‘ఐపీఎల్-2’ ఫైనల్ చేరేదెవరో!

‘ఐపీఎల్-2’ ఫైనల్ చేరేదెవరో!


టోర్నీ పేరు చాంపియన్స్ లీగ్... పేరుకు ఏడు దేశాల జట్లు... కానీ ఆది నుంచి ఆధిపత్యం ఐపీఎల్ టీమ్‌లదే. ఇప్పుడు దీనిని మరోసారి రుజువు చేస్తూ ఐపీఎల్‌కు చెందిన మూడు జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. గత ఏడాదిలాగే ఈసారి కూడా రెండు భారత జట్ల మధ్య ఫైనల్ జరుగుతుందా... లేక ఒక ఆసీస్ జట్టు ముందంజ వేస్తుందా అనేది నేడు తేలిపోనుంది. ఎవరు గెలిచినా, ఓడినా ప్రేక్షకులు మాత్రం ఈ మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది వాస్తవం. పండగ పూట వినోదాన్ని కోరుకునే నగరంలోని క్రికెట్ అభిమానులకు మాత్రం గురువారం ఉప్పల్ స్టేడియంలో రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లతో కనువిందు జరగడం ఖాయం.

 

 సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో నాకౌట్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో నేడు రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి జరిగే తొలి మ్యాచ్‌లో ఐపీఎల్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆస్ట్రేలియా జట్టు హోబర్ట్ హరికేన్స్‌ను ఎదుర్కోనుండగా... రాత్రి 8 గంటల నుంచి జరిగే రెండో సెమీస్‌లో ఐపీఎల్ రన్నరప్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. కోల్‌కతా, పంజాబ్ జట్లు లీగ్ దశలో తాము ఆడిన నాలుగు మ్యాచ్‌లూ నెగ్గి అజేయంగా నిలవగా... హరికేన్స్ మూడు, చెన్నై రెండు విజయాలతో సెమీస్ చేరాయి. ఈ రెండు మ్యాచ్‌ల విజేతల మధ్య శనివారం బెంగళూరులో ఫైనల్ జరుగుతుంది.



 కోల్‌కతా స్పిన్‌ను ఆపగలరా...

 టి20ల్లో వరుసగా 13 విజయాలు సాధించి ఊపు మీదున్న కోల్‌కతా జట్టు హైదరాబాద్ వికెట్‌పై మరోసారి స్పిన్‌పై ఆధారపడుతోంది. లీగ్ దశలో ఆ జట్టు ప్రత్యర్థులు ఒక్కసారి కూడా 157 పరుగులు దాటలేకపోయారు. జట్టు స్పిన్నర్లు నరైన్, చావ్లా, కుల్దీప్, యూసుఫ్ పఠాన్ బ్యాట్స్‌మెన్‌ను పూర్తి కట్టి పడేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నరైన్ 4 ఓవర్లలోనే మ్యాచ్ కోల్‌కతా వైపు మారిపోతోంది. నరైన్ యాక్షన్‌పై సందేహాలు ఉన్నా ప్రస్తుతానికి సెమీస్ మ్యాచ్‌లో అతనే కీలకం. ‘ఆసీస్ ఆటగాళ్లు స్పిన్‌ను ఎదుర్కోవడం అంటే ఘాటు మిర్చిని తిన్నంత కష్టంగా ఉంటోంది’ అన్న ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు లాంగర్ వ్యాఖ్య ఇప్పుడు హరికేన్స్‌కు కూడా సరిపోతుందేమో. ఈ టోర్నీలో మూడు విజయాలు సాధించిన ఆ జట్టు కోల్‌కతా స్పిన్‌ను ఎదుర్కోవడంపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. మరోవైపు అన్ని మ్యాచ్‌లు గెలిచినా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ మాత్రం తడబడుతోంది. అయితే ఎవరో ఒకరు ఆపద్బాంధవుడిగా మారి మ్యాచ్‌లను గెలిపించారు. కాబట్టి సెమీస్‌లో ఆ జట్టు బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. మరోవైపు హోబర్ట్ జట్టులో బ్లిజార్డ్, షోయబ్ మాలిక్ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో బొలింజర్, డోహర్తి పాత్ర కీలకం కానుంది.



 ‘కింగ్స్’ ఎవరో...

 రెండు ఐపీఎల్ జట్ల మధ్య జరగనున్న మరో సెమీస్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. మంచి హిట్టర్లు ఉండటంతో ఇరు జట్లూ తమ బ్యాటింగ్‌పైనే ఆధార పడుతున్నాయి. ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. పంజాబ్ జట్టులో టాప్-6లో అంతా విధ్వంసకర ఆటగాళ్లే ఉన్నారు. సెహ్వాగ్, వోహ్రా, మ్యాక్స్‌వెల్, మిల్లర్, బెయిలీ, పెరీరాలతో ఆ జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. లోయర్ ఆర్డర్‌లో సాహా, అక్షర్ పటేల్ కూడా దాటిగా ఆడగల సమర్థులు. బౌలింగ్‌లో యువ ఆటగాళ్లు అక్షర్, కరణ్‌వీర్, అనురీత్ నిలకడగా ఆడుతున్నారు. చెన్నై కూడా స్మిత్, మెకల్లమ్, రైనా, ధోని, బ్రేవో, జడేజాలతో అభేద్యంగా కనిపిస్తోంది.  గాయం నుంచి కోలుకుంటే డు ప్లెసిస్ బరిలోకి దిగుతాడు. ఆ జట్టు బౌలింగ్‌లో నెహ్రా, మోహిత్, అశ్విన్‌లపై ఆధారపడుతోంది. ఇరు జట్ల మధ్య గత మూడు మ్యాచ్‌లలో పంజాబ్‌నే విజయం వరించడం విశేషం.







 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top