ఆసీస్‌పై అదరహో!


సాక్షి క్రీడావిభాగం

గత మ్యాచ్‌లో 99కి అవుటైన ఆటగాడు ఈసారి సెంచరీ సాధిస్తే ఏం చేస్తాడు. ఎగిరి గంతేస్తాడు... అదో రకంగా సంబరం చేసుకుంటాడు. కానీ మురళీ విజయ్ అదేమీ పట్టించుకోలేదు. అసలు అతను తన స్కోరును గుర్తు పెట్టుకోలేదు. ఆ మైలురాయిని చేరినా మామూలుగా ఉండిపోయాడు. అవతలి ఎండ్‌లో రహానే చెప్పాక గానీ అతను బ్యాట్ ఎత్తలేదు. గత ఏడాది కాలంలో మూడు సార్లు మురళీ విజయ్ 90ల్లో (97, 95, 99) అవుట్ కావడం కూడా అందుకు కారణం కావచ్చు.

 

 అయితే సంబరాల సంగతి పక్కన పెడితే... మురళీ విజయ్ కెరీర్‌లో ఐదు సెంచరీలు సాధిస్తే అందులో నాలుగు ఆస్ట్రేలియాపైనే వచ్చాయి. అయితే భారత్‌లో చేసిన మొదటి మూడింటితో పోలిస్తే ఈ శతకం ఎంతో ప్రత్యేకం. ఆస్ట్రేలియాలాంటి పటిష్ట ప్రత్యర్థితో వారి గడ్డపై సెంచరీ సాధించడం అతని స్థాయిని ఖచ్చితంగా పెంచుతుంది. తీవ్రమైన ఎండ, వేడిలో విజయ్ ఎంతో పట్టుదలగా ఆడాడు. ఒకసారి కండరాలు పట్టేసినా, రెండో సెషన్‌లో ప్రత్యర్థి బౌలర్లు పూర్తిగా కట్టడి చేసినా సంయమనం కోల్పోలేదు.

 

  పూర్తిగా చెమటతో తడిసి ముద్దయి, పదే పదే గ్లవ్స్ మారుస్తూ తన ఏకాగ్రతను చెదరనివ్వలేదు. ఆఫ్ స్టంప్ బయట పడిన బంతులను ఎంతో జాగ్రత్తగా వదిలేస్తూనే... 22 ఫోర్లు కూడా బాదడం అతని బ్యాటింగ్ ఎంత తులనాత్మకంగా సాగిందో చెబుతుంది. తాను ఎదుర్కొన్న తొలి 26 బంతుల్లోనే విజయ్ 8 ఫోర్లు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొదటి 150 బంతుల్లో 73 పరుగులే చేసిన విజయ్, తర్వాతి 63 బంతుల్లోనే 71 పరుగులు సాధించాడు. అడిలైడ్‌లో విజయ్ ఇన్నింగ్స్ జట్టును విజయం దిశగా నడిపిస్తే...ఇప్పుడు అతని బ్యాటింగ్ భారత ఆశలకు జీవం పోసింది. హ్యాట్సాఫ్ విజయ్!

 

 ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన ఏడో భారత ఓపెనర్ విజయ్  టెస్టుల్లో విజయ్ 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు  విదేశాల్లో కెప్టెన్‌గా ధోనికిది 29వ టెస్టు. గంగూలీ (28)ని అతను అధిగమించాడు.  1960-61 తర్వాత ఒక విదేశీ జట్టు గాబాలో తొలి రోజు 300కు పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top