రజత రాహుల్

రజత రాహుల్


వెయిట్‌లిఫ్టింగ్‌లో మెరిసిన తెలుగు కుర్రాడు

యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం

నాన్‌జింగ్ (చైనా): అంతర్జాతీయ యవనికపై తెలుగు తేజం రాగాల వెంకట రాహుల్ మరోసారి మెరిశాడు. గత నాలుగేళ్లుగా వెయిట్ లిఫ్టింగ్‌లో నిలకడగా విజయాలు సాధిస్తున్న రాహుల్ తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఇక్కడ జరుగుతున్న రెండవ యూత్ ఒలింపిక్స్‌లో గురువారం 77 కేజీల విభాగంలో జరిగిన పోటీలో రాహుల్ రజత పతకం సాధించాడు. ఆరు రోజులుగా జరుగుతున్న ఈ క్రీడల్లో భారత్‌కు దక్కిన తొలి పతకం ఇదే కావడం విశేషం. స్నాచ్‌లో 141 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 175 కేజీలు (మొత్తం 316 కేజీలు) బరువు ఎత్తిన రాహుల్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో ఆర్మేనియాకు చెందిన హకోబ్ క్రిచియన్ (319 కేజీలు) స్వర్ణ పతకం గెలుచుకోగా, జస్లాన్ కలియెవ్ (కజకిస్థాన్-310 కేజీలు)కు కాంస్యం దక్కింది.

 

ఆఖరి ప్రయత్నం విఫలం...

స్నాచ్ విభాగంలో రాహుల్ తొలి ప్రయత్నంలో 135 కేజీల బరువు ఎత్తి ముందంజ వేశాడు. అయితే హకోబ్ 137 కేజీలు ఎత్తి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే రెండో ప్రయత్నంలో రాహుల్ 139 కేజీలు ఎత్తగలిగాడు. మూడో ప్రయత్నంలో తన ప్రదర్శనను మరింత మెరుగు పర్చుకుంటూ 141 కేజీలకు తీసుకెళ్లాడు. అయితే చివరి ప్రయత్నం చేసిన హకోబ్ 142 కేజీల బరువు ఎత్తి మొదటి స్థానంలో నిలిచాడు.

 

క్లీన్ అండ్ జర్క్‌లో తొలి రెండు ప్రయత్నాల్లో రాహుల్ 170, 175 కేజీల బరువు ఎత్తాడు. మరో వైపు ప్రత్యర్థి హకోబ్ మొదటి ప్రయత్నంలో 172 కేజీలు ఎత్తినా...రెండో ప్రయత్నంలో విఫలమయ్యాడు. మూడో సారి మాత్రం అతను 177 కేజీలు ఎత్తి రాహుల్‌కు సవాల్ విసిరాడు. దాంతో 179 కేజీలు ఎత్తితే స్వర్ణం నెగ్గే స్థితిలో రాహుల్ నిలిచాడు. అందు కోసం తీవ్రంగా ప్రయత్నించినా లిఫ్ట్ చేయలేకపోయాడు. ఫలితంగా రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది మార్చిలో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్నాచ్‌లో 133, క్లీన్ అండ్ జర్క్‌లో 163 (మొత్తం 296 కేజీలు) మాత్రమే ఎత్తగలిగిన రాహుల్... ఈ సారి తన ప్రదర్శనను అద్భుతంగా మెరుగు పర్చుకున్నాడు. ఏకంగా 20 కేజీలు ఎక్కువగా అతను బరువెత్తడం విశేషం.

 

బార్ జారిపోయింది

‘మూడో ప్రయత్నంలో 179 స్కోరు సాధించే క్రమంలో క్లీన్ వరకు బాగానే చేశాను. అయితే జర్క్ సమయంలో మెడపై చెమట ఎక్కువై బార్ జారిపోయింది. దాంతో కొద్ది తేడాతో స్వర్ణం కోల్పోయాను. కాస్త నిరాశగా అనిపించినా ఇది నా కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కాబట్టి సంతృప్తిగా ఉన్నాను. ఎన్‌ఐఎస్‌లో ఎనిమిది నెలల శిక్షణ యూత్ ఒలింపిక్స్‌లో ఫలితాన్ని ఇచ్చింది. మా కోచ్‌లు ఎంతో సహకరించారు. వచ్చే జనవరిలో ఆసియా చాంపియన్‌షిప్ నా తదుపరి ఈవెంట్. ఆ తర్వాతి నుంచి పూర్తి స్థాయిలో సీనియర్ కేటగిరీ కోసం సాధన మొదలు పెడతా. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా జీవిత లక్ష్యం’

     - ‘సాక్షి’తో నాన్‌జింగ్ నుంచి రాహుల్



‘పాల్గొన్న తొలిసారే రాహుల్ యూత్ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడం చాలా సంతోషంగా ఉంది. చైనా వెళ్లే ముందే గెలుస్తానని నమ్మకంగా ఉన్నాడు. అతని ప్రదర్శన తర్వాత నాకు మిత్రులు, సన్నిహితులనుంచి వస్తున్న అభినందనలు చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ఒలింపిక్స్‌లోనూ గెలుస్తానని నాకు తరచూ చెబుతున్నాడు. వాడు ఆ స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నా. రాహుల్ స్ఫూర్తితో మా రెండో అబ్బాయి కూడా వెయిట్ లిఫ్టింగ్‌లో

 రాణిస్తున్నాడు’     - రాహుల్ తండ్రి మధు

 

కెరీర్‌లో అత్యుత్తమ విజయం

ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు (ఆగస్ట్ 21), ఇదే వేదిక...యూత్ ఆసియా క్రీడల్లో రాహుల్ స్వర్ణ పతకం గెలుచుకొని సత్తా చాటాడు. యాదృచ్ఛికంగా ఇప్పుడు కూడా అదే వేదికపై ఆసియా స్థాయిని దాటి యూత్ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడం విశేషం. 17 ఏళ్ల రాహుల్, రంగారెడ్డి జిల్లా హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి. ఈ ఏడాదే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన అతను స్పోర్ట్స్ స్కూల్ ‘అలుమ్ని’గా ఇక్కడే శిక్షణ కొనసాగిస్తున్నాడు.  కోచ్‌లు ఎస్‌ఏ సింగ్, పి. మాణిక్యాలరావుల పర్యవేక్షణలో అతను తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలు సాధిస్తున్నాడు.



జాతీయ స్థాయిలో రాష్ట్రం తరఫున నిలకడగా రాణించిన తర్వాత రెండేళ్ల క్రితం సమోవాలో జరిగిన యూత్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకొని తొలిసారి అతను అంతర్జాతీయ వేదికపై పతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత గత రెండేళ్లలో యూత్ ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజతాలు, యూత్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం...జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, జూనియర్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజతాలు అందుకున్నాడు. యూత్ ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న రాహుల్‌ను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టింగ్ సంఘం కార్యదర్శి బడేటి వెంకట్రామయ్య అభినందించారు.     

     - సాక్షి క్రీడావిభాగం

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top