‘రాయల్’గా ఆరంభం

‘రాయల్’గా ఆరంభం


తొలి మ్యాచ్‌లో చెలరేగిన బెంగళూరు

 యువరాజ్, కోహ్లిల మెరుపు ఇన్నింగ్స్

 డేర్ డెవిల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు

 

 ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు బెంగళూరు జట్టులో హాట్ టాపిక్ యువరాజ్ సింగ్. టి20 ప్రపంచకప్ ఫైనల్ అనుభవం దృష్ట్యా... ఐపీఎల్‌లో ఏం చేస్తాడో అనే బెంగ బెంగళూరు జట్టులో ఉంది. కానీ తొలి మ్యాచ్‌తోనే పూర్తిగా గాడిలో పడ్డానని యువీ నిరూపించాడు. సిక్సర్లతో చెలరేగి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెరుపులకు కోహ్లి నిలకడ తోడవడంతో... ఐపీఎల్-7ను రాయల్ చాలెంజర్స్ ఘనంగా ఆరంభించింది.

 

 షార్జా: జట్టులో భారీ మార్పులతో ఏడో సీజన్‌ను ప్రారంభించినా ఢిల్లీడేర్‌డెవిల్స్ ఆటతీరులో మాత్రం మార్పు కనపడలేదు. గత ఏడాది తరహాలోనే ఆల్‌రౌండ్ వైఫల్యంతో తొలి మ్యాచ్‌లో పెద్ద ఓటమిని మూటగట్టుకుంది. షార్జా స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా... డేర్ డెవిల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసింది. డుమిని (48 బంతుల్లో 67 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), టేలర్ (39 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు.

 

 ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 110 పరుగులు జోడించడం విశేషం. బెంగళూరు జట్టు 16.4 ఓవర్లలో రెండు వికెట్లకు 146 పరుగులు చేసి సునాయాసంగా గెలిచింది. పార్థివ్ పటేల్ (28 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్సర్) మంచి ఆరంభాన్నిచ్చాడు. కెప్టెన్ కోహ్లి (38 బంతుల్లో 49 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), యువరాజ్ సింగ్ (29 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడారు. మూడో వికెట్‌కు ఈ ఇద్దరూ అజేయంగా 84 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బెంగళూరు స్పిన్నర్ చహల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

 

 ఆదుకున్న డుమిని, టేలర్

 బెంగళూరు బౌలర్లు స్టార్క్, ఆల్బీ మోర్కెల్, వరుణ్ ఆరోన్‌లు వరుస ఓవర్లలో మయాంక్ అగర్వాల్, దినేశ్ కార్తీక్, మనోజ్ తివారీలను పెవిలియన్ పంపారు. దీంతో ఢిల్లీ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

 

 కాసేపు ధాటిగా ఆడిన విజయ్ (18)ని చహల్ వెనక్కి పంపాడు. ఈ సమయంలో డుమిని, టేలర్.. ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను భుజాన వేసుకున్నారు. నిదానంగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 49 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇద్దరూ సింగిల్స్‌కే ప్రాధాన్యమిచ్చారు.

 

 15 ఓవర్ల వరకు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన బెంగళూరు బౌలర్లు స్లాగ్ ఓవర్లలో లయ తప్పారు. దీన్ని తమకు అనుకూలంగా మల్చుకున్న బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడారు. 16వ ఓవర్‌లో సిక్సర్ కొట్టి టచ్‌లోకి వచ్చిన డుమిని, 18వ ఓవర్‌లో సిక్సర్, ఫోర్ బాది అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో డుమినికి తోడుగా టేలర్ కూడా చెలరేగడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. చివరి ఐదు ఓవర్లలో ఢిల్లీ 63 పరుగులు రాబట్టింది.

 

  యువీ, కోహ్లి అదుర్స్

 బెంగళూరు డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ వెన్నునొప్పి కారణంగా తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండటంతో అతని స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న మ్యాడిన్సన్ రెండో ఓవర్‌లోనే షమీ బౌలింగ్‌లో అవుటై వెనుదిరిగాడు. 6 పరుగులకే తొలి వికెట్ చేజార్చుకున్నప్పటికీ బెంగళూరు బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడారు. నదీమ్ వేసిన ఆరో ఓవర్‌లో పార్థివ్ పటేల్ ఓ సిక్సర్, ఫోర్ కొట్టి అదే ఊపును కొనసాగించాడు. రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించిన తర్వాత పటేల్ అవుటయ్యాడు.

 

 యువరాజ్ సింగ్ ఆరంభం నుంచే వేగంగా ఆడాడు. మరోవైపు 23, 24 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర కోహ్లి రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కోహ్లి ఇచ్చిన క్యాచ్‌లను నీషమ్, అగర్వాల్ నేలపాలు చేశారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోహ్లి సిక్సర్లతో చెలరేగిపోయాడు. మరో ఎండ్‌లో యువరాజ్ సింగ్ ఆకాశ మే హద్దుగా చెలరేగి మొత్తం ఐదు సిక్సర్లు బాదాడు. దీంతో మరో 20 బంతులు మిగిలుండగానే బెంగళూరు గెలిచింది.

 స్కోరు వివరాలు

 ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (సి) కోహ్లి (బి) స్టార్క్ 6; మురళీ విజయ్ (బి) చహల్ 18 ; దినేశ్ కార్తీక్ (సి) పార్థివ్ పటేల్ (బి) ఆల్బీ మోర్కెల్ 0; మనోజ్ తివారీ (సి) పార్థివ్ పటేల్ (బి) వరుణ్ ఆరోన్ 1; డుమిని నాటౌట్ 67; రాస్ టేలర్ నాటౌట్ 43; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 145.

 

 వికెట్ల పతనం: 1-15; 2-16; 3-17; 4-35.

 బౌలింగ్:  స్టార్క్ 4-0-33-1; ఆల్బీ మోర్కెల్ 3-0-18-1;  ఆరోన్ 3-1-9-1; చహల్ 4-0-18-1; దిండా 4-0-51-0; యువరాజ్ 2-0-16-0

 బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: పార్థివ్ పటేల్ (బి) శర్మ 37; మ్యాడిన్సన్ (సి) కార్తీక్ (బి) షమీ 4; కోహ్లి 49 నాటౌట్; యువరాజ్ 52 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.4 ఓవర్లలో 2 వికెట్లకు) 146.

 

 వికెట్ల పతనం: 1-6; 2-62.

 బౌలింగ్: డుమిని 2-0-10-0; షమీ 4-0-30-1; పార్నెల్ 3-0-19-0; నదీమ్ 2.4-0-32-0; రాహుల్ శర్మ 3-0-33-1;  నీషమ్ 2-0-22-0.

 

 ఐపీఎల్‌లో నేడు

 చెన్నై సూపర్ కింగ్స్

 X

 పంజాబ్ కింగ్స్ ఎలెవన్

 సా. గం. 4.00 నుంచి

 

 సన్‌రైజర్స్ హైదరాబాద్

 X

 రాజస్థాన్ రాయల్స్

 రా. గం. 8.00 నుంచి

 వేదిక: అబుదాబి

 సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top