పాపం.. టేలర్ మొహం చిన్నబోయింది!

పాపం.. టేలర్ మొహం చిన్నబోయింది! - Sakshi


బ్యాట్స్మెన్ను అవుట్ చేసే ఏ చిన్న అవకాశాన్ని చేజార్చుకున్నా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ముఖ్యంగా క్యాచ్లు వదిలిస్తే ఒక్కోసారి మ్యాచ్ ఫలితమే మారిపోతోంది. భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేలో ఇదే జరిగింది. ఈ మ్యాచ్లో భారత ఓపెనర్ రహానె 5 పరుగులకే అవుటయ్యాడు. టాపార్డర్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ వన్ డౌన్లో బ్యాటింగ్కు దిగాడు. కోహ్లీ కూడా తక్కువ పరుగులకే అవుటయ్యేవాడే..! హెన్రీ బౌలింగ్‌లో విరాట్ ఇచ్చిన క్యాచ్‌ను వైడ్ స్లిప్‌లో టేలర్ నేలపాలుజేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. నేరుగా చేతుల్లో పడిన బంతిని అందుకోవడంలో టేలర్ విఫలమయ్యాడు. అప్పుడు జట్టు స్కోరు 23/1 కాగా, కోహ్లీ 6 పరుగుల వద్ద ఉన్నాడు. ఈ క్యాచ్ మిస్ చేయడం న్యూజిలాండ్కు కోలుకోలేని దెబ్బతగలగా, టీమిండియాకు వరమైంది. విరాట్ అవుటయ్యింటే మ్యాచ్ ఫలితం ఎలా ఉండేదో? ఎందుకంటే మరో భారత ఓపెనర్ రోహిత్ (13) కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కెప్టెన్ ధోనీ తర్వాత సీనియర్లు లేరు. న్యూజిలాండ్ గెలిచేదని చెప్పలేం కానీ విరాట్ను అవుట్ చేసుంటే ఆ జట్టుకు ప్లస్ అయ్యేది.



ప్రపంచ క్రికెట్‌లో టాప్ బ్యాట్స్‌మన్, ఒక్కసారిగా నిలదొక్కుకుంటే ఎదురులేని ఆటతో మ్యాచ్ లాగేసుకోగలడు. మొహాలీ వన్డేలో విరాట్ కూడా అదే చేశాడు. కోహ్లీ (134 బంతుల్లో 16 ఫోర్లు, సిక్సర్తో 154 నాటౌట్) సూపర్ సెంచరీ చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెప్టెన్ ధోనీ (80)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్.. మనీశ్ పాండే (28 నాటౌట్)తో కలసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. విరాట్ పరుగులు పెరుగుతున్న కొద్దీ టీవీ కెమెరాలు తననే చూపిస్తుండటంతో పాపం టేలర్ మొహం చిన్నబోయింది!

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top