విజయుడు!

విజయుడు!


'మమ్మల్ని దురదృష్టం వెంటాడింది. మాపైనే విరాట్ కోహ్లి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అయితే అతడు ఫామ్ కొనసాగించాలని కోరుకుంటున్నా'- ధర్మశాలలో భారత్ తో జరిగిన నాలుగో వన్డే ముగిసిన తర్వాత వెస్టిండీస్ వన్డే కెప్టెన్ చేసిన వ్యాఖ్యలివి. తాను ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో టీమిండియా యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి మరోసారి చూపించాడు. మళ్లీ ఫామ్ అందుకుని విమర్శకుల నోళ్లకు తాళం వేశాడు. అంతేకాదు తాను సెంచరీ చేస్తే టీమిండియా గెలుస్తుందన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశాడు. తను 20 సెంచరీలు చేస్తే 18సార్లు భారత్ గెలవడం గమనార్హం.



ధర్మశాలలో వెస్టిండీస్ తో జరిగిన నాలుగో వన్డేలో కోహ్లి సెంచరీ సాధించాడు. 114 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 127 పరుగులు పిండుకున్నాడు. వన్డేల్లో అతడికి ఇది 20వ సెంచరీ కావడం విశేషం. 141 వన్డేల్లోనే కోహ్లి ఈ ఘనత సాధించాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లి ధర్మశాలలో కళాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లు స్క్వే కట్స్, మణికట్టు ఫ్లిక్స్ లతో అభిమానులను అలరించాడు. దాదాపు 8 నెలల తర్వాత సెంచరీ కొట్టి పరుగులు దాహం తీర్చుకున్నాడు.



కొచ్చిలో జరిగిన తొలి వన్డేలో కోహ్లి 2 పరుగులే చేశాడు. దానికితోడు ఈ మ్యాచ్ లో తన జట్టు కూడా ఘోరంగా ఓడిపోవడం, అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలోనూ కోహ్లి విఫలం కావడంతో అందరూ అతడిని వేలెత్తి చూపించారు. వరుసగా సెంచరీలు కొట్టిన ఆటగాడు పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుండడంతో అందరికీ అతడు లక్ష్యంగా మారాడు. అతడి బ్యాటింగ్ ఆర్డర్ కూడా మార్చాలని సీనియర్లు సలహా కూడా ఇచ్చారు. ఫలితంగా ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో కోహ్లి సెకండ్ డౌన్ లో రావాల్సివచ్చింది. ఈ మ్యాచ్ లో అర్థసెంచరీ(62) సాధించి ఫామ్ లోకి వచ్చిన కోహ్లి.. ధర్మశాలలో దాన్ని కొనసాగించాడు. భవిష్యత్ లోనూ కోహ్లి దూకుడు కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top