సెల్యూట్ సాకేత్

సెల్యూట్ సాకేత్ - Sakshi


ఒక్క పాయింట్ సాధించి ఉంటే ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్‌తో తలపడే అరుదైన అవకాశం లభించేది. ఒక్క పాయింట్ సాధించి ఉంటే ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లోనే తొలి విజయం దక్కేది. కానీ దురదృష్టం వెంటాడింది. మ్యాచ్‌ను శాసించేస్థితిలో ఉన్నపుడు కాలి కండరాలు పట్టేశాయి. కోర్టులో చురుకుగా కదల్లేని స్థితిలో ఉన్నాడు. అయినా పట్టువిడవలేదు. కుంటుతూనే విజయం కోసం తుదికంటా పోరాటం చేశాడు. ఆఖరికి ఓటమిలోనూ తన విజయాన్ని చూసుకున్నాడు. మ్యాచ్‌లో ఓడిపోయినా తన అసమాన పోరాట పటిమతో అందరి మనసులు గెలుచుకున్నాడు... భారత టెన్నిస్ నంబర్‌వన్ ప్లేయర్, తెలుగు తేజం సాకేత్ మైనేని.  

 

పోరాడి ఓడిన భారత నంబర్‌వన్

కాలి గాయంతో కదల్లేని స్థితిలోనూ ఆడిన వైనం

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ  


న్యూయార్క్: తన కెరీర్‌లో ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లోనే భారత టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని ఆకట్టుకున్నాడు. కీలకదశలో కాలి కండరాలు పట్టేయడం సాకేత్‌కు ప్రతికూలంగా పరిణమించింది. దాంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఈ వైజాగ్ ప్లేయర్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించిన 28 ఏళ్ల సాకేత్... ప్రధాన టోర్నమెంట్ తొలి రౌండ్‌లో ప్రపంచ 49వ ర్యాంకర్ జిరీ వెసెలీ (చెక్ రిపబ్లిక్)తో తలపడ్డాడు. ఏకంగా 3 గంటల 47 నిమిషాలపాటు జరిగిన ఈ మారథాన్ పోరులో చివరకు సాకేత్ 6-7 (5/7), 6-4, 6-2, 2-6, 5-7తో పరాజయం పాలయ్యాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గెలిచుంటే సాకేత్ రెండో రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్, నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)తో ఆడేవాడు.

 

6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 85 కేజీల బరువున్న సాకేత్ ఈ మ్యాచ్‌లో తనలోని అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాడు. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన అతను ఆ తర్వాత వరుసగా రెండు సెట్‌లను సొంతం చేసుకున్నాడు. భారీ సర్వీస్‌లు సంధిస్తూ...  ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్‌లు ఆడుతూ... అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెసెలీపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. అయితే నాలుగో సెట్‌లో సాకేత్ ఆటతీరులో లయ తప్పింది. అనవసర తప్పిదాలు చేయడంతో ఈ సెట్‌ను కోల్పోయాడు.

 

నిర్ణాయక ఐదో సెట్‌లో నాలుగో గేమ్‌లో వెసెలీ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సాకేత్ తన సర్వీస్‌ను కాపాడుకొని 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో సాకేత్ కుడి కాలి తొడ కండరాలు పట్టేశాయి. దాంతో కోర్టులోనే మెడికల్ టైమ్ తీసుకొని టోర్నీ ఫిజియో ద్వారా చికిత్స చేయించుకున్నాడు. అయినా పెద్దగా ఫలితం కనిపించలేదు. సంచలన విజయం దిశగా సాగుతుండటంతో సాకేత్ రిస్క్ తీసుకున్నాడు. చురుకుగా కదల్లేని స్థితిలో ఉన్నా ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. 5-3తో ఆధిక్యంలో ఉన్నదశలో సాకేత్ తన సర్వీస్‌లో విజయం కోసం బరిలోకి దిగాడు. ఈ గేమ్‌లో మ్యాచ్ పాయింట్‌నూ సంపాదించాడు. కానీ సాకేత్ కదల్లేని స్థితిలో ఉండటంతో వెసెలీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.



సాకేత్ ఒకేచోట నిల్చొని సర్వీస్ చేస్తుండటంతో వెసెలీ కోర్టుకిరువైపులా రిటర్న్ షాట్‌లు ఆడుతూ భారత ప్లేయర్ బలహీనతను అనుకూలంగా మల్చుకున్నాడు. ఈ క్రమంలో తొమ్మిదో గేమ్‌లో సాకేత్ సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌లో నిలిచిన వెసెలీ... పదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకున్నాడు. 11వ గేమ్‌లో మరోసారి సాకేత్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన వెసెలీ 12వ గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని విజయం సాధించి ఊపిరి పీల్చుకున్నాడు. తొలి రౌండ్‌లో ఓడిన సాకేత్‌కు 43,313 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 29 లక్షలు)తోపాటు 10 ర్యాంకింగ్ పాయింట్లు, క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడినందుకు మరో 25 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.



మ్యాచ్ మొత్తంలో సాకేత్ 13 ఏస్‌లు సంధించి, కేవలం రెండు డబుల్ ఫాల్ట్‌లు, రెండు అనవసర తప్పిదాలు చేశాడు. తన ప్రత్యర్థి సర్వీస్‌ను 11 సార్లు బ్రేక్ చేయడంతోపాటు తన సర్వీస్‌నూ 11 సార్లు కోల్పోయాడు. మ్యాచ్ పూర్తయిన తర్వాత గ్యాలరీలోని చాలామంది ప్రేక్షకులు సాకేత్ ఆటోగ్రాఫ్‌లు తీసుకొని అతడిని అభినందించారు.

 

‘‘నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. చివరిదాకా బాగా ఆడాను. యూఎస్ ఓపెన్ ద్వారా చాలా అనుకూల అంశాలు లభించాయి. ఇక్కడ నాకు లభించిన మద్దతు అద్భుతం. ఈ అనుభవం భవిష్యత్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు ఉపయోగపడుతుంది.’’ - ‘సాక్షి’తో సాకేత్

 

సాకేత్ ఆసీస్ ప్లేయర్ కాదు....

యూఎస్ ఓపెన్‌లో భారత క్రీడాకారుడు సాకేత్ మైనేని మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇంటర్‌నెట్‌లో గూగుల్ లైవ్ స్కోర్ అప్‌డేట్స్‌లో తప్పిదం చోటు చేసుకుంది. సాకేత్ ఆస్ట్రేలియాకు చెందిన ప్లేయర్ అని తెలిపేవిధంగా అతని పేరుకు ముందు ఆస్ట్రేలియా జెండాను పెట్టారు. మ్యాచ్ చివరిదాకా ఇదే విధంగా కొనసాగించడం గమనార్హం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top