ఫామ్‌లోకొచ్చే దారేది!

ఫామ్‌లోకొచ్చే దారేది! - Sakshi


ఆర్నెళ్ల క్రితం భారత్ ఏ ఫార్మాట్‌లో మ్యాచ్ ఆడుతున్నా విరాట్ ఉన్నాడు కాబట్టి గెలుస్తామనే ధైర్యం ఉండేది. తను ఫామ్‌లో ఉంటే అభిమాని గుండె మీద చేయి వేసుకుని కూర్చోవచ్చు. కానీ గత ఆర్నెళ్లలో ఈ ‘పరుగుల వేటగాడు’ ఆట కంటే మైదానం బయటి వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఫలితంగా ఇప్పుడు ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. తనని ఈ స్థాయికి తెచ్చిన ఆట విషయంలో ఏకాగ్రత లేకపోతే తిరిగి పాతాళానికి వెళతాననే విషయం విరాట్ తెలుసుకుంటే మంచిది.

 

- పరుగుల కోసం తంటాలు పడుతున్న కోహ్లి    

- ఆర్నెళ్లుగా వరుస వైఫల్యాలు   

- మైదానం బయట విశేషాలతోనే వార్తల్లో...

సాక్షి క్రీడావిభాగం


భారత్‌లో 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ సమయానికి కోహ్లికి తుది జట్టులో కచ్చితంగా స్థానం ఉందనే నమ్మకం లేదు. కానీ ఆ తర్వాత నాలుగేళ్ల పాటు తను భారత క్రికెట్‌కు బ్యాటింగ్‌లో పెద్ద దిక్కుగా ఎదిగాడు. ఆ క్రమంలో కెప్టెన్‌గానూ ప్రమోషన్ సంపాదించాడు. అయితే ఆర్నెళ్లుగా తను మైదానంలో తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్నాడు.



గత ఏడాది ఇదే సమయంలో భారత్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో అండర్సన్ వేసిన అవుట్ స్వింగర్లను ముట్టుకోవడానికి కూడా భయపడేంతగా ఫామ్ పోయింది. దీంతో ఆ సిరీస్ అయిపోగానే సచిన్ దగ్గరకు వెళ్లాడు. ఆటలో అనేక మార్పులు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో అదరగొట్టాడు. అద్భుతంగా ఆడి ఒంటరి పోరాటంతో కోహ్లి సత్తా ఏంటో మరోసారి చూపించాడు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఆసీస్‌లో ముక్కోణపు సిరీస్‌లో విఫలమైన భారత వైస్ కెప్టెన్... ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై సెంచరీతో చెలరేగాడు. దీంతో తను గాడిలో పడ్డాడనే అనుకున్నారు.



కానీ ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ సరిగా ఆడలేదు. కీలకమైన ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. పాక్‌తో మ్యాచ్ తర్వాత తాను ఆడిన పది వన్డేల్లో కనీసం ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేదు. తన కెరీర్‌లో అర్ధసెంచరీకి ఇంత విరామం రావడం ఇదే తొలిసారి. ఐపీఎల్‌లో సరిగా ఆడకపోయినా అది భారత క్రికెట్‌కు నష్టం చేసేదేం కాదు. కానీ జూన్‌లో బంగ్లాదేశ్‌లో టెస్టులో కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత మూడు వన్డేల్లో కలిపి చేసిన పరుగులు 49 మాత్రమే. ఇది భారత జట్టుపై తీవ్రంగానే ప్రభావం చూపించింది. సచిన్ రిటైరైన తర్వాత భారత జట్టు అధికంగా ఆధారపడింది విరాట్ కోహ్లి మీదనే. తను ఫామ్‌లో ఉంటే, బాగా ఆడితే విజయాలకు ఢోకా ఉండదు. తను బాగా ఆడిన ప్రతిసారీ జట్టు గెలుస్తుంది. కానీ తను విఫలమైతే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకే కోహ్లి ఇప్పుడు ఫామ్‌లోకి రావాలి.

 

బయటి వ్యవహారాల ప్రభావం

ఈ ఆర్నెళ్ల కాలంలో కోహ్లి మైదానంలో కంటే బయటి అంశాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉన్నాడు. ముఖ్యంగా కెప్టెన్సీ, అనుష్క శర్మ అనే రెండు అంశాలతో తను అనేక వివాదాల్లోకి వెళ్లాడు. ఏడాది క్రితం తొలిసారి అనుష్క శర్మతో ఇంగ్లం డ్‌లో కనిపించిన విరాట్... ఆ విషయాన్ని రాసినందుకు మీడియాపై కక్ష పెంచుకున్నాడు. ఆస్ట్రేలి యాలో ఓ రిపోర్టర్‌ను బండబూతులు తిట్టాడు. ఇక తను వెళ్లిన ప్రతి టూర్‌కూ అనుష్కను తీసుకెళ్లాడు. అది తన వ్యక్తిగత విషయం. కానీ బాగా ఆడనప్పుడు ప్రతి విషయం లెక్కలోకే వస్తుందనే సంగతి కోహ్లి తెలుసుకోవాలి. ఇక కెప్టెన్సీ వచ్చిన తర్వాత కోహ్లి శైలి బాగా మారింది. టెస్టు సారథ్యం తనకు అప్పగించాక... తన మాటల్లో దూకుడు పెరిగింది.



పరోక్షంగా ధోనిని విమర్శించడంతోపాటు తన శైలిని ప్రపంచానికి పరిచయం చేయాలనే తాపత్రయం చూపిస్తున్నాడు. పుజారాలాంటి టెస్టు బ్యాట్స్‌మన్‌కు తుది జట్టులో చోటు లేకుండా చేశాడు. కావాలనే తనకు కావలసిన ఆటగాళ్లను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడనే విమర్శ కూడా చాలా తొందరగా వచ్చేసింది.  సెలక్షన్ సమావేశాల్లోనూ తనకు కావలసిన ఆటగా ళ్ల కోసం పట్టుబట్టాడు. హర్భజన్ సింగ్ పునరాగమనం, అమిత్ మిశ్రా జట్టులోకి రావడం వంటి పరిణామాలు దీనికి సంకేతం. ఓ కెప్టెన్‌గా తనకు కావలసిన క్రికెటర్లను కోరుకునే అవకాశం ఏ కెప్టెన్‌కైనా ఉంటుంది. కానీ తన ముద్ర చూపించాలనే తాపత్రయంలో భవిష్యత్‌ను విస్మరిస్తున్నాడు. ఈ రాజకీయాల్లో, వ్యూహాల్లో పడి ఆటను మరిచిపోతున్నట్లు కనిపిస్తున్నాడు. అలా చేస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహిస్తే మంచిది.

 

తెలుసుకున్నాడు సరే...

తన బ్యాటింగ్ ఫామ్ పోయిందనే విషయం ఆలస్యంగానైనా కోహ్లి తెలుసుకున్నాడు. అందుకే కొద్ది రోజుల క్రితం తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ దగ్గరకు వెళ్లాడు. రాబోయే శ్రీలంక పర్యటన, ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల సిరీస్ నేపథ్యంలో స్లో వికెట్లపై బ్యాటింగ్‌లో కొంత మార్పు చేసుకోవాలని భావించాడు. ముఖ్యంగా స్వీప్ షాట్ ఆడటంలో మెళకువలు తెలుసుకున్నాడు. ఫామ్‌లో ఉన్నప్పుడు అన్ని రకాల షాట్లు అద్భుతంగా ఆడే విరాట్... స్వీప్ షాట్ విషయంలో మాత్రం మొదటి నుంచి కొంత బలహీనంగానే ఉన్నాడు.



బంగ్లాదేశ్‌తో టెస్టులో స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో తను బౌల్డ్ అయ్యాడు. అందుకే రోజుకు రెండు గంటల పాటు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇదే షాట్ ప్రాక్టీస్ చేశాడు. ఇక తాజాగా ప్రాక్టీస్ కోసం భారత్ ‘ఎ’ తరఫున బరిలోకి దిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 16 పరుగులే చేసి స్పిన్నర్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 45 పరుగులు చేసినా తన మార్కు ఆత్మవిశ్వాసం పూర్తిగా కనిపించలేదు. అయితే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడంటే తన ఫామ్ గురించి తెలుసుకున్నాడనే అర్థం. వీలైనంత త్వరగా తను ఫామ్‌లోకి వస్తే బాగుంటుంది. బాగా ఆడకపోతే కెప్టెన్‌ను కూడా ఏ దేశం ఎక్కువకాలం భరించలేదని విరాట్ తెలుసుకోవాల్సి వస్తుంది.





ఒంటరిగానే లంకకు...

- భార్యలు, గర్ల్‌ఫ్రెండ్‌లను తీసుకెళ్లొద్దు   

- ఆటగాళ్లకు బీసీసీఐ ఆదేశం

న్యూఢిల్లీ:
శ్రీలంక పర్యటనకు క్రికెటర్లు గతంలో మాదిరిగా ఒంటరిగానే వెళ్లాలని, భార్యలను, గర్ల్‌ఫ్రెండ్‌లను తీసుకెళ్లొద్దని బీసీసీఐ క్రికెటర్లను ఆదేశించింది. ‘లంక పర్యటనకు వెళ్లే జట్టులోని సభ్యులందరికీ దాదాపుగా నెల రోజులకు పైగా విశ్రాంతి లభించింది. అందరూ తమ కుటుంబసభ్యులతో గడిపే సమయం దొరికింది. కాబట్టి శ్రీలంక పర్యటనకు భార్యలను తీసుకెళ్లొద్దని ఆదేశించాం’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. అదే సమయంలో భారత జట్టుతో పాటు డెరైక్టర్ రవిశాస్త్రి కూడా  వెళ్లడం లేదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో యాషెస్ సిరీస్ సందర్భంగా టెలివిజన్ కోసం ఆయన పని చేస్తున్నారు. ఆగస్టు 9 కల్లా శ్రీలంక చేరతానని శాస్త్రి బోర్డుకు చెప్పినట్లు సమాచారం. ఆగస్టు 12న తొలి టెస్టు సమయానికి ఆయన అందుబాటులో ఉంటారు. ఈ లోగా ప్రాక్టీస్ మ్యాచ్‌ను సహాయక కోచ్‌ల బృందం పర్యవేక్షిస్తుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top