క్లీన్ స్వీప్ పై విరాట్ సేన గురి!

క్లీన్ స్వీప్ పై విరాట్ సేన గురి!


కోల్కతా: ఇప్పటికే ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ను గెలిచి మంచి ఊపుమీద ఉన్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా క్లీన్స్వీప్పై కన్నేసింది. ఇరు  జట్ల మధ్య ఆదివారం జరిగే చివరిదైన మూడో వన్డే జరుగనుంది. రేపు మధ్యాహ్నం గం.1.30.లకు ఈడెన్ గార్డెన్ లో జరిగే మ్యాచ్ లో గెలుపు కోసం భారత్-ఇంగ్లండ్  జట్లు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఒకవైపు సిరీస్ను వైట్ వాష్ చేయాలని విరాట్ సేన భావిస్తుండగా, కనీసం మ్యాచ్లోగెలిచి పరువు నిలుపుకోవాలని మోర్గాన్  అండ్ గ్యాంగ్ యోచిస్తోంది. తొలి రెండు వన్డేల్లో భారీ స్కోర్లు నమోదు కావడంతో మరోసారి కూడా భారీ స్కోరు నమోదు అయ్యే అవకాశం కనబడుతోంది. మొదటి వన్డేలో 350 పరుగుల లక్ష్యాన్ని భారత్ అవలీలగా ఛేదిస్తే, రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ గ్యాంగ్ 381 పరుగులు నమోదు చేసింది.



ఇదిలా ఉంచితే, 2014లో భారత్-శ్రీలంక జట్ల్లు ఈ స్టేడియంలో ఆఖరిసారి తలపడ్డాయి. చివరిసారి ఇక్కడ భారత్ ఆడిన వన్డేలో 404 పరుగులు చేసింది.  ఆ మ్యాచ్లో భారత్ 153 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఆనాటి మ్యాచ్లో రోహిత్ శర్మ (264) డబుల్ సెంచరీతో లంకేయులపై చెలరేగి ఆడి భారత్ భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. ప్రస్తుత భారత జట్టు మంచి ఫామ్ లో ఉండటంతో భారీ స్కోరు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ కావడంతో మరోసారి భారీ షాట్లు అభిమానుల్ని అలరించే అవకాశం ఉంది.





కాగా, ఇప్పటివరకూ ఈ స్టేడియంలో భారత్ 20 వన్డేలు ఆడగా, 11 మ్యాచ్ల్లో విజయం సాధించింది. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇక్కడ రెండు వన్డేలు జరిగాయి. ఆ రెండింటిలోనూ భారత్నే విజయం వరించడం ఇక్కడ విశేషం. దాంతో ఈ మ్యాచ్లో భారత్ నే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. గతంలో ఇంగ్లండ్ పై ఆడిన రెండు వన్డేల్లోనూ భారత్ 270కు పైగా పరుగులు చేసి విజయం సాధించింది.





భారత ఓపెనర్లకు పరీక్ష



మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన రెండు వన్డేల్లో భారత్ ఓపెనర్లు శిఖర్ ధవన, కేఎల్ రాహుల్ లు ఘోరంగా విఫలమయ్యారు. ఆ రెండు వన్డేల్లో రాహుల్(8),(5) పరుగులు చేసి నిరాశపరిస్తే,  ధవన్ కూడా అదే స్థాయిలో విఫలమయ్యాడు. తొలి వన్డేల్లో ధవన్ పరుగు మాత్రమే చేసి అవుట్ కాగా, రెండో వన్డేలో 11 పరుగులు చేశాడు.  వీరిద్దరూ మినహా మిగతా ఆటగాళ్లు రాణించడంతో భారత జట్టు సిరీస్ ను కైవసం చేసుకోగల్గింది. భారత్ సిరీస్ ను గెలిచిన పక్షంలో ఇప్పుడు శిఖర్, రాహుల్ కు పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. తుది వన్డేలో  తుది జట్టులో ఈ ఇద్దరూ ఆడితో తమ బ్యాటింగ్ లో సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top