బ్యాట్స్‌మెన్‌కు ఫుల్‌ ప్రాక్టీస్‌

బ్యాట్స్‌మెన్‌కు ఫుల్‌ ప్రాక్టీస్‌


వార్మప్‌ మ్యాచ్‌ డ్రా

కోహ్లి అర్ధ సెంచరీ

భారత్‌ తొలి ఇన్సింగ్స్‌ 312/9 డిక్లేర్డ్‌  


కొలంబో: శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌తో జరిగిన రెండు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. తొలి రోజు భారత బౌలర్లు పూర్తి స్థాయిలో తమ సత్తాను ప్రదర్శించగా... రెండో రోజు బ్యాట్స్‌మెన్‌కు కూడా ఫుల్‌ ప్రాక్టీస్‌ లభించినట్టయ్యింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (76 బంతుల్లో 53; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా... రెండో రోజు ఆట ముగిసేసమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 68 ఓవర్లలో 312/9 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. తొలి రోజు ఆటలో లోకేశ్‌ రాహుల్‌ కూడా హాఫ్‌ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 135/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్‌ను అవుట్‌ చేసేందుకు లంక బౌలర్లు తెగఇబ్బంది పడ్డారు.



కేవలం వారికి పాండ్యా (11), జడేజా (18) వికెట్లను మాత్రమే తీయగలిగారు. అంతకుముందు రహానే (40), రోహిత్‌ శర్మ (38), శిఖర్‌ ధావన్‌ (41) కూడా తమ బ్యాట్లకు పనిచెబుతూ క్రీజులో కాస్త సమయాన్ని గడిపారు. కోహ్లి సహా వీరంతా రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగారు. చాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం విశ్రాంతి తీసుకున్న రోహిత్, ధావన్‌ మధ్య 16 ఓవర్లలో 80 పరుగులు జత చేరాయి. వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా (36 నాటౌట్‌) ఆకట్టుకున్నాడు. జడేజా అవుట్‌ కాగానే ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి.



సంక్షిప్త స్కోర్లు:

శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌: 187 ఆలౌట్‌; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 312/9 డిక్లేర్‌ (68 ఓవర్లలో) (రాహుల్‌ 54, కోహ్లి 53, ధావన్‌ 41; ఫెర్నాండో 2/37).

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top