కొత్త అధ్యాయం

కొత్త అధ్యాయం


తొలి ప్రొఫెషనల్ బాక్సింగ్ బౌట్‌కు విజేందర్ సిద్ధం

నేడు సన్నీ వైటింగ్‌తో అమీతుమీ


 

మైక్ టైసన్, హోలీఫీల్డ్, మేవెదర్... వీళ్ల గురించి మాత్రమే ఇన్నాళ్లూ విన్నాం. ప్రొఫెషనల్ బాక్సింగ్ అనేది భారత క్రీడాకారులకు ఇన్నాళ్లూ ఓ కల. దానిని సాకారం చేస్తున్నాడు భారత బాక్సర్ విజేందర్. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో దేశానికి తొలి పతకం అందించిన విజేందర్... భారత బాక్సింగ్‌లో కొత్త అధ్యాయానికి తెర తీస్తున్నాడు. ప్రొఫెషనల్‌గా మారి తన తొలి బౌట్‌లో నేడు బరిలోకి దిగబోతున్నాడు. మాంచెస్టర్‌లో నేటి రాత్రి జరిగే పోరులో సన్నీ వైటింగ్‌తో యుద్ధానికి విజేందర్ సిద్ధమయ్యాడు.

 

మాంచెస్టర్:  బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేందర్ సింగ్ కాంస్యం పతకం సాధించిన తర్వాత భారత్‌లో బాక్సింగ్ ఒక్కసారిగా జోరందుకుంది. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది కుర్రాళ్లు బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకం సాధించి స్టార్‌గా మారిపోయిన విజేందర్ ఇప్పుడు మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నాడు. ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో ఎక్కువ పతకాలు సాధించే అవకాశం ఉన్న అమెచ్యూర్ బాక్సింగ్‌ను కాదని ప్రొఫెషనల్ పోటీల వైపు అడుగుపెడుతున్నాడు. కాసుల వర్షంతో పాటు కష్టం కూడా ఎక్కువగా ఉండే ఈ పోటీల్లో ప్రతి అడుగు ఓ క్లిష్టమైన పోరాటం. ఓ రకంగా చెప్పాలంటే ప్రాణాలతో చెలగాటం కూడా.

 

భివానీ నుంచే మొదలు..

 డిగ్రీ అయిన వెంబడే విజేందర్ భివాని బాక్సింగ్ క్లబ్‌లో చేరి కోచ్ జగదీశ్ పర్యవేక్షణలో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకున్నాడు. తర్వాత భారత జాతీయ కోచ్ గురుబక్ష్ సింగ్ శిక్షణలో మరింతగా రాటుదేలాడు. ఇక అక్కడినుంచి ఎన్నో అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నా.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో అతని దశ, దిశ తిరిగిపోయింది. సింగిల్ నైట్‌లో స్టార్‌గా మారిపోయాడు. 2009లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, నంబర్‌వన్ హోదాతో ఓ వెలుగు వెలిగాడు. అదే ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర, 2010లో పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నాడు.  



కాసుల కోసమే...

భారత బాక్సింగ్‌కు కొత్త ఊపు తెచ్చిన విజేందర్ ప్రొఫెషనల్‌గా మారడంతో ఒక్కసారి అందరూ షాక్‌కు గురయ్యారు. కాసుల కోసమే అతను ఆ విధంగా చేస్తున్నాడని విమర్శలు చెలరేగాయి. చాలా మంది అటు వైపు వెళ్లొద్దని వారించినా.. విజేందర్ మాత్రం ప్రొఫెషనల్ బౌట్ వైపే అడుగులు వేశాడు. ఇక దీన్నే కెరీర్‌గా మల్చుకునే ఆలోచనలో ఉన్న విజేందర్, తొలి బౌట్ కోసం గత కొన్ని నెలలుగా ప్రఖ్యాత కోచ్ లీ బియర్డ్ శిక్షణలో కఠోరంగా శ్రమిస్తున్నాడు. జిమ్‌లో గంటల తరబడి సాధన చేస్తున్నాడు. 39 ఏళ్ల బియర్డ్.. ప్రముఖ బాక్సర్ రిక్కీ హట్టన్, అతని సోదరుడు మ్యాథ్యూ హట్టన్‌లకు కోచ్‌గా పని చేశాడు. మేవెదర్ సీనియర్ వద్ద సహాయకుడిగా పని చేశాడు. బాక్సింగ్ కోచ్‌గా మారకముందు కిక్‌బాక్సింగ్, తైక్వాండోలో ప్రావీ ణ్యం సంపాదించాడు.

 

రెండు గెలుపులు.. ఓ ఓటమి

విజేందర్ ప్రత్యర్థి సన్నీ వైటింగ్‌కు ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో పెద్దగా అనుభవం లేదు. ఇంగ్లండ్‌లోని  కెంట్ ప్రాంతానికి చెందిన సన్నీ ఇప్పటి వరకు  కేవలం మూడు బౌట్లలో మాత్రమే పాల్గొన్నాడు. అందులో రెండు గెలిచి ఓ దాంట్లో ఓడాడు. అయితే తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిని నాకౌట్ చేసి ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు. విజేందర్‌తో బౌట్ గురించి సన్నీ పెద్దగా ఆందోళన చెందడం లేదు. భారత బాక్సర్‌ను చిన్న పిల్లాడిగా భావిస్తున్న వైటింగ్ తొలి బౌట్‌లో తన పంచ్ పవరెంటో చూపెడతానని చెబుతున్నాడు.  

 

క్వీన్స్ బెర్రీతో ఒప్పందం

ప్రొఫెషనల్ బాక్సర్‌గా విజేందర్ క్వీన్స్ బెర్రీ ప్రమోషన్స్‌తో ఈ ఏడాది జూన్ 29న ఒప్పదం చేసుకున్నాడు. అయితే ఇప్పటికిప్పుడు విజేందర్‌కు పెద్ద మొత్తంలో డబ్బులు రాకపోయినా... అతని శిక్షణకు, ఇతరత్రా ఖర్చులకు సరిపోయే మొత్తాన్ని ఈ సంస్థ ఇవ్వనుంది. బౌట్‌లో నైపుణ్యాన్ని బట్టి విజేందర్ స్పాన్సర్‌షిప్ పెరిగే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో అభిమానులను అలరించగలిగితే భారత బాక్సర్ పంట పండినట్లే. అయితే ఈ బౌట్‌లో విజేందర్ గెలిచినా... సన్నీకే ఎక్కువ మొత్తంలో డబ్బులు వెళ్తాయి. ఎందుకంటే క్వీన్ బెర్రీ సంస్థ తమకొచ్చే డబ్బులో కొంత శాతం సన్నీకి ఇవ్వాల్సి ఉంటుంది.

 

 రాత్రి. గం 10.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top