‘భువి’కి దిగిపోయాడు!

‘భువి’కి దిగిపోయాడు!


తొలి ఓవర్లోనే వికెట్... కాస్త ఆలస్యమైనా తొలి స్పెల్‌లోనే ఓపెనర్ ఒకరు కచ్చితంగా పెవిలియన్‌కు... ఇదీ ఆ బౌలర్ శైలి. వేదిక ఏదైనా, వాతావరణం ఎలా ఉన్నా అతని చేతుల నుంచి వెళ్లిన బంతి రెండు వైపులా స్వింగ్ అవుతుంటే, మహా మహా బ్యాట్స్‌మెన్‌లే ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. భువనేశ్వర్ కుమార్ ఘనమైన కెరీర్ ఆరంభంలో ‘మీరట్ కత్తెర’లా అంత పదునుగా సాగింది.

 

తన బలాన్ని మరచి వేగాన్ని అందుకునే ప్రయత్నంలో కోల్పోయిన స్వింగ్... ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టని బౌలింగ్‌తో రికార్డుల కొద్దీ అందిస్తున్న పరుగులు, గాయాల బెడద... తుది జట్టులో స్థానమే లేకపోగా  కాంట్రాక్ట్‌లో కూడా దిగువకు పడిపోయిన వైనం. ఇప్పుడు భువనేశ్వర్ కెరీర్ మొత్తం తిరోగమనమే. ఎక్కడో ఆకాశంలో ఉన్న అతను ఒక్కసారిగా భువికి పడిపోయినట్లుగా ఉంది తాజా స్థితి.

 

మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన భువనేశ్వర్ కెరీర్‌లో అప్పుడే ఎన్నో ఎత్తు పల్లాలు ఎదుర్కొన్నాడు. 22 ఏళ్ల వయసులో వచ్చిన స్టార్ హోదా నుంచి ఇప్పుడు చోటు కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మరి అతను తిరిగి తన పాత ఫామ్‌ను అందుకోగలడా... టీమిండియా ప్రధాన పేసర్‌గా తన గుర్తింపును నిలబెట్టుకోగలడా...!

 

పదును తగ్గిన పేసర్  

* తుది జట్టుకు దూరం  

* పడిపోయిన కాంట్రాక్ట్ గ్రేడింగ్

సాక్షి క్రీడా విభాగం: అంతర్జాతీయ క్రికెట్‌లో భువనేశ్వర్ ప్రవేశమే సంచలనంగా మొదలైంది. పాకిస్తాన్‌తో టి20 మ్యాచ్‌లో 3/9 బౌలింగ్‌లో తొలి మ్యాచ్‌లో అతను అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఐదు రోజుల తర్వాత తొలి వన్డేలో కూడా 9 ఓవర్ల స్పెల్‌లో 3 మెయిడిన్‌లతో చెలరేగాడు.



అంతకుముందు మూడేళ్ల క్రితం రంజీ ఫైనల్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను దేశవాళీలో తొలిసారి డకౌట్ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 13 బంతుల పాటు పరుగు ఇవ్వకుండా కట్టడి చేసి తర్వాతి బంతికి మాస్టర్‌ను అవుట్ చేసిన భువీ, భవిష్యత్తులో భారత్‌కు కీలక బౌలర్ అవుతాడని పెట్టుకున్న అంచనాలు నిజం చేశాడు. బౌలింగ్‌లో మెరుపు వేగం లేకపోయినా... 125-130 కిలో మీటర్ల వేగంతోనే బంతులు సంధించిన అతను అద్భుత ఫలితాలు సాధించాడు.

 

గోల్డెన్ పీరియడ్...

2013లో ఇంగ్లండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ భువీ సత్తా మరోసారి ప్రపంచానికి చూపించింది. ఆ టోర్నీలో భారత్‌తో తలపడిన ఐదు జట్లలో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా అతడిని సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. సహజంగానే బంతిని బాగా స్వింగ్ చేయగల భువీ, అక్కడి పరిస్థితుల్లో ఆరంభంలోనే వికెట్లు తీసి భారత్ విజయానికి బాటలు వేశాడు.



ఆ తర్వాత మరో ఏడాదికి టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపైనే అతని అత్యుత్తమ ప్రదర్శన వచ్చింది. 2014 టెస్టు సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లలో కలిపి అతను 26.63 సగటుతో 19 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. ఇంగ్లండ్‌పై ఒక భారత బౌలర్ ఇన్ని వికెట్లు తీయడం ఇదే మొదటిసారి కాగా... లార్డ్స్ ఆనర్స్ బోర్డులో పేరు లిఖించుకున్న అరుదైన ఆటగాళ్లలో భువనేశ్వర్ ఒకడయ్యాడు.



ఈ సిరీస్‌లో సాధించిన మూడు హాఫ్ సెంచరీలు బ్యాటింగ్‌లో కూడా అతని విలువను చూపించాయి. 2013-14 సంవత్సరానికి అతను ‘బీసీసీఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా కూడా నిలిచాడు.

 

గాయాల సమస్య...

ఈ దశలో చీలమండ గాయం భువీని ఇబ్బందుల్లో పడేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో గాయం కారణంగా అతను మొదటి మూడు టెస్టుల్లో ఆడలేకపోయాడు. చివరిదైన సిడ్నీ టెస్టులో బరిలోకి దిగినా ఏ మాత్రం ప్రభావం చూపించలేక ఒక వికెట్ తీసి ఏకంగా 168 పరుగులు సమర్పించుకున్నాడు.  ప్రపంచకప్ ఆరంభానికి కోలుకోకపోవడంతోపాటు ఉమేశ్, షమీ, మోహిత్ త్రయం కుదురుకోవడంతో అతనికి పెద్దగా మ్యాచ్ అవకాశాలు రాలేదు. షమీ గాయపడిన ఒకే మ్యాచ్‌లో ఆడిన అతను పొదుపుగా బౌలింగ్ చేశాడు.

 

తగ్గిన ప్రభావం...

సిడ్నీ టెస్టు తర్వాత భారత్ ఈ ఏడాది ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. కానీ ఒక్కదాంట్లోనూ భువనేశ్వర్‌కు చోటు దక్కలేదు. శ్రీలంక సిరీస్‌లోనైతే ఒక వైపు భువనేశ్వర్‌లాంటి ప్రధాన స్వింగ్ బౌలర్  జట్టులో ఉన్నా... హడావిడిగా భారత్ నుంచి స్టువర్ట్ బిన్నీని పిలిపించి కోహ్లి తుది జట్టులో స్థానం కల్పించడం భువీపై అపనమ్మకాన్ని చూపిస్తోంది.



బెంగళూరు టెస్టు కోసం స్పిన్నర్ స్థానంలో సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కావాలనుకున్నప్పుడు కూడా భువనేశ్వర్‌ను కాకుండా బిన్నీకే చోటు దక్కింది. ప్రపంచకప్ తర్వాత అతను ఆడిన పది వన్డేల్లో హరారేలో జింబాబ్వేపై (4/33) మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అయితే అతని బౌలింగ్ మరీ పేలవంగా కనిపించింది.



ఐదు వన్డేల్లో కలిపి 7 వికెట్లు తీసిన అతను ఇండోర్ మినహా మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో భారీగా పరుగులు ఇచ్చాడు.  ముంబై వన్డేలో వందకు పైగా పరుగులిచ్చి భారత్ తరఫున అందరికంటే చెత్త రికార్డు నమోదు చేయడం అతని పట్టు జారుతోందనడానికి నిదర్శనం.

 

బలాన్ని వదిలి...

ఉన్నత స్థాయిలో కొంత కాలం పాటు ఆడుతూ వచ్చిన బౌలర్లు ఎవరైనా వైవిధ్యం కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. అయితే ఆ క్రమంలో తన బలాన్ని మరచిపోతేనే కష్టం. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే బంతిని స్వింగ్ చేయడం భువనేశ్వర్ పూర్తిగా మరచిపోయినట్లు కనిపిస్తోంది. ‘భువీ తొలి మ్యాచ్‌లో పాక్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసినప్పుడు అతని వేగం ఎంత అని ఎవరైనా పట్టించుకున్నారా. అందరూ అతని స్వింగ్‌పైనే దృష్టి పెట్టారు.



ఇర్ఫాన్ పఠాన్‌లాగే ఇతను కూడా వేగంగా బంతిని విసిరే ప్రయత్నంలో తనకు గుర్తింపు తెచ్చిన శైలిని పూర్తిగా పక్కన పెట్టాడు. చాలా మంది యువ బౌలర్లలాగే భువీ కూడా తప్పు చేస్తున్నాడు. కటక్‌లో స్వింగ్‌కు మంచి అవకాశం ఉన్న సమయంలో అతను మెక్‌గ్రాత్ తరహాలో బౌలింగ్ చేయబోయి భంగపడ్డాడు’ అని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విశ్లేషించారు. భువీ వేగం గురించి చెప్పలేను గానీ... అతను గతంలోలాగా బంతిని స్వింగ్ చేయలేకపోతున్నాడనేది మాత్రం వాస్తవం అని మాజీ పేసర్ జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు.

 

మార్గదర్శనం కావాలి...

తొలి రెండు టెస్టుల్లో స్థానం దక్కకపోవడంతో రంజీ ట్రోఫీకి వెళ్లి భువీ పటిష్ట జట్లు ముంబై, తమిళనాడులతో రెండు మ్యాచ్‌లు ఆడాడు. అక్కడా 4 వికెట్లు మాత్రమే తీసి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటక ముందే అతను తన లోపాన్ని సరిదిద్దుకోవాల్సి ఉంది. ‘వేగంగా బౌలింగ్ చేయాలంటే స్వింగ్‌ను పక్కన పెట్టాల్సిన అవసరం లేదు.



140 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేస్తూ కూడా స్వింగ్ రాబట్టే బౌలర్లు ఉన్నారు. అతను రనప్ కాస్త పెరిగిన మాట వాస్తవమే. అయితే అతను పూర్తిగా స్వింగ్ కోల్పోలేదు. ఇప్పుడు కావాల్సింది కాస్త నిలకడ చూపించడం. మరి కొంత శ్రమిస్తే అతను త్వరలోనే జట్టులోకి తిరిగొస్తాడు’ అని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.



అరుణ్‌తో పాటు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి తదితరులు అతని సమస్యను సరిగ్గా గుర్తించి మార్గనిర్దేశం చేస్తే పాత భువనేశ్వర్‌లా సత్తా చాటగలడు. లేదంటే ఘనంగా దూసుకొచ్చి నిశ్శబ్దంగా కెరీర్ ముగించిన అనేక మంది భారత బౌలర్ల జాబితాలో చేరిపోయే ప్రమాదం ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top