ప్రపంచ కప్లో ఎవరా వీరుడు..!?


ప్రపంచ కప్లో పరుగుల వేట జోరుగా సాగుతోంది. స్టార్ బ్యాట్స్మెన్తో పోటీపడుతూ అనామక ఆటగాళ్లు పరుగులు వరద పారిస్తున్నారు. విధ్వంసక వీరులకు ఏమాత్రం తీసిపోమంటూ వెటరన్లు సెంచరీలు బాదుతున్నారు. ప్రపంచ కప్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన టాప్-10 బ్యాట్స్మెన్లో.. అగ్రశ్రేణి జట్ల నుంచి పసికూనల వరకు ఉండటం విశేషం. ఈ మెగా ఈవెంట్లో రికార్డులు బద్దలవుతున్నాయి. విండీస్ వీరుడు క్రిస్ గేల్ ప్రపంచ కప్ తొలి డబుల్ సెంచరీ కొడితే.. కంగారూలు రికార్డు స్కోరు సాధించారు. ప్రపంచ కప్లో ఏ బ్యాట్స్మన్ అత్యధిక పరుగులు చేస్తాడన్నది ఆసక్తికరం. నాకౌట్ దశకు ఇంకా చేరుకోలేదు.. లీగ్ దశ సగభాగం మాత్రమే ముగిసింది కనుక ఇప్పుడే చెప్పడం కాస్త కష్టం కావచ్చు కానీ ప్రస్తుత ప్రదర్శనను బట్టి అత్యధిక పరుగుల రేసులో ఎవరెవరు ఉన్నారంటే..



షైమన్ అన్వర్ అంటే చాలా మంది క్రికెట్ అభిమానులకు తెలియకపోవచ్చు. అలాంటి ఈ యూఏఈ ఆటగాడు ప్రస్తుతం టాప్ స్కోరర్గా నిలిచాడు. షైమన్ సెంచరీ సహా 270 పరుగులు సాధించాడు. లంక వెటరన్ సంగక్కర రెండు సెంచరీలు బాది 268 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. డబుల్ సెంచరీ వీరుడు క్రిస్ గేల్ 258 మూడో స్థానంతో దూసుకుపోతున్నాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆమ్లా (సౌతాఫ్రికా-257), తిరుమన్నె (శ్రీలంక-256), డుప్లెసిస్ (సౌతాఫ్రికా-250), డివిల్లీర్స్ (సౌతాఫ్రికా-241), వార్నర్ (ఆసీస్-234), దిల్షాన్ (శ్రీలంక-229), మిల్లర్ (సౌతాఫ్రికా-226), ధవన్ (భారత్-224) ఉన్నారు. విధ్వంసక ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్-207), భారత యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ (భారత్-186) కూడా పోటీపడుతున్నారు.



విస్తుపోయే విషయమేంటంటే యూఏఈ బ్యాట్స్మన్ షైమన్ టాప్లో ఉన్నా.. రేసులో లేనట్టే! కారణమేంటంటే యూఏఈ ఆడిన 4 లీగ్ మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. దీంతో ఆ జట్టు దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. మరో రెండు లీగ్ మ్యాచ్లు మాత్రం ఆడనుంది. కాబట్టి అతనికి అవకాశం లేనట్టే. సౌతాఫ్రికా, ఆసీస్, లంక, భారత్, కివీస్ నాకౌట్కు చేరడం దాదాపు ఖాయం. విండీస్ కు కూడా చాన్స్ ఉంది. కాబట్టి ఆ జట్ల ఆటగాళ్లు చివరి వరకు రేసులో ఉంటారు. విధ్వంసక ఆటగాళ్లు డివిల్లీర్స్, వార్నర్ రేసులో ముందడుగు వేయడానికి ఒక్క మ్యాచ్ చాలు. ఇక తనదైన రోజున పరుగుల సునామీ సృష్టించగల గేల్, మెకల్లమ్కు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారత యువ కిశోరాలు ధవన్, కోహ్లీని ఏమాత్రం పక్కనబెట్టలేము. దీన్ని బట్టి సౌతాఫ్రికా, ఆసీస్, లంక, విండీస్, కివీస్, భారత్ ఆటగాళ్లలో ఒకరు నెంబర్ వన్ అవుతారు. అయితే ఆ ఒక్కరూ ఎవరు..!?

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top