సరికొత్త కోహ్లియేటర్

సరికొత్త కోహ్లియేటర్


టీ20ల్లో కోహ్లి పరుగుల వరద

లోపాలను తగ్గించుకున్న భారత స్టార్

నిరంతరం నేర్చుకోవడమే గెలుపు మంత్రం


 

 ‘ఫీల్డర్ లేని చోటును గమనించే కోహ్లి బంతిని బాదుతాడు.. అలాంటప్పుడు ఫీల్డర్‌ను ఎక్కడ ఉంచినా ఒక్కటే’ ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్ సందర్భంగా కోహ్లి ఆట గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ చెప్పిన మాటలు ఇవి. నిజమే గతంలో కోహ్లి మ్యాచ్‌లో ఎప్పటికైనా అవుటయ్యేవాడు.. కానీ ప్రస్తుతం ఎప్పుడెప్పుడు అవుటవుతాడా అని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెరీర్ ప్రారంభించిన కొత్తలో కొన్ని షాట్లు ఆడడంలో బలహీనతలు ఉన్నా సరే స్టార్‌గా మారిన కోహ్లి.. వాటిని తగ్గించుకుంటూ మరోమెట్టు పైకి ఎదిగాడు.

 

విరాట్ కోహ్లి వన్డే, టెస్టుల్లో సూపర్‌స్టార్. అయితే ఇప్పుడు టీ20ల్లో కూడా ప్రపంచ నం.1 బ్యాట్స్‌మెన్‌గా మారాడు. భారీకాయుడు కాకపోయినా.. కొందరు ఆటగాళ్లలా వైవిధ్యమైన షాట్లు ఆడకపోయినా.. బంతిని బలంగా బాదకపోయినా అవలీలగా పరుగులు సాధిస్తున్నాడు. గతేడాది పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కాస్త వెనుపడ్డట్టు కనిపించినా.. ఈ ఏడాది ముగిసిన ఒక నెలలోనే వన్డే, టీ20ల్లో దుమ్మురేపే ప్రదర్శనతో తనేంటో మరోసారి నిరూపించాడు. దీనికంతటికి కారణం అతని లోపాలను తగ్గించుకొని.. ఎప్పటికప్పుడు మెరుగవుతుండడమే.



 షార్ట్ పిచ్ బంతులు..

 కోహ్లి రంజీ ఆడే రోజుల నుంచే షార్ట్‌పిచ్ బంతులను పుల్‌షాట్ ఆడడానికి ఇష్టపడేవాడు. అయితే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఈ తరహా షాట్లు ఆడడంలో అతడి లోపం బయటపడింది. ఎప్పుడో 2008లోనే వన్డే అరంగేట్రం చేసినా.. 2011 వరకు టెస్టుల్లో అవకాశం కోసం ఎదురుచూశాడు. వెస్టిండీస్‌తో ఆడిన తొలిసిరీస్‌లో బలహీనత బయటపెట్టుకొని టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. దాంతో షార్ట్ బంతుల్ని ఎదురుకోవడంలో తన పంథా మార్చుకున్నాడు. లోపాన్ని సరిదిద్దుకోవడానికి చాలా శ్రమించాడు. పుల్‌షాట్ ఆడేటప్పుడు బంతిని వీలైనంతగా కిందకి కొట్టడం ప్రారంభించాడు. ప్రస్తుతం చాలా తక్కువ సందర్భాల్లోనే బౌన్సర్లకు వికెట్‌ను

 సమర్పించుకుంటున్నాడు.



 స్వీప్‌షాట్‌లో ప్రావీణ్యం..

 స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే బౌలర్లు స్వీప్ షాట్లు ఆడడం తరచుగా చూస్తుంటాం. కానీ కోహ్లి స్వీప్ షాట్లు ఆడడం తక్కువ సందర్భాల్లోనే చూస్తాం. మరోవైపు స్పిన్ ఎదుర్కొవడంలోనూ కోహ్లి దిట్టే. అయినా సరే స్వీప్‌షాట్ ఆడడం నేర్చుకున్నాడు. గతేడాది ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు సిరీస్ సందర్భంగా లియోన్ బౌలింగ్ ఆడిన చక్కటి స్వీప్‌షాట్లే అందుకు నిదర్శనం. ఆ టూర్‌లో సూపర్‌సక్సెస్ కా వడానికి ఇది కూడా ఒక కారణం.



 ‘ఆఫ్ సైడ్’ మాస్టర్..

 2014లో టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన ఘోరం. ముఖ్యంగా విరాాట్ కోహ్లి వైఫల్యం అందుకు ఒక కారణం.   ఆఫ్‌స్టంప్ అవతల పడిన బంతులను ఎదుర్కొవడంలో తన లోపాన్ని బయటపెట్టిన కోహ్లి వికెట్‌ను సమర్పించుకున్నాడు. అంతే 2015 వచ్చేసరికి ఆఫ్‌సైడ్ బంతులను ఆడడంలో మాస్టర్‌గా మారిపోయాడు. క్రీజ్‌కు కొంచెం ముందు నిలబడి ఆడడం మొదలుపెట్టాడు. అంతే ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. బ్యాక్‌ఫుట్ ఆడడంలో కూడా కొన్ని మార్పులు చేసుకున్న కోహ్లి ఈ సారి పర్యటనలో పరుగుల వరద పారించాడు. గతంలో అతని పరుగులు సాధించిన ఏరియాలను గమనిస్తే మైదానం నలువైపులా ఉండేవి. ఇప్పుడు సగానికి కంటే ఎక్కువ పరుగులు ఆఫ్‌సైడే బాదుతున్నాడు.



 లోపాల్ని సరిదిద్దుకుని..

నిజానికి ఏ ఆటగాడికైనా కెరీర్ మొదట్లో కొన్ని లోపాలు ఉంటాయి. కోహ్లికి కూడా ఉన్నాయి. అయినప్పటికీ సూపర్‌స్టార్‌గా మారిపోయాడు. తన లోపాల్ని సరిదిద్దుకోకపోయినా.. పరుగుల వరద పారించే టాలెంట్ కోహ్లి సొంతం. అయితే ఇక్కడే కోహ్లి సక్సెస్ మంత్రం బయటపడుతుంది. తన ఆటకు ఎప్పటికప్పుడు మెరుగుపెట్టుకుంటూ లోపాల్ని సరిదిద్దుకొని ప్రత్యర్థి జట్ల బౌలర్లకు సింహస్వప్నంలా మారాడు.



 వీరబాదుడు లేదు..

క్రిస్ గేల్, పొలార్డ్, ధోని, డివిలియర్స్ వంటి భారీ హిట్టర్లు ఉన్నా ఎవరికి సాధ్యం విధంగా టీ20ల్లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు చేసిన ఆటగాడి కోహ్లి నిలిచాడు. టీ20ల్లో వేగంగా పరుగులు సాధించడమే లక్ష్యం అయినా.. అందుకు వెరైటీ షాట్లు అవసరం లేదని కోహ్లి నిరూపించాడు. అతని ఇన్నింగ్‌లో స్విచ్ షాట్లు, రివర్స్ స్విప్‌లు, దిల్ స్కూప్‌లు, అప్పర్ కట్‌లు కనిపించవు. సంప్రదాయ షాట్లే ఉంటాయి. కళాత్మక షాట్లతోనే వేగం పరుగులు సాధించవచ్చని చూపించాడు. ఫీల్డర్ లేని ప్రదేశంలో బంతి పడేట్లు ఆడితే చాలు అన్నట్లు ఉంటుంది కోహ్లి ఆట. ఇటీవలే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భారీ షాట్లు లేవు. కవర్స్ వైపు షాట్లే ఎక్కువ. తొలి మ్యాచ్‌లో అతడు చేసిన పరుగుల్లో 47 శాతం కవర్స్, ఎక్స్‌ట్రా కవర్స్ మధ్య ఆడడం ద్వారానే వచ్చాయంటే కోహ్లి కళాత్మక ఇన్నింగ్స్‌ను అర్థం చేసుకోవచ్చు.



ఆరంభం నుంచే..

ఆసీస్ పర్యటనలో కోహ్లి ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏకంగా ఏడు సార్లు 50కి పైగాస్కోర్లు చేశాడు. పైగా టీ20ల్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అర్థసెంచరీలు చేయడం మామూలు విషయం కాదు. కోహ్లి ఈ స్థాయిలో పరుగుల చేయడానికి మరోకారణం. క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా ఆడడం. ప్రతి మ్యాచ్‌లో గమనిస్తే కుదురుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. రాగానే బౌలర్లపై ఒత్తిడి పెంచే విధంగా బ్యాటింగ్ చేసి విజయవంతమయ్యాడు. ఇక టీ20ల్లో తన బలాన్ని అంచనా వేసుకొని భారీషాట్ల కోసం ప్రయత్నించకుండా క్రికెటింగ్ షాట్లతోనే అలరించాడు. ఈ టీ20 సిరీస్‌లో 199 సగటుతో 199 పరుగులు చేశాడు. ప్రస్తుతానికి టీ20 క్రికెట్ చరిత్రలో 50 సగటును అందుకున్న ఏకైక ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top