‘బూడిదే’ బంగారం..!

‘బూడిదే’ బంగారం..!


 ప్రపంచకప్ గెలవకపోయినా ఫర్వాలేదు... యాషెస్ గెలవాలి..! కూనల చేతిలో చిత్తుగా ఓడినా పట్టించుకోరు... యాషెస్ మాత్రం గెలవాలి..! ఏ ఓటమినైనా క్షమిస్తారు... కానీ యాషెస్ ఓటమిని మాత్రం జీర్ణించుకోలేరు..! అటు ఇంగ్లండ్, ఇటు ఆస్ట్రేలియా... రెండు దేశాల్లోనూ ఇదే పరిస్థితి. అందుకే జీవితకాలపు జీరోలను కూడా ఈ ఒక్క సిరీస్ హీరోలను చేస్తుంది. కెరీర్‌లో ఒక్కసారైనా యాషెస్ ట్రోఫీని ముద్దాడాలనేది ఈ రెండు దేశాల క్రికెటర్ల అతి పెద్ద లక్ష్యం. అందుకే తమ ప్రాణమే ఇదన్నట్లు పోరాడతారు.

 

 యాషెస్ అంటే అర్థం బూడిదే కావచ్చు. కానీ క్రికెట్‌లో దాని విలువ అమూల్యం. ఆటకు ముందే మైదానం బయట మాటల యుద్ధం కూడా మొదలవుతుంది. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అభిమానులు తమ జట్టు వెంట వెళ్లి మద్దతిస్తారు. అద్భుత ప్రదర్శనలు, రికార్డులు, గణాంకాలు...అన్నీ చరిత్రకెక్కుతాయి. ఒకటా, రెండా...ఎన్ని గొప్ప మ్యాచ్‌లు. దేశంతో సంబంధం లేకుండా ప్రతి క్రికెట్ అభిమాని ఇష్టపడే సిరీస్ ఇది. అసలు సిసలు టెస్టు క్రికెట్ మజాను అందించేది యాషెస్.

 

 క్రికెట్ చరిత్రలో అతి పురాతన వైరానికి మరోసారి విజిల్ మోగింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపటి నుంచి ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ జరగనుంది. వరుసగా మూడు సిరీస్‌లు గెలుచుకున్న అనంతరం చివరిసారిగా 2013లో జరిగిన యాషెస్‌లో 0-5తో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ సొంతగడ్డపై ప్రతీకారానికి సిద్ధం కాగా... అటు ఆస్ట్రేలియా తమ ఆధిక్యం నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. కార్డిఫ్‌లో బుధవారం తొలి టెస్టు ప్రారంభం కానుండగా, ఆగస్ట్ 24న సిరీస్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో యాషెస్‌కు సంబంధించి విశేషాలు...

 

 ఆ రెండు ఘటనలు...

 ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌కు మొదటి నుంచి యాషెస్ పేరు లేదు. 1877లో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరి గింది. ‘యాషెస్’ పేరు రాక ముందు ఐదు సిరీస్‌లలో కలిపి 9 టె స్టులు జరిగాయి. ఓవల్‌లో జరి గిన ఈ 9వ టెస్టుతో కొత్త వైరానికి తెర లేచింది. ఈ మ్యాచ్‌లో 7 పరుగుల స్వల్ప తేడాతో నెగ్గిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది. ‘ఓవల్‌లో చనిపోయిన ఇంగ్లండ్ క్రికెట్‌కు నివాళులు. శరీరాన్ని దహనం చేసిన బూడిదను ఆస్ట్రేలియా తీసుకెళుతున్నారు’ అని స్థానిక ‘స్పోర్టింగ్ టైమ్స్’ పత్రికలో కథనం ప్రచురితమైంది.

 

 తర్వాతి సిరీస్‌కు అప్పటికే ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఎంపికైన ఇవో బ్లిగ్...ఈ వార్తకు స్పందిస్తూ నేను ఆస్ట్రేలియా నుంచి అదే బూడిద తీసుకొస్తానంటూ శపథం చేశాడు. అన్నట్లుగానే ఆ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో గెలుచుకుంది. దాంతో ఆగ్రహించిన ఆసీస్ మహిళలు కొంత మంది మూడో టెస్టులో వాడిన బెయిల్స్‌ను కాల్చి ‘ఇది ఆస్ట్రేలియా క్రికెట్ బూడిద’ అంటూ బ్లిగ్‌కు అందజేశారు. అప్పటి నుంచి ఈ పోరుకు యాషెస్‌గా ముద్ర పడింది. అసలు బూడిద ఉన్న ఆరంగుళాల యాషెస్ ట్రోఫీ ఇప్పటికీ లార్డ్స్ మ్యూజియంలో ఉంటుంది. ప్రతీ నాలుగేళ్లలో రెండు సార్లు యాషెస్ జరుగుతుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఒక్కోసారి ఆతిథ్యమిస్తాయి.

 ఠ ఇప్పటి వరకు 68 యాషెస్ సిరీస్‌లు జరిగాయి. 32 ఆస్ట్రేలియా గెలవగా, 31 ఇంగ్లండ్ నెగ్గింది. మరో 5 డ్రాగా ముగిశాయి. 138 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా, 105 టెస్టులలో ఇంగ్లండ్ గెలవగా, మరో 93 డ్రా అయ్యాయి.

  క్రికెట్ స్ఫూర్తితో ఇరు దేశాల మధ్య జరిగే రగ్బీ లీగ్ మ్యాచ్‌లను కూడా యాషెస్‌గా వ్యవహరించడం విశేషం.

 ఠ యాషెస్ నేపథ్యంలో ‘ది ఫైనల్ టెస్ట్’ పేరుతో హాలీవుడ్‌లో సినిమా కూడా వచ్చింది.

  అత్యధిక స్కోరు: 903/7 డిక్లేర్డ్ (ఇంగ్లండ్, 1938లో)

  అత్యల్ప స్కోరు: 36 (ఆస్ట్రేలియా, 1902లో)

  అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు: డాన్ బ్రాడ్‌మన్ (37 టెస్టుల్లో 5028)

  అత్యధిక వికెట్లు తీసిన బౌలర్: షేన్‌వార్న్ (36 టెస్టుల్లో 195)

  అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు: లెన్ హటన్ (ఇంగ్లండ్-364, 1938లో)

  అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన: జిమ్ లేకర్ (ఇంగ్లండ్-10/53, 1956లో)

 

 యాషెస్ సిరీస్ షెడ్యూల్

 తొలి టెస్టు: జూలై 8-12    కార్డిఫ్

 రెండో టెస్టు: జూలై 16-20    లార్డ్స్

 మూడో టెస్టు: జూలై 29-ఆగస్టు 2    ఎడ్జ్‌బాస్టన్

 నాలుగో టెస్టు: ఆగస్టు 6-10    ట్రెంట్‌బ్రిడ్జ్

 ఐదో టెస్టు: ఆగస్టు 20-24    ఓవల్

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top