మొహాలీ-నాగపూర్ సేమ్ టూ సేమ్..!

మొహాలీ-నాగపూర్  సేమ్ టూ సేమ్..! - Sakshi


నాగ్ పూర్: మొహాలీ టెస్టు మాదిరిగా నాగపూర్లోనూ సేమ్ టూ సేమ్. ఈ రెండు మ్యాచ్ల్లోనే భారత స్పిన్నర్లదే హవా. టీమిండియా రెండు టెస్టులనూ ముచ్చటగా మూడే రోజుల్లో ముగించేసి.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో నాగ్ పూర్ లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 124 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది. అంతకుముందు మొహాలీలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 108 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన (డ్రా) సంగతి తెలిసిందే.



వన్డే, టీ 20 సిరీస్ లను దక్కించుకున్న సఫారీలను టెస్టుల్లో కట్టడి చేయాలని భావించిన టీమిండియా అందుకు అనుగుణంగానే స్పిన్ పిచ్ లను రూపొందించింది. దీంతో ఊహించినట్లుగానే స్పిన్ పిచ్ లపై సఫారీలు అతి దారుణంగా చతికిలబడ్డారు. ఇప్పటివరకూ టీమిండియా గెలిచిన రెండు టెస్టుల్లో దాదాపు అన్ని వికెట్లు స్పిన్ కే దక్కడం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. తొలి టెస్టులో టీమిండియా 19 వికెట్లను స్పిన్ రూపంలో సాధించగా, ఒక వికెట్ మాత్రమే పేస్ బౌలర్ కు దక్కింది. మొదటి టెస్టులో అశ్విన్ ఎనిమిది వికెట్లు, జడేజా ఎనిమిది వికెట్లు, మిశ్రా మూడు వికెట్లు తీశారు. ఇక మూడో టెస్టు విషయానికొస్తే టీమిండియా సాధించిన మొత్తం ఇరవై వికెట్లు స్పిన్నర్లే తీశారు. వీటిలో అశ్విన్ 12 వికెట్లు సాధించగా, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజాలకు తలో నాలుగు వికెట్లు తీశారు.  దీంతో టీమిండియా ఆడిన రెండు టెస్టుల్లో 100 పైగా పరుగుల తేడాతో ఘనవిజయం సాధించగా.. ఈ మ్యాచ్ లు ఒకే తరహాలో ఏకపక్షంగా ముగిశాయి.


ఈ రెండు టెస్టుల్లో స్పిన్నర్లకే వికెట్లు దక్కడం, మూడు రోజుల్లో నిస్సారంగా ముగియడం పట్ల నెటిజన్లు నుంచి విమర్శలు వచ్చాయి. టీమిండియా స్పిన్ పిచ్ లను రూపొందించడంతో అసలు పోటీతత్వం లేకుండా పోయిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.  మరి ఢిల్లీలో జరిగే నాల్గో టెస్టుకు సేమ్ టూ సేమ్  స్పిన్ పిచ్ నే రూపొందిస్తారా? లేక సిరీస్ గెలిచారు కాబట్టి సహజసిద్ధమైన వికెట్ నే కొనసాగిస్తారా? అనేది చూడాల్సిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top