విరాట్ వ్యూహం ఫలించింది!

విరాట్ వ్యూహం ఫలించింది!


కటక్:ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు అనూహ్యంగా భారత జట్టులోకి ఎంపికైన క్రికెటర్ యువరాజ్ సింగ్. దాదాపు మూడేళ్ల తరువాత భారత వన్డే జట్టులో కి వచ్చిన యువరాజ్ సింగ్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. తొలి వన్డేలో యువీ బ్యాట్ తో టచ్ లోకి వచ్చినట్లు కనిపించినా అనవసర తప్పిదంతో అవుటయ్యాడు. లెగ్ స్టంప్ బయటకు వెళ్ల్లే బంతిని ఆడబోయి కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే రెండో వన్డేలో మాత్రం యువీ ఎటువంటి తప్పిదాలు చేయకుండా సహజసిద్ధమైన గేమ్ను కొనసాగించాడు. ఈ మ్యాచ్ తనకు ఎంతో కీలకమని భావించిన యువీ బాధ్యాతయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే యువీ (150) భారీ సెంచరీ సాధించాడు.



ఇదిలా ఉంచితే ఇంగ్లండ్ తో సిరీస్ కు ముందు యువీ ఎంపికపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఎప్పుడో మూడేళ్ల క్రితం వన్డేల్లో బ్యాట్ను పట్టుకున్న యువీ రాణిస్తాడా?అనేది సెలక్టర్ల సందేహం. ఇందుకు కారణం యువీ తన చివరి రెండేళ్లలో 19 మ్యాచ్‌లు ఆడి 18.53 సగటును మాత్రమే నమోదు చేశాడు. ఈ తరుణంలో అతని ఎంపికపై కొద్దిపాటి సందిగ్థత ఏర్పడింది. మరొకవైపు దేశవాళీ టోర్నీల్లో యువరాజ్ ఫామ్ను పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు.. ఇంగ్లండ్ పై యువరాజ్ రికార్డును కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే యువరాజ్ ను  వన్డే, ట్వంటీ 20 జట్టులోకి తీసుకుంటూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.  ఆశ్చర్యకరంగా గత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో బాగా ఆడినప్పుడు వన్డేలను కాదని భారత టి20 జట్టులోకి ఎంపిక చేసిన సెలక్టర్లు, ఈసారి రంజీ ట్రోఫీ ప్రదర్శనను బట్టి వన్డే జట్టులోకి అవకాశం కల్పించారు.  కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా యువరాజ్ ఎంపికకు మొగ్గు చూపడంతో పెద్దగా అడ్డంకులు ఏర్పడలేదు. అయితే అసలు యువరాజ్ ను ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో?అతని ఎంపిక తరువాత కోహ్లినే స్వయంగానే వెల్లడించాడు.


'యువరాజ్ ను ఎంపిక చేసే ముందు చాలా విషయాల్ని పరిగణలోకి తీసుకున్నాం. ప్రధానంగా మిడిల్ ఆర్డర్లో ధోనికి యువీ సాయం ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదనేది సెలక్టన్ కమిటీ భావన. మిడిల్ ఆర్డర్ లో మొత్తం భారాన్ని ధోని ఒక్కడిపైనే వదిలితే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్లో భారాన్ని నాపై వేసుకున్నా, మిడిల్ ఆర్డర్లో ధోనికి మరొక సీనియర్ క్రికెటర్ సపోర్ట్  కావాలి. ప్రత్యేకంగా టాప్ ఆర్డర్ సరిగా రాణించలేనప్పుడు ధోనికి యువరాజ్ సరైన జోడి అని సెలక్టర్లు భావించారు. దాంతోనే యువీ ఎంపికకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం' అని కోహ్లి తెలిపాడు. మరి దాన్ని యువీ నిలబెట్టుకున్నాడు. యువీ ఎంపిక చేసే సమయంలో ఏదైతే పరిగణలోకి తీసుకున్నారో అదే నిన్నటి మ్యాచ్ లో  కనబడింది. టాపార్డర్ లో కీలకమైన మూడు వికెట్లు పడిపోయిన తరుణంలో యువీ సొగసైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ జట్టు 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తరుణంలో యువరాజ్-ధోనిల జోడి 256 పరుగుల భారీ భాగస్వామ్యం సాధించింది. దాంతో యువీపై సెలక్టర్లు పెట్టుకున్న నమ్మకం అతని బ్యాట్ ద్వారా నిరూపించబడింది. మరి యువీ ఎంపికపై విరాట్ వ్యూహం ఫలించినట్లే కదా.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top