టైసన్ ఫ్యూరీ కొత్త చరిత్ర

టైసన్ ఫ్యూరీ కొత్త చరిత్ర


బెర్లిన్: అనుభవం ఓడిపోయింది.. అద్భుతం జరిగింది.  వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో అంచనాలకు మించి రాణించిన టైసన్ ఫ్యూరీ(బ్రిటన్) సరికొత్త చాంపియన్ గా అవతరించాడు.  బాక్సింగ్ క్రీడా చరిత్రలో గత 11 ఏళ్లుగా  ఓటమి ఎరుగకుండా అప్రతిహత జైత్రయాత్ర సాగిస్తున్న వ్లాదిమిర్ క్లిచ్ కో(ఉక్రెయిన్) కు టైసన్ ఫ్యూరీ తాజాగా చెక్ పెట్టి కొత్త చరిత్ర సృష్టించాడు.  డ్యూసెలదార్ఫ్ లో శనివారం జరిగిన పోరులో టైసన్ ఫ్యూరీ 115-112,115-112, 116-111 తేడాతో వ్లాదిమిర్ ను కంగుతినిపించాడు. 2004 నుంచి డబ్యూబీఏ, ఐబీఎఫ్, ఐబీవో, డబ్యూబీవో తదితర టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకున్న వ్లాదిమిర్ ను టైసన్ ఫ్యూరీ  మట్టికరిపించి వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ షిప్ టైటిల్ ను ముద్దాడాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో టైసన్ ఫ్యూరీ విజయం సాధించినట్లు జడ్జిలు తమ  ఏకగ్రీవ నిర్ణయంలో ప్రకటించారు.





ఈ విజయంతో టైసన్ ఫ్యూరీ ఆనందంలో మునిగిపోయాడు. తాను విజయం సాధించినందుకు ముందుగా జీసెస్ క్రిస్ట్ కు ధన్యవాదాలు తెలిపాడు. తాను ఏమైతే చేయాలనుకున్నానో దాన్ని రింగ్ లో కచ్చితంగా అమలు చేసినట్లు ఫ్యూరీ తెలిపాడు. ఇప్పటివరకూ 25 ప్రొఫెషనల్ బౌట్లను గెలుచుకున్నతనకు వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్ గా నిలవాలన్నది ఓ కల అని ఫ్యూరీ ఆనంద బాష్పాలు రాల్చాడు.  గత కొంత కాలం నుంచి పడ్డ శ్రమకు తగిన ఫలితం దక్కిందన్నాడు. ఈ రోజు కోసం విపరీతంగా కష్టించినట్లు ఫ్యూరీ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, ఫ్యూరీ వేగం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వ్లాదిమిర్ తెలిపాడు. త్వరలో తన రిటైర్మెంట్ పై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వ్లాదిమిర్ తెలిపాడు. ఇటీవల 40 ఒడిలోకి అడుగుపెట్టిన వ్లాదిమిర్.. 27 ఏళ్ల వయసుగల ఫ్యూరీ చేతిలో ఓడిపోవడం బాక్సింగ్ విశ్లేషకుల్ని సైతం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ముందు నుంచి ఈ పోరులో వ్లాదిమిర్ చాంపియన్ గా నిలుస్తాడన్న అంచనాలను ఒమ్ముచేసిన టైసన్ ఫ్యూరీ..  అద్భుతాలు చేయడానికి అనుభవం అక్కర్లేదని మరోసారి నిరూపించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top