ముంబై మెరిసేనా..?

ముంబై మెరిసేనా..? - Sakshi


నేడు గుజరాత్‌తో తలపడనున్న రోహిత్‌సేన

ముంబై వరుస విజయాలకు పుణే అడ్టుకట్ట..

ఆత్మవిశ్వాసంతో లయన్స్‌




రాజ్‌కోట్‌: ఈ సీజన్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్‌ శనివారం గుజరాత్‌ లయన్స్‌తో తలపడనుంది. వరుసగా ఆరు విజయాలు సాధించిన ముంబై జోరుకు చివరి మ్యాచ్‌లో అడ్డుకట్ట పడింది. దీంతో మళ్లీ గెలుపుబాటలోకి ప్రవేశించాలని రోహిత్‌సేన భావిస్తుండగా.. చివరిమ్యాచ్‌లో నెగ్గి ఆత్మవిశ్వాసంతో ఉన్న గుజరాత్‌ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.



ముంబై దూకుడు..

ఈ సీజన్‌లో ముంబై జోరు కొనసాగుతోంది. తొలిమ్యాచ్‌లో రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌ చేతిలో ఓడిన తర్వాత వరుసగా ఆరు విజయాలు సాధించింది. పట్టికలో ‘టాప్‌’స్థానం కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చాలాసార్లు తలపడింది. అయితే గత మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై దూకుడుకు మళ్లీ పుణేనే అడ్డుకట్ట వేసింది. వరుస విజయాలు తెచ్చిన ఊపులో మితిమీరిన అత్మవిశ్వాసంతో రోహిత్‌సేన ఆ మ్యాచ్‌లో ఓడిందంటే అతిశయోక్తి కాదు. దీన్ని సవరించుకోవాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. బ్యాటింగ్‌ విషయానికొస్తే కుర్ర బ్యాట్స్‌మన్‌ నితీశ్‌ రాణా ఎనిమిది మ్యాచ్‌ల్లో 266 పరుగులు చేసి జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. జోస్‌ బట్లర్‌ (230 పరుగులు), కీరన్‌ పోలార్డ్‌ (199 పరగులు) సత్తా చాటుతున్నారు.



కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తిరిగి ఫామ్‌ను అందుకోగా.. పార్థివ్‌ పటేల్‌ ఆకట్టుకుంటున్నాడు. పాండ్య సోదరులు కృనాల్, హర్దిక్‌ అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ తమ ప్రతిభను చాటుతున్నారు. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే మిషెల్‌ మెక్లీనగన్‌ ఎనిమిది మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో సత్తాచాటాడు. జస్ప్రీత్‌ బుమ్రా 9 వికెట్లతో ఆకట్టుకోగా.. హర్భజన్‌ 4 వికెట్లు మాత్రమే తీసినా తక్కువ ఎకానమీ రేట్‌తో రాణించాడు. మలింగ ఫర్వాలేదనిపిస్తున్నాడు. ముంబై ఓడిన రెండు మ్యాచ్‌లు పుణేతో జరిగినవి కావడం విశేషం. ఈక్రమంలో గుజరాత్‌తో మ్యాచ్‌ ద్వారా తిరిగి విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఈ సీజన్‌లో ఇరుజట్లు పరస్పరం తలపడగా.. ఆరు వికెట్లతో ముంబై ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈక్రమంలో శనివారం మ్యాచ్‌లో రోహిత్‌సేన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.



రైనా బరిలోకి దిగేనా..

మరోవైపు గుజరాత్‌ లయన్స్‌ ప్రస్థానం ఈ సీజన్‌లో పడుతూ లేస్తూ సాగుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన రైనాసేన కేవలం మూడు మ్యాచ్‌ల్లో  నెగ్గగా.. ఐదింటిలో పరాజయం పాలైంది. దీంతో పట్టికలో ఆరు పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది. కెప్టెన్‌ సురేశ్‌ రైనా గాయం జట్టును ఆందోళన పరుస్తోంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రైనా భుజానికి గాయం అయింది. గాయంతోనే రైనా బ్యాటింగ్‌ కొనసాగించి జట్టును విజయాతీరాలకు చేర్చాడు. నాకౌట్‌కు చేరాలంటే మిగతా ఆరు మ్యాచ్‌ల్లో వీలైనన్నీ ఎక్కువ మ్యాచ్‌ల్లో గుజరాత్‌ విజయం సాధించాల్సిందే. ఈక్రమంలో సారథి గాయం జట్టును కలవరపరుస్తోంది. అయితే మ్యాచ్‌ ప్రారంభానికల్లా రైనా తుదిజట్టులోకి వస్తాడని జట్టు మేనేజ్‌మెంట్‌క్ష నమ్మకంతో ఉంది.



మరోవైపు ఈసీజన్‌లో సూపర్‌ఫామ్‌లో ఉన్న రైనా.. 309 పరుగులతో జట్టు తరఫున అగ్రస్థానంలో కొనసాగుతున్నడు. బ్రెండన్‌ మెకల్లమ్,  దినేశ్‌ కార్తిక్, ఆరోన్‌ ఫించ్‌ రాణిస్తున్నారు. ఇషాన్‌ కిషన్‌ తన బ్యాట్‌కు పనిచెప్పాల్సి ఉంది. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే సంచలన పేసర్‌ అండ్రూ టై 12 వికెట్లతో అదరగొడుతున్నాడు.  స్టార్‌ స్పిన్నర్‌ రవీంద్ర జాడేజా.. బెంగళూరు మ్యాచ్‌లో తన మ్యాజిక్‌ చూపాడు.  బాసిల్‌ థంప్సి, జేమ్స్‌ ఫాల్క్‌నర్‌ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. మరోవైపు గత సీజన్‌లో ముంబైతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్‌ విజయం సాధించడం విశేషం. దీంతో శనివారం మ్యాచ్‌లో అదే ప్రదర్శన పునరావృతం చేయాలని రైనాసేన కృత నిశ్చయంతో ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top