అనుష్క, కోహ్లిల పెళ్లా ?

అనుష్క, కోహ్లిల పెళ్లా ?


కోహ్లి వ్యవహారంపై బోర్డు అధికారి వ్యాఖ్య

త్వరలో పెళ్లి అని చెప్పినందుకే అనుమతి!

ఏమీ చేయలేకపోయానన్న టీమ్ మేనేజర్



ముంబై: తన సినిమాలు సూపర్ హిట్ అయినా ఎన్నడూ రానంత పేరు ఇప్పుడు కోహ్లి క్రికెట్ వైఫల్యంతో అనుష్క శర్మకు వచ్చేసింది... ఈ ఇద్దరి వ్యవహారంపై హల్‌చల్ చేస్తున్న జోక్‌లలో ఇదొకటి. ఇంగ్లండ్‌లో ఘోర పరాజయానికి ఆటకు సంబంధించి కారణాలను పక్కన పెడితే కోహ్లి-అనుష్క వివాదానికి సంబంధించి వివరణ ఇచ్చుకునేందుకే బీసీసీఐ ఆపసోపాలు పడుతోంది. తాజాగా దీనిపై మరో కథనం వెలుగులోకి వచ్చింది.



త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని కోహ్లి చెప్పాడని, అందుకే ఆమెను అనుమతించినట్లు బోర్డులోని కీలక వ్యక్తి ఒకరు చెప్పారు. ‘కోహ్లితో అనుష్కను అనుమతించాలన్న బీసీసీఐ నిర్ణయంతో టీమ్ మేనేజ్‌మెంట్ కూడా సంతృప్తిగా లేదు. ఇదేమిటని అడిగితే... మీడియా కంట పడకుండా కోహ్లి జాగ్రత్త పడగలడని, ఈ రహస్యాన్ని అలాగే ఉంచగలడని మా అధికారులు స్పష్టం చేశారు. అయితే అది కోహ్లికి సాధ్యం కాలేదు’ అని ఆయన వెల్లడించారు.

 

మాకూ ఇష్టం లేదు: మేనేజర్



ఈ టూర్‌లో భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించిన సునీల్ దేవ్ కూడా అనుష్క వ్యవహారంపై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. స్వస్థలం ఢిల్లీ చేరుకున్న అనంతరం ఆయన దీనిపై మాట్లాడారు. ‘నేను కూడా అభ్యంతరం చెప్పేవాడిని. కానీ బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అనుమతి ఇచ్చాక ఏం చేస్తాను? ఇలా చేసే ముందు కార్యదర్శి... బోర్డు అధ్యక్షుడు శివలాల్‌తో కనీసం చర్చించారా, లేదా కూడా తెలీదు. నాకు తెలిసి శివలాల్ దీనిని తిరస్కరించి ఉండేవారు. విదేశీ ఆటగాళ్లు గర్ల్‌ఫ్రెండ్స్‌ను తీసుకెళతారో ఏమో గానీ భారతీయ సంస్కృతి అందుకు అంగీకరించదు’ అని దేవ్ వ్యాఖ్యానించారు. మరో వైపు అనుష్కతో కోహ్లి అనుబంధం గురించి స్పందించేందుకు అతని సోదరుడు వికాస్ తిరస్కరించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top