విండీస్ కు అలా కలిసొచ్చింది!

విండీస్ కు అలా కలిసొచ్చింది!


మిర్పూర్: అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో వెస్టిండీస్ ఆడిన ఒక కీలక మ్యాచ్లో వినిపించిన పేరు మన్కడింగ్. ఇదొక రకమైన రనౌట్.  ఓ బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న ఆటగాడు క్రీజ్ దాటి బయటకు వెళ్లినప్పుడు బౌలర్ అవుట్ చేసే విధానాన్నే మన్కడింగ్ అంటారు. క్రీడా స్ఫూర్తికి  కాస్త విరుద్ధంగా కనిపించినా నిబంధనల ప్రకారం దీన్ని కూడా అవుట్ గానే ప్రకటిస్తారు. అత్యంత నాటకీయ పరిస్థితుల్లో  వెస్టిండీస్ జట్టును అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో క్వార్టర్స్ ఫైనల్స్‌కు చేర్చిన మన్కడింగే ఇప్పుడు సందర్భమైంది.



గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే-విండీస్ ల మధ్య పోరులో ఎవరు నెగ్గితే వారు క్వార్టర్స్‌కు చేరతారు. అయితే 227 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే చివరి ఓవర్‌లో విజయానికి మూడు పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. అయితే చివరి ఓవర్ తొలి బంతికే విండీస్ బౌలర్ కీమో పాల్ నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ మటిగిమును మన్కడింగ్ ద్వారా అవుట్ చేశాడు. మటిగిము బ్యాట్ క్రీజులో కాకుండా లైన్ పైన ఉండడంతో మూడో అంపైర్ కూడా నిబంధనల ప్రకారం అవుట్‌గా ప్రకటించారు. దీంతో విండీస్ అనూహ్యంగా క్వార్టర్స్ కు చేరింది.


 


ఇక ఆ తరువాత వారి ప్రయాణం వరల్డ్ కప్ సాధించే వరకూ సాగింది. క్వార్టర్స్ లో పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విండీస్.. ఆ తరువాత సెమీ ఫైనల్లో ఆతిథ్య బంగ్లాదేశ్ ను మట్టికరిపించి ఫైనల్ కు చేరింది. ఇక భారత్తో అమీతుమీ పోరులో విండీస్కు ఎదురేలేకుండా పోయింది. తొలుత భారత్ ను 45.1 ఓవర్లలో 145 పరుగులకు కట్టడి చేసిన విండీస్ .. ఆ తరువాత  బ్యాటింగ్ లో కూడా ఫర్వాలేదనిపించి ఐదు వికెట్లు కోల్పోయి తొలిసారి వరల్డ్ కప్ ను అందుకుంది.

 




1947లో భారత్-ఆస్ట్రేలియాల టెస్టు మ్యాచ్ లో మన్కడింగ్ తొలిసారి జరిగింది. ఆసీస్ ఆటగాడు బిల్ బ్రౌన్ ను భారత బౌలర్ వినో మన్కడ్ ఇలా అవుట్ చేసి తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. ఇలా స్థిరపడిందే మన్కడింగ్.  ప్రస్తుత అండర్-19 వరల్డ్ కప్ ను విండీస్ చేజిక్కించుకోవడానికి మన్కడింగ్ ఎంతో కొంత సాయ పడిందనే చెప్పాలి.  ఇక్కడ విండీస్ పోరాట పటిమను తక్కువ చేయకపోయినా, వారికి అదృష్టం ఇలా కలిసొచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top