సంచలనాల పర్వం

సంచలనాల పర్వం - Sakshi


ఐదో సీడ్ రావ్‌నిక్‌కు షాక్

 నిషికోరి అద్భుత విజయం

తొమ్మిదో సీడ్ సోంగా ఇంటిముఖం

 క్వార్టర్స్‌లో ముర్రే, జొకోవిచ్ ‘ఢీ’

 యూఎస్ ఓపెన్


 

ఈసారి యూఎస్ ఓపెన్‌లో సీడెడ్ క్రీడాకారులకు కష్టకాలం నడుస్తోంది. తాజాగా పురుషుల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్ మిలోస్ రావ్‌నిక్, తొమ్మిదో సీడ్ జో విల్‌ఫ్రైడ్ సోంగా... మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ యుజెని బౌచర్డ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలై ఇంటిదారి పట్టారు.

 

 న్యూయార్క్: అమెరికా గడ్డపై ఆసియా యువకెరటం గర్జించింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగింది. 4 గంటల 19 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పదో సీడ్ కీ నిషికోరి (జపాన్) 4-6, 7-6 (7/4), 6-7 (8/10), 7-5, 6-4తో ఐదో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా)పై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికా కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సోమవారం రాత్రి 10 గంటల 7 నిమిషాలకు మొదలై మంగళవారం తెల్లవారుజామున 2 గంటల 26 నిమిషాలకు ముగిసింది. యూఎస్ ఓపెన్ చరిత్రలో ఆలస్యంగా ముగిసిన మ్యాచ్‌గా ఉన్న రికార్డును ఈ మ్యాచ్ సమం చేసింది.

 

  2012లో కోల్‌ష్రైబర్ (జర్మనీ)-జాన్ ఇస్నెర్ (అమెరికా); 1993లో మాట్స్ విలాండర్ (స్వీడన్)-మికేల్ పెర్న్‌ఫోర్స్ (స్వీడన్)ల మధ్య జరిగిన మ్యాచ్‌లు కూడా తెల్లవారుజామున 2 గంటల 26 నిమిషాలకు ముగిశాయి. ఈ గెలుపుతో 1922లో జెంజో షిమిద్‌జు తర్వాత యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న తొలి జపాన్ ప్లేయర్‌గా నిషికోరి గుర్తింపు పొందాడు. రావ్‌నిక్ 35 ఏస్‌లు సంధించినా... కీలకదశలో నిషికోరి అతని సర్వీస్‌లను బ్రేక్ చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

 

వరుసగా 22వసారి...

మరోవైపు టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6-1, 7-5, 6-4తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై గెలిచి వరుసగా 22వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ ఆండీ ముర్రేతో జొకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 7-5, 7-5, 6-4తో తొమ్మిదో సీడ్ సోంగా (ఫ్రాన్స్)ను ఓడించాడు. మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-5, 4-6, 7-6 (9/7), 6-2తో 16వ సీడ్ రొబ్రెడో (స్పెయిన్)పై గెలిచి నిషికోరితో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు.



ఈసారి బౌచర్డ్...

మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ యుజెని బౌచర్డ్ (కెనడా) కూడా నిష్ర్కమించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో  17వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా) 7-6 (7/2), 6-4తో బౌచర్డ్‌ను బోల్తా కొట్టించింది. ప్రస్తుతం టాప్-10 సీడింగ్స్‌లో టాప్ సీడ్ సెరెనా, పదో సీడ్ వొజ్నియాకి మాత్రమే బరిలో ఉన్నారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో 16వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) 4-6, 6-4, 6-4తో క్వాలిఫయర్, ప్రపంచ 145వ ర్యాంకర్ అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా)పై గెలిచింది.

 

 సానియా జోరు

 మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా మీర్జా (భారత్)-సోరెస్ (బ్రెజిల్) ద్వయం 7-5, 2-6, 10-5తో రోహన్ బోపన్న (భారత్)-స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంటను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల డబుల్స్ మూడో రౌండ్‌లో సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి 6-3, 6-2తో కౌకలోవా (చెక్ రిపబ్లిక్)-జంకోవిచ్ (సెర్బియా) జంటపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.

 

 పేస్ జోడిలకు చుక్కెదురు

పురుషుల డబుల్స్ మూడో రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ లియాండర్ పేస్ (భారత్)-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జోడి 2-6, 6-4, 1-6తో గ్రానోలెర్స్-లోపెజ్ (స్పెయిన్) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో లియాండర్ పేస్-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం 4-6, 6-4, 8-10తో స్పియర్స్ (అమెరికా)-గొంజాలెజ్ (మెక్సికో) జోడి చేతిలో ఓటమిపాలైంది.

 

సెమీస్‌లో షుయె పెంగ్

మహిళల సింగిల్స్ విభాగంలో చైనా క్రీడాకారిణి షుయె పెంగ్ సెమీఫైనల్లోకి

ప్రవేశించింది. ఇద్దరు అన్‌సీడెడ్ క్రీడాకారిణుల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్లో షుయె పెంగ్ 6-2, 6-1తో బెలిండా బెన్‌సిక్ (స్విట్జర్లాండ్)పై గెలిచింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top