విండీస్ బోర్డులో కలవరం!


బీసీసీఐతో సమావేశమవ్వాలని నిర్ణయం

 

బార్బడోస్: బీసీసీఐ పెద్దరికం, అధికారం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ)ను కలవరపెట్టినట్లున్నాయి. భారత బోర్డుతో ఢీకొంటే మనుగడ సాగించలేమని కూడా వారికి అర్థమైంది. పర్యటనలు రద్దు, భారీ పరిహారంలాంటి నిర్ణయాలతో ఉలిక్కి పడ్డ డబ్ల్యూఐసీబీ భారత క్రికెట్ బోర్డును ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. బీసీసీఐతో వెంటనే ప్రత్యేకంగా సమావేశం కావాలని విండీస్ బోర్డు నిర్ణయించింది. సిరీస్ నుంచి నిష్ర్కమణవంటి పరిణామాలు దురదృష్టకరమని పేర్కొంటూ నష్టనివారణకు సిద్ధమైంది. మంగళవారం ఇక్కడ ఎనిమిది గంటల పాటు జరిగిన సమావేశంలో డబ్ల్యూఐసీబీ సుదీర్ఘంగా చర్చించింది.



స్నేహం కొనసాగాలి...



సమావేశం అనంతరం విండీస్ బోర్డు ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘సిరీస్‌నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం బోర్డును చాలా ఇబ్బంది పెట్టింది. జరిగిన పరిణామాలపై విచారణ జరిపేందుకు కీలక సభ్యులతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాం. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న మంచి సంబంధాల నేపథ్యంలో... బీసీసీఐతో సమావేశం కావాలని భావిస్తున్నాం. విండీస్‌పై తీవ్ర ప్రభావం చూపే భారత బోర్డు నిర్ణయాలపై ఆ సమావేశంలో చర్చిస్తాం. జరిగిన నష్టాన్ని పూరించేందుకు పరిష్కార మార్గం లభిస్తుందని భావిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాం. కీలక సమయంలో సంయమనంగా వ్యవహరించిన ఐసీసీ, బీసీసీఐ, ప్రసారకర్తలు, స్పాన్సర్లకు మా కృతజ్ఞతలు. భారత బోర్డుతో పాత స్నేహం కొనసాగుతుందని నమ్ముతున్నాం’ అని డబ్ల్యూఐసీబీ ఆ ప్రకటనలో తెలిపింది. దీనిపై బీసీసీఐ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

 

విండీస్ బోర్డుపై ఐసీసీ చర్యలు!

 

భారత పర్యటననుంచి  వెస్టిండీస్ జట్టు అర్ధాంతరంగా వైదొలగిన వ్యవహారంపై ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జోక్యం చేసుకోనుంది. నవంబర్ 10న జరగనున్న ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని చర్చిస్తారు. ‘సామరస్య పద్ధతిలోనే దీనికి పరిష్కారం కనుగొంటాం’ అని ఐసీసీ తన మీడియా ప్రకటనలో పేర్కొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వెస్టిండీస్ జట్టును ఐసీసీ సస్పెండ్ చేయాలనే ప్రతిపాదన ఉంది. దీంతో పాటు 2015 వన్డే ప్రపంచకప్‌లో విండీస్‌కు దక్కాల్సిన పార్టిసిపేషన్ ఫీజును బీసీసీఐకి బదలాయించవచ్చు. అయితే ఇది ద్వైపాక్షిక సిరీస్ కావడంతో బీసీసీఐ అభ్యర్థన మేరకే ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top