11 రోజులు నిస్సహాయంగా గడిపాం

11 రోజులు నిస్సహాయంగా గడిపాం - Sakshi

కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న క్రికెటర్ రసూల్

 న్యూఢిల్లీ: ఎటు చూసినా వరద నీరే.. బయట అడుగు పెట్టే పరిస్థితి లేదు.. ఎవరితోనైనా మాట్లాడదామన్నా నో సిగ్నల్స్.. ఇలాంటి దుర్భర స్థితిలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 11 రోజుల పాటు భారత క్రికెటర్ పర్వేజ్ రసూల్, అతడి కుటుంబం గడపాల్సి వచ్చింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని వరదలు తీవ్రనష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామంది లాగే వీరూ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గడపాల్సి వచ్చింది. వీరి ఇంటి కింది అంతస్తు మొత్తం వరద నీరు చేరడంతో పైఅంతస్తులో వీళ్లంతా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కింద వరద నీటిలో మునిగిపోయిన తన కారులోని క్రికెట్ బ్యాట్లను రసూల్ తనతోపాటు పైకి తీసుకెళ్లగలిగాడు. ‘11 రోజుల పాటు ఎవ్వరితోనూ సంబంధాలు లేకుండా ఉండిపోయాను. టెలిఫోన్, సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్ ఏవీ పనిచేయలేదు. నిజంగా నా కుటుంబం నిస్సహాయంగా ఉండిపోయింది. కింది అంతస్థు మొత్తం నీటితో నిండిపోవడంతో పైఅంతస్థులో తలదాచుకున్నాం. నీటిలో మునిగిన కారులో నాకిష్టమైన బ్యాట్స్ ఉండిపోయాయి. దీంతో మా అమ్మ వారిస్తున్నా వినకుండా మెడ లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి వాటికి తీసుకోగలిగాను. నా ఇంటికి 2 కి.మీ దూరం వెళితే మొబైల్ సిగ్నల్స్ లభించాయి. అనంతనాగ్‌లో ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉంది. రెండు రోజుల్లో శ్రీనగర్‌కు వెళతాను’ అని రసూల్ వివరించాడు.

 

 

 


 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top