వాల్ష్‌కు కొత్త కాంట్రాక్ట్

వాల్ష్‌కు కొత్త కాంట్రాక్ట్


భారత హాకీ కోచ్‌గా కొనసాగింపు

ఫలించిన సాయ్ ప్రయత్నాలు


 

న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన టెర్రీ వాల్ష్ మళ్లీ ఆ పదవిలో కొనసాగనున్నారు. బుధవారం క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఉన్నతాధికారులతో జరిపిన చర్చల అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ‘సాయ్’ వాల్ష్‌కు కొత్త కాంట్రాక్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ‘సాయ్ కృషి వల్ల హాకీ కోచ్‌గా కొనసాగేందుకు వాల్ష్ ఒప్పుకున్నారు. దీనివల్ల భారత హాకీకి మంచి జరుగుతుందని నమ్ముతున్నా’ అని మంత్రి ట్వీట్ చేశారు. మరోవైపు వాల్ష్‌కు, తమకు మధ్య ఎలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తలేదని సాయ్ స్పష్టం చేసింది. ‘సాయ్’ నెలకు వాల్ష్‌కు 16 వేల డాలర్లు చెల్లిస్తోంది. ‘టాక్స్ కట్ చేయడం లేదా జీతభత్యాల విషయంలో ఎలాంటి సమస్య లేదని వాల్ష్ చెప్పారు.



అయితే హాకీకి సంబంధించిన సాంకేతిక అంశాలపై నిర్ణయం తీసుకునే విధానం సరిగా లేదని ఆయన ఆరోపించారు. నిర్ణయాధికారంలో హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్‌తో పాటు తనకు మరింత స్వేచ్ఛ కావాలని అడిగారు. కాబట్టి ‘సాయ్’ వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ విషయాన్ని హాకీ ఇండియాతో చర్చించాల్సి ఉంది’ అని ‘సాయ్’ డెరైక్టర్ జనరల్ జిజీ థామ్సన్ వెల్లడించారు. సెలవుల విషయంపై కూడా వాల్ష్ తమతో చర్చించారని, దీనిపై తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశామన్నారు. అయితే ఈ అంశాన్ని పరిష్క రించాల్సి ఉందన్నారు. ఈ మొత్తం పరిణామాలపై కోచ్ వాల్ష్ సంతృప్తి వ్యక్తం చేశారు. కోచ్‌గా కొన సాగుతానన్నారు.

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top