరోసారి కోహ్లి సేన చెలరేగిపోయే అవకాశం ఉండటంతో వార్నర్ సేన అందుకు తగిన వ్యూహ రచనతో సిద్ధం కావాలి.







తుది జట్లు(అంచనా)



ఆర్సీబీ: విరాట్ కోహ్లి(కెప్టెన్), క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, కేఎల్ రాహుల్, స్టువర్ట్ బిన్నీ, సచిన్ బేబీ, జోర్డాన్, ఇక్బాల్ అబ్దుల్లా, ఎస్ అరవింద్, చాహాల్



హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్),శిఖర్ ధవన్, హెన్రీక్యూస్,యువరాజ్ సింగ్,దీపక్ హూడా,కట్టింగ్,నమాన్ ఓజా,బిపుల్ శర్మ, భువనేశ్వర్ కుమార్,బరిందర్ శ్రవణ్, ట్రెంట్ బౌల్ట్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top