2019 ఆసియా క్రీడలను నిర్వహించలేం


తేల్చి చెప్పిన వియత్నాం

 హనోయి: ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రతీ దేశం ఎదురుచూస్తుంటుంది. ఆ అవకాశం దక్కాలే కానీ తమ సత్తా చూపేందుకు సిద్ధమవుతుంటాయి. కానీ వియత్నాం పరిస్థితి అలా లేదు. 2019లో జరిగే 18వ ఆసియా గేమ్స్‌ను నిర్వహించేందుకు ఈ దేశం అర్హత సాధించింది. కానీ అందివచ్చిన ఈ అవకాశాన్ని ఇప్పుడు కాదనుకుంటోంది. ఇలాంటి పెద్ద ఈవెంట్స్‌ను గతంలో నిర్వహించిన అనుభవం లేకపోవడంతో పాటు, దేశంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వియత్నాం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ విషయమై ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఆసియా (ఓసీఏ)తో చర్చిస్తామని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

 

 ఈ గేమ్స్ నిర్వహణకు కొత్త స్టేడియాలు, అథ్లెటిక్స్ విలేజి నిర్మాణాలకు 150 మిలియన్ల డాలర్లు ఖర్చు కాగలవని అధికారులు అంచనా వేశారు. కానీ వాస్తవంగా అంతకు మించే అవుతుందని నిపుణులు తేల్చిచెప్పారు. అంతులేని అవినీతితోపాటు బ్యాంకింగ్ రంగాల్లో నష్టాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో వెంటనే ఈ గేమ్స్ నిర్వహణ నుంచి తప్పుకుని ఆ వ్యయాన్ని ఇతర ముఖ్య అవసరాలకు వినియోగించాలని కొద్దికాలంగా దినపత్రికలు, ఇంటర్‌నెట్ బ్లాగ్స్‌లో వ్యాసాలు, కథనాలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో వియత్నాం ఆసియా గేమ్స్ నుంచి తప్పుకునేందుకే నిర్ణయం తీసుకుంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top