వివాదం లేకపోతే మజా ఏముంటుంది?

వివాదం లేకపోతే మజా ఏముంటుంది?


భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌... ఏదో ఒక రూపంలో వ్యాఖ్యనో, వివాదమో వెంట రావడం చాలా సహజం. అందులోనూ ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ పాత్ర లేకుండా ఏదీ జరగదేమో! రెండో వన్డేలో మరోసారి అలాంటి ఘటన జరిగింది. రిచర్డ్సన్‌ వేసిన 48వ ఓవర్లో నాలుగో బంతిని పాండ్యా గాల్లోకి ఆడగా కవర్స్‌లో స్మిత్‌ దానిని క్యాచ్‌ పట్టాడు. అయితే బంతి ఎత్తుపై అనుమానం ఉన్న స్మిత్‌ ముందు జాగ్రత్తగా రనౌట్‌కు ప్రయత్నించాడు. బంతిని అందుకున్న బౌలర్‌ నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో వికెట్లను పడగొట్టాడు. మరోవైపు ఎలాగూ క్యాచ్‌ ఇచ్చానని భావించిన పాండ్యా దీన్నంతా గమనించకుండా పెవిలియన్‌ వైపు నడిచాడు. అదే సమయంలో వర్షం రావడం వల్ల ఫీల్డ్‌ అంపైర్లు కూడా ఆ పరిణామాలపై దృష్టి పెట్టకుండా మైదానం వదిలారు.



అయితే విరామం అనంతరం మూడో అంపైర్‌ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించడంతో పాండ్యా నాటౌట్‌ అని తేలింది. అలా అయితే రనౌట్‌ను ఎలా కాదంటారంటూ స్మిత్‌ అంపైర్లతో వాదనకు దిగాడు. తాము రనౌట్‌ చేసినప్పుడు బంతి ఇంకా ‘డెడ్‌’ కాలేదని అతను చెప్పాడు. అయితే ఐసీసీ నిబంధనల (27.7) ప్రకారం... అంపైర్‌ అవుట్‌గా ప్రకటించక ముందే బ్యాట్స్‌మన్‌ తనకు తాను అవుటైనట్లు భావించి మైదానం వీడినప్పుడు, ఈ విషయంలో అంపైర్‌ సంతృప్తి చెందితే... తాను జోక్యం చేసుకొని తర్వాతి పరిణామాలను చెల్లనివిగా పరిగణిస్తూ బ్యాట్స్‌మన్‌ను తిరిగి క్రీజ్‌లోకి పిలవవచ్చు. అంపైర్‌ నిర్ణయం స్మిత్‌లో మళ్లీ అసహనం పెంచిందనడంలో సందేహం లేదు.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top